సీఎన్‌జీ కార్లు తెగ కొనేస్తున్నారు.. అసలు వీటి వల్ల పర్యావరణానికి నిజంగానే ప్రయోజనం కలుగుతుందా ?
పెట్రోల్, డీజిల్ ధరలు సగటున లీటరుకు రూ.100కి అటూ ఇటూగా ఉన్న ప్రస్తుత తరుణంలో సీఎన్‌జీ (CNG - Compressed Natural Gas) వెహికల్స్ భారతీయ మార్కెట్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకున్నాయి. దాదాపు అన్ని ప్రముఖ కార్ల కంపెనీలు తమ పెట్రోల్ మోడల్స్‌తో పాటు సీఎన్‌జీ వెర్షన్‌లను కూడా అందిస్తున్నాయి.
దీనివల్ల వినియోగదారులకు ఇంధనంపై దీర్ఘకాలంలో గణనీయమైన ఆదా (Savings) లభిస్తుంది. అయితే, అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఈ సీఎన్‌జీ ఇంధనం, పెట్రోల్/డీజిల్ కంటే ఎంత మేరకు శుభ్రమైనది (Cleaner Fuel)? అనే ప్రశ్న తరచుగా వస్తుంది. సీఎన్‌జీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం, పర్యావరణపరమైన సవాళ్ల గురించి తెలుసుకుందాం.

సీఎన్‌జీ వాహనాలు ప్రస్తుతం కేవలం టాక్సీలు లేదా కమర్షియల్ వెహికల్స్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. అనేక ఫీచర్-రిచ్ ప్రైవేట్ కార్లు కూడా పెట్రోల్-సీఎన్‌జీ బై-ఫ్యూయల్ ఆప్షన్లతో వస్తున్నాయి. సీఎన్‌జీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇంధనంపై ఖర్చు గణనీయంగా ఆదా అవుతుంది. పెట్రోల్/డీజిల్‌తో పోలిస్తే సీఎన్‌జీ చాలా చౌకగా లభిస్తుంది. దీనివల్ల ప్రతి నెలా ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది.
బై-ఫ్యూయల్ ఆప్షన్ వల్ల, యజమానులు పెట్రోల్ లేదా సీఎన్‌జీలో దేనిపైనైనా కారును నడపవచ్చు. దీనివల్ల రీఫ్యూయలింగ్ మధ్య ఎక్కువ మైలేజీ (Range) లభిస్తుంది. టాటా మోటార్స్, నిస్సాన్ వంటి కొన్ని కంపెనీలు ఇప్పుడు సీఎన్‌జీ కార్లలో ఏఎంటీ (AMT - Automated Manual Transmission) టెక్నాలజీని కూడా అందిస్తున్నాయి. దీనివల్ల ఈ కార్ల ఆకర్షణ మరింత పెరుగుతోంది.

సీఎన్‌జీ అనేది పూర్తిగా శుభ్రమైన ఇంధనం కాదనే విషయాన్ని గమనించాలి. సీఎన్‌జీ అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (Compressed Natural Gas). ఇది సహజ వాయువు నుంచి తయారవుతుంది. ఇది కూడా ఒక రకమైన శిలాజ ఇంధనమే (Fossil Fuel). అయితే, పెట్రోల్ లేదా డీజిల్‌తో పోలిస్తే సీఎన్‌జీ చాలా వరకు శుభ్రమైన ఇంధనమే. ఎందుకంటే దీని నుంచి కాలుష్యం, పొగ చాలా తక్కువగా విడుదలవుతాయి.
సీఎన్‌జీని పూర్తిగా క్లీన్ ఫ్యూయల్ అనకపోవడానికి ప్రధాన కారణం, దాని ఉత్పత్తి, సరఫరా సమయంలో మీథేన్ గ్యాస్ (Methane Gas) లీకేజీ అవుతుంది. మీథేన్ అనేది కార్బన్ డయాక్సైడ్ కంటే అనేక రెట్లు ఎక్కువ శక్తివంతమైన గ్రీన్‌హౌస్ వాయువు. తక్కువ మీథేన్ లీకేజీ కూడా గ్లోబల్ వార్మింగ్‌పై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందుకే దీనిని పూర్తిగా శుభ్రమైనదిగా పరిగణించరు.
మీథేన్ లీకేజీ సమస్య ఉన్నప్పటికీ, ఆటోమొబైల్ ఇంధనంగా సీఎన్‌జీకి అనేక ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్‌జీ మండినప్పుడు చాలా తక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. అంటే సీఎన్‌జీ కారు కార్బన్ ఫుట్‌ప్రింట్ తక్కువగా ఉంటుంది.
సీఎన్‌జీ నుంచి నైట్రోజన్ ఆక్సైడ్‌లు, పార్టిక్యులేట్ మ్యాటర్ (Particulate Matter) కూడా చాలా తక్కువగా విడుదల అవుతాయి. ఇవే పొగమంచు (Smog), వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు.
సీఎన్‌జీ మండినప్పుడు ప్రధానంగా నీటి ఆవిరి (Water Vapour) చాలా తక్కువ మొత్తంలో సల్ఫర్ ఆక్సైడ్లు, నల్లటి పొగ మాత్రమే ఏర్పడతాయి. అందుకే సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే సీఎన్‌జీ చాలా స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది.


Click it and Unblock the Notifications








