ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మోటార్‌సైకిల్: లియోన్‌హార్ట్ గన్‌బస్ 410
మనం ఇప్పటికే అతిపెద్ద బైక్‌లను అలాగే గిన్నిస్ బుక్‌లో రికార్డు దక్కించుకున్న మోటార్‌సైకిళ్లను చూసే ఉంటాం. అయితే, ఇవన్నీ కూడా విశిష్టమైనవి మరియు కేవలం కాన్సెప్ట్ లేదా ఒకే ఒక మోడల్‌కు మాత్రమే పరిమితమైనవి. కానీ ఇప్పుడు ఈ కథనంలో మనం చెప్పుకోబోయేది ప్రొడక్షన్ వెర్షన్ బిగ్గెస్ట్ మోటార్‌సైకిల్.
ఈ బైక్ పేరు 'లియోన్‌హార్ట్ గన్‌బస్ 410' (Leonhardt Gunbus 410). ప్రొడక్షన్ వెర్షన్ బిగ్గెస్ట్ మోటార్‌సైకిల్స్ పరంగా చూసుకుంటే, ఇది ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మోటార్‌సైకిల్‌గా నిలుస్తుంది. జర్మనీకి చెందిన లియోన్‌హార్ట్ అనే కంపెనీ ఈ గన్‌బస్ 410 బైక్‌ను తయారు చేసింది. రెగ్యులర్‌బైక్‌తో పోల్చి చూస్తే, పరిమాణంలో రెండింతలు పెద్దగా ఉండే ఈ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

జర్మనీకి చెందిన క్లెమెన్స్ ఎఫ్ లియోన్‌హార్ట్ ఈ గన్‌బస్ 410 బైక్‌ను సృష్టించారు. ఈ మోటార్‌సైకిల్ 'ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మోటార్‌సైకిల్'గా (ప్రొడక్షన్ వెర్షన్ విభాగంలో) రికార్డు దక్కించుకుంది.

సాధారణంగా రికార్డుల కోసం తయారు చేసే పెద్ద బైక్‌లు కాన్సెప్ట్ లేదా ఏకైక యూనిట్‌కు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ గన్‌బస్ 410 బైక్ ఓ రోడ్ లీగల్ ప్రొడక్షన్ రెడీ బైక్. డబ్బున్న వారు ఎవరైనా దీనిని కొనుగోలు చేయవచ్చు.

మొత్తం 11 అడుగుల పొడవు ఉండే ఈ బైక్ సీట్ ఎత్తు మాత్రం 30 ఇంచ్‌లు మాత్రమే. అయితే, దీనిని ఎలాంటి సపోర్ట్ లేకుండా రైడ్ చేయొచ్చో లేదో అనే విషయం మాత్రం తెలియలేదు. వాస్తవానికి, దీనికి సైడ్‌కార్‌ను అమర్చుకునే వెసలుబాటు ఉంటుంది.

గన్‌బస్ 410 బైక్ మొత్తం బరువు 650 కేజీలు. పెర్ఫామెన్స్ పొటెన్షియల్ అండ్ వెల్-బ్యాలెన్స్డ్ డిజైన్‌ల కలయికే ఈ బైక్ అని లియోహార్ట్ పేర్కొంది.

గన్‌బస్ 410లో ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ 45 డిగ్రీ 410 క్యూబిక్ ఇంచెస్ (అందుకే దీనికి 410 అనే పేరును పెట్టారు) లేదా 6728సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 350 హెచ్‌పిల శక్తిని, 691 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ జంబో ఇంజన్ 3-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇంతటి భారీ బైక్‌ను వెనక్కు తిప్పడం కష్టం కాబట్టి, దీనికి రివర్స్ గేర్‌ను కూడా జోడించారు.

ఈ బైక్‌కు భారీ టైర్లను అమర్చారు. ముందు వైపు 38 ఇంచ్ టైరును, వెనుక వైపు 42 ఇంచ్ టైరును అమర్చారు.

ఎవరైనా ఈ బైక్‌ను కొనదలుచుకుంటే, 3,50,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. మన దేశ కరెన్సీలో సుమారు రూ.21.86 లక్షలు (పన్నులు కలుపుకోకుండా).


Click it and Unblock the Notifications