బైక్ లేదా స్కూటర్ కొత్త దానిలా మెరిసిపోవాలా.. షో రూమ్ వాళ్లు కూడా చెప్పని సీక్రెట్స్ మీకోసమే
ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైక్ కామన్ అయిపోయింది. చాలా మంది తమ బైక్‌ను ఫ్యామిలీ మెంబర్ మాదిరి భావిస్తారు. అది ఆఫీసుకు వెళ్లే రోజు వారి వాహనం కావొచ్చు. వీకెండ్‌లో షికారుకు తీసుకెళ్లే ఫ్రెండ్ కావొచ్చు, లేదా మీ ఫస్ట్ డ్రీమ్ బైక్ కావచ్చు. ఎండలో మెరిసిపోతున్న బైక్‌ను చూడటం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అయితే, భారతదేశంలోని దుమ్ముధూళితో నిండిన రోడ్లు, వర్షాల మధ్య బైక్‌ను శుభ్రంగా ఉంచడం అంత తేలికైన విషయం కాదు.
బైక్ బాగా దుమ్ము పట్టిందే పాడైపోతుందేమోనని కంగారు పడకండి. మీ బైక్‌ను మెరిపించడానికి మీకు సర్వీస్ సెంటర్ లేదా ఖరీదైన పరికరాలు అవసరం లేదు. కొంచెం సమయం, కాస్త శ్రద్ధ పెడితే, మీరు మీ బైక్‌ను ఇంట్లోనే ప్రొఫెషనల్‌గా కడగవచ్చు. ఇక్కడ బైక్‌ను శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు అందిస్తున్నాము. వీటిని పాటిస్తే మీరు ఒక ప్రొఫెషనల్ లాగా బైక్‌ను మెరిపించగలరు.

నీడలో పార్క్ చేయండి
ఎప్పుడూ బైక్‌ను నీడలో పార్క్ చేసి కడగడం మంచిది. ఎండలో కడిగితే సబ్బు త్వరగా ఆరిపోయి మరకలు పడతాయి. శుభ్రం చేయడం ప్రారంభించే ముందు అందుకు కావాల్సిన వస్తువులను రెడీగా ఉంచుకోండి.
రెండు బకెట్లు (ఒకటి సబ్బు నీటి కోసం, ఒకటి శుభ్రమైన నీటి కోసం), తేలికపాటి బైక్ షాంపూ లేదా కార్ వాష్ లిక్విడ్ (డిటర్జెంట్ కాదు), స్మూత్ స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ క్లాత్, చైన్ క్లీనర్, చిన్న బ్రష్, తర్వాత వేయడానికి చైన్ లూబ్. ఇంజిన్, బ్యాటరీ లేదా సీటు కింద హై ప్రెజర్‌తో నీరు పోయకుండా జాగ్రత్త పడండి. దీనివల్ల ఎలక్ట్రానిక్ భాగాలకు నష్టం కలగవచ్చు.

మొదట ధూళి, మట్టిని తొలగించండి
బైకు శుభ్రం చేయడానికి ముందు పొడి క్లాత్ తీసుకుని దాని ఉన్న దుమ్ము ధూళిని తుడవండి. తర్వాత బైక్‌ను తేలికపాటి నీటితో కడగండి, తద్వారా ధూళి, మట్టి, చెత్త తొలగిపోతాయి. దీనివల్ల రుద్దేటప్పుడు పెయింట్‌పై గీతలు పడవు. చక్రాల దగ్గర, దిగువ భాగం, చైన్ చుట్టూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇవి ఎక్కువగా మురికిగా ఉంటాయి.
తేలికపాటి సబ్బుతో నెమ్మదిగా శుభ్రం చేయండి
ఒక బకెట్ నీటిలో కొన్ని చుక్కల బైక్ షాంపూ వేసి, స్పాంజ్‌తో ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, మడ్‌గార్డ్, అల్లాయ్ వీల్స్‌ను విభాగాల వారీగా శుభ్రం చేయండి. బలంగా రుద్దవద్దు. తేలికపాటి వృత్తాకార లేదా సింపుల్‌గా శుభ్రం చేయండి. బలంగా రుద్దడం లేదా డిటర్జెంట్ వాడటం వల్ల పెయింట్ రంగు పోవచ్చు. బండికి ఉన్న స్టిక్కర్లు పాడైపోవచ్చు. బైక్‌ను ఎప్పుడూ ఓ ఫ్రెండులా చూసుకోండి. ప్రేమగా శుభ్రం చేస్తే నిజమైన మెరుపు వస్తుంది.

చైన్‌ను మర్చిపోవద్దు
ఈ భాగం చాలా ఎక్కువగా పనిచేస్తుంది. కానీ చాలా మంది దీనిని పట్టించుకోరు. బైక్ కడిగిన తర్వాత బ్రష్, చైన్ క్లీనర్‌తో చైన్‌ను శుభ్రం చేయండి. ఆరిపోయిన తర్వాత, నెమ్మదిగా వీల్ తిప్పుతూ దానిపై చైన్ లూబ్ వేయండి. చైన్ పొడిగా అనిపించినా లేదా శబ్దం చేస్తున్నా, దానికి మరింత లూబ్ అవసరమని అర్థం చేసుకోండి.
బాగా ఆరబెట్టి, మెరిపించండి
మైక్రోఫైబర్ వస్త్రంతో బైక్ అన్ని భాగాల నుండి నీటిని శుభ్రంగా తుడిచి వేయండి. ముఖ్యంగా సీటు, ట్యాంక్, స్విచ్‌ల దగ్గర. ఆ తర్వాత బైక్‌ను దాదాపు 10-15 నిమిషాలు నీడలో ఆరనివ్వండి. మీకు షోరూమ్ లాంటి మెరుపు కావాలంటే, పెయింట్ చేసిన భాగాలపై కొద్దిగా పాలిష్ లేదా వాక్స్ వేయండి. టైర్లు, సీటు, బ్రేక్‌లపై పాలిష్ అస్సలు వేయవద్దు, లేకపోతే జారిపోయే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








