త్వరలో వందే భారత్ రైళ్లలో సరికొత్త టెక్నాలజీ.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా.!!
వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతున్నాయి. సాధారణ రైళ్లతో పోలిస్తే వేగంగా ప్రయాణిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ క్రమంలో ఈ సెమీ హై స్పీడ్ రైళ్లకు ప్రజాదరణ లభిస్తోంది. అత్యాధునిక సాంకేతికత, ఆటోమేటిక్ సిస్టమ్‌తో వీటిని రూపొందించారు. అయితే త్వరలో ఈ రైళ్లలో మరో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు.
2025 నాటికి భారత్‌లో కొత్త 100 వందే భారత్(Vande Bharat Express) రైళ్లలో టిల్టింగ్ టెక్నాలజీ(Tilting Technology)ని అమర్చాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం ఈ టెక్నాలజీని సిద్ధం చేసేందుకు విదేశీ కంపెనీలతో భారతీయ రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అసలు ఈ టిల్టింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి.? కేవలం 100 రైళ్లలో మాత్రమే ఈ టెక్నాలజీని ఎందుకు తీసుకువస్తున్నారు.? పూర్తి సమాచారం ఈ కథనంలో..

దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాలను కలుపుతూ వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. దశల వారీగా ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రైళ్లను రూపొందించడంతో వీటిని విదేశీ బుల్లెట్ రైళ్లతో పోల్చుతున్నారు. కాగా వందే భారత్ రైల్వే ప్రాజెక్టును విస్తరించాలని కేంద్రం భావించినప్పుడు.. మొత్తం 400 రైళ్లను తీసుకురావాలని భావించింది. కాగా టిల్టింగ్ టెక్నాలజీతో 100 రైళ్లను రూపొందించాలని నిర్ణయించింది.
అయితే ఈ టిల్టింగ్ టెక్నాలజీని.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో వినియోగిస్తున్నారు. ఇటలీ, పోర్చుగల్, స్లోవేనియా, ఫిన్లాండ్, రష్యా, చెక్ రిపబ్లిక్, లండన్, స్విట్జర్లాండ్, చైనా, జర్మనీ, రొమేనియా దేశాల్లో ఈ Tilting Technology తో ఉన్న రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మన దేశంలో వందే భారత్ రైళ్లు 170 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో రూపొందించారు. కానీ వీటి గరిష్ఠ వేగం 160 కి.మీ గానే ప్రస్తుతం నడిపిస్తున్నారు.

ఒక్క వందే భారత్ రైలు(Vande Bharat Trains) మాత్రమే కాదు.. దేశంలోని రైళ్లన్నీ ఒక్కో సెక్షన్‌లోని ట్రాక్‌ల లేఅవుట్ ప్రకారం వేగ నియంత్రణ కలిగి ఉంటుంది. ఎందుకంటే.. పట్టాలు వంగి ఉంటే రైలు వేగాన్ని అదుపు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రైలు నడిపే లోకో పైలట్లు గుర్తుంచుకోవాలి. దీనికి కారణం సెంట్రిపెటల్ ఫోర్స్.
అభికేంద్ర బలం(Centripetal Force) అంటే.. మనం కార్లలో, బస్సుల్లో వేగంగా వెళ్తున్నప్పుడు.. వాహనాలు టర్నింగ్‌లు తీసుకుంటే మన శరీరం కారు లేదా బస్సు తిరిగే దిశ వైపు మళ్లుతుంది. ఇలాంటి వాహనాల్లో దీని ద్వారా పెద్దగా సమస్య ఏర్పడదు. కానీ రైళ్ల వంటి వాహనాల్లో దీని ద్వారా బోల్తా పడే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండేందుకు వేగాన్ని నియంత్రిస్తారు.

ఇలా మధ్యమధ్యలో రైళ్లలో స్పీడ్ కంట్రోల్ ద్వారా ప్రయాణ సమయం పెరుగుతుంది. ఈ సందర్భంలో, ఈ సమస్యను అధిగమించడానికి, రైళ్లలో టిల్టింగ్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేస్తున్నారు. అంటే వీటిలో స్ప్రింగ్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా రైలు ఎంత వేగంగా మలుపులు తీసుకున్నా.. రైలు చక్రాలు ట్రాక్‌పై నుంచి తప్పిపోవు. అదే సమయంలో ప్రయాణికులపై సెంట్రిపెటల్ ఫోర్స్ ఎఫెక్ట్ కూడా పడదు.
ఈ టెక్నాలజీ ద్వారా రైలు ప్రయాణికులు ఏ వైపునకు పడిపోయే సమస్య ఉండదు. అంతే కాకుండా లగేజీలు కూడా పడిపోకుండా ఉంటాయి. అయితే ఈ సాంకేతికత ప్రస్తుతం మన దేశంలో ప్రవేశపెట్టలేదు. కాగా ఈ టెక్నాలజీని కొత్తగా రానున్న వందే భారత్ రైళ్లలో ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం 100 వందేభారత్ రైళ్లలో ఈ టెక్నాలజీ రాబోతుంది.
ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడానికి, వారి ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ టిల్టింగ్ టెక్నాలజీ ద్వారా ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. కీలకమైన రూట్లలో నడిచే వందేభారత్ రైళ్లకు మాత్రమే ఈ సాంకేతికతను అమర్చాలని కేంద్రం యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








