ఇక 53 ఏళ్లకు సరిపడా ఇంధనం మాత్రమే మిగిలి ఉంది!
భూమిపై ఇంధన నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాహనాల సంఖ్య నానాటికీ అధికం అవుతుండటంతో ఇంధన వినియోగం పెరుగుతుండటంతో పాటుగా పారిశ్రామికంగా కూడా ఇంధన వినియోగం ఎక్కువ అవుతున్న సంగతి తెలిసినదే.
ప్రముఖ అంతర్జాతీయ పెట్రోలియం కంపెనీ బ్రిటీష్ పెట్రోలియం (బిపి) పేర్కొన్న సమాచారం ప్రకారం, కేవలం 1678.9 బిలియన్ బ్యారెళ్ల ఇంధనం మాత్రమే నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ ఇంధనం సుమారు 53 సంవత్సరాల 3 నెలల వరకు సరిపోతుందని అంచనా.
వాస్తవానికి, గతంలో బిపి వేసిన అంచనాకు తాజా అంచనాలకు మధ్య కొంచెం వ్యత్యాసం ఉంది. ఇదివరకటి అంచనాతో పోల్చుకుంటే, ఈసారి అంచనా ప్రకారం నిల్వలు ఎక్కువగా (దాదాపు 26 శాతం, ప్రధానం యునైటెడ్ స్టేట్స్‌లో) పెరిగాయి.
కొత్త హారిజాంటల్ డ్రిల్లింగ్ టెక్నాలజీ (భూమిలో అడ్డుగా రంధ్రం వేయటం) కారణంగా ఇంధన నిల్వలు పెరిగినట్లు తెలుస్తోంది. వెర్టికల్ డ్రిల్లింగ్ (భూమిలో నిలువుగా రంధ్రం వేయటం) సాధ్యం కాని లేదా క్లిష్టంగా ఉండే అయిల్ రిజర్వాయిర్లలో ఈ విధానాన్ని ఉపయోగించడం వలన ఇంధన వెలికితీతలో ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దీని ఫలితంగానే ఇంధన నిల్వలు అనుకున్న దాని కన్నా పెరిగాయి.
బక్కెన్, ఈగల్ ఫోర్డ్, పెర్మియాన్ బేసిన్ వంటి కొత్త ఆయిల్ రిజర్వార్లయను ఇప్పుడు హారిజాంటల్ డ్రిల్లింగ్ విధానంలో డ్రిల్ చేసి, ఇంధనం వెలికితీయనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రిజర్వాయర్ల నుంచి ఇంధనాన్ని బయటకు తీయాలని యోచిస్తున్నారు. ప్రత్యేకించి సముద్రం క్రింది భూగంలో ఉన్న చమురును వెలికితీయటానికి మరింత ఉత్తమమైన మైనింగ్ టెక్నిక్స్ అవసరమవుతాయి.
ఈ విధానాలన్నింటినీ చక్కగా అమలు చేస్తే, అతి త్వరలో ఇంధన కొరత వచ్చే అవకాశం ఉండదు. కారణం ఏదేమైనప్పటికీ, ఇకనైనా మనం మేల్కొని ఇంధన వినియోగాన్ని కొంత మేరకైనా తగ్గించుకోకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.


Click it and Unblock the Notifications









