వర్షాకాలంలో మీ కారు ఎలక్ట్రికల్ సిస్టమ్ సరిగా పనిచేయాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సొంత కారును కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్క కల. తమ అవసరాలకు అనుగుణంగా ఉన్న వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత.. యజమానులు తమ కారును ఎంతో అపురూపంగా జాగ్రత్తంగా చూసుకుంటారు. ఈ క్రమంలో ప్రతి సీజన్‌లోనూ వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా మన వాహనాల పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటం అవసరం.
మరికొద్ది రోజుల్లో వేసవి ముగియనుంది. వేసవి తాపానికి తట్టుకునేలా ఇంతకాలం మీ కార్లను ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో.. ఇప్పుడు వర్షాకాలం సమీపిస్తుండటంతో ఆ వాతావరణానికి అనుగుణంగా వాహనాల నిర్వహణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఎలక్ట్రికల్ సిస్టమ్‌పై వర్షాల ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకోసం కొన్ని చిట్కాలు ఈ కథనంలో..

మీ కారు ఎలక్ట్రికల్ సిస్టమ్ సరిగ్గా ఉంటేనే.. మీ కారుకు సంబంధించి అన్ని భాగాలు సరిగా పనిచేస్తూ వాహనం సాఫీగా నడుస్తుంది. అందుకోసం ఎలక్ట్రికల్ సిస్టమ్స్ నిర్వహణ చాలా ముఖ్యం. వర్షాకాలంలో ఒక్కోసారి నీటి వల్ల సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి ఈ క్రింది అంశాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి.
గుంతల వద్ద అప్రమత్తంగా ఉండాలి : వర్షాకాలంలో రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు నీటి గుంతలు కనపడటం సాధారణం. లేదా రోడ్లే చెరువులను తలపించేలా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కారును నడిపిస్తే వాహనంలోకి నీరు చేరి ఎలక్ట్రికల్ భాగాలు దెబ్బతింటాయి. అలాంటపప్పుడు నీటి మట్టం తగ్గే వరకు వేచి ఉండి ఆ తర్వాత కారు స్టార్ట్ చేయాలి.

సురక్షిత ప్రదేశంలో కారు పార్కింగ్ : వర్షాకాలంలో మీ కారును సురక్షితమైన ప్రదేశంలో పార్క్ చేయడం చాలా అవసరం. వర్షం కురిసినప్పుడు నీటి మట్టాలు పెరిగే ప్రదేశాల్లో కారును పార్కింగ్ చేయకూడదు. లేదంటే కారులోకి నీరు చేరి ఎలక్ట్రిక్ భాగాల్లో వర్షపు నీరు వెళ్లే అవకాశం ఉంటుంది.
కార్ రూఫ్‌ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి : వర్షాకాలంలో మీ కారు పైకప్పును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ప్రత్యేకించి ఇప్పుడు చాలా కార్లలో సన్‌రూఫ్ సౌకర్యం ఉంది కాబట్టి.. వర్షాకాలంలో కారును బయట పార్క్ చేసే ముందు, సన్‌రూఫ్ మరియు కిటికీ రెండూ సరిగ్గా మూసివేయబడిందో లేదో తనిఖీ చేసుకోవడం అవసరం.
రెగ్యులర్ బ్యాటరీ చెకప్ : ముఖ్యంగా వర్షాకాలంలో మీ కారు బ్యాటరీని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. వర్షాకాలంలో నీరు లేదా తేమ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాటరీ సరిగ్గా మూసివేయబడిందో లేదో తనిఖీ చేయాలి. కారులో బ్యాటరీని వీలైనంత సురక్షితంగా ఉంచడం మంచిది.
బాహ్య ఎలక్ట్రికల్ వస్తువులను సురక్షితంగా ఉంచండి : కార్లలో బయటికి కనిపించే కొన్ని ఎలక్ట్రిక్ భాగాలు ఉంటాయి. అందులో కొన్ని ఇంజన్ బేలో కూడా ఉంటాయి. వాటిలోకి నీరు చేరకుండా నిరోధించడానికి కొన్ని భాగాలకు గ్రీజు వేయవచ్చు. అంతే కాకుండా అన్ని విద్యుత్ కనెక్షన్లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో కూడా తనిఖీ చేసుకోవాలి.
పై జాగ్రత్తలను పాటించడం ద్వారా వర్షాకాలంలో మీ కారు ఎలక్ట్రికల్ సిస్టమ్‌లోని భాగాలు నీటి వల్ల పాడవకుండా చూసుకోవచ్చు. వర్షపు నీరు మీ కారు ఎలక్ట్రికల్ సిస్టమ్‌ను డ్యామేజ్ చేయకముందే ఈ చిట్కాలను అనుసరిస్తే మరమ్మతులకు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన బాధ తప్పుతుంది.


Click it and Unblock the Notifications








