Cyclone Michaung తుపానులో మీ కార్లు సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ పనులు చేయండి..
ప్రస్తుతం ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో మిచాంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలతో వరదల కారణంగా జనం బయటకు వెళ్లడం కష్టంగా మారింది. ఇక కార్లు, బైక్‌ల లాంటి వాహనాల సంగతి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో వరదనీటిలో కార్లు మునిగిపోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో యజమానులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి..
మిచాంగ్ తుపాను ఎఫెక్ట్‌తో తమిళనాడులోని చెన్నెలో కురుస్తున్న వర్షాల కారణంగా కార్లు నీళ్లలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలోనూ దాదాపు పరిస్థితి ఇలాగే ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో కార్ల యజమానులు చాలా అప్రమత్తంగా ఉండాలి.

ఇలా ప్రారంభించవద్దు: రోడ్లపై వరద నీరు తగ్గిన తర్వాత మీరు మీ వాహనాన్ని యథావిధిగా స్టార్ట్ చేసి బయటకు వెళ్లవచ్చు అని అనుకుంటే మీరు పొరబడినట్లే.. మీ కారు వరద నీటిలో మునిగి ఉంటే, మీ అందులోకి ఖచ్చితంగా నీరు చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజిన్‌ను ప్రారంభిస్తే ఇంజిన్ దెబ్బ తింటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వరద నీరు తగ్గిన తర్వాత కారు స్టార్ట్ చేయకూడదు.
బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయండి: మీరు(Andhra Pradesh Rains) వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే.. కారు పార్క్ చేసేముందు బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయాలని గుర్తుంచుకోండి. దీని ద్వారా మీ కారు వరదల్లో మునిగిపోయినా.. బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయడం ద్వారా చాలా వరకు నష్టాన్ని తగ్గించవచ్చు. లేదంటే మీరు బ్యాటరీని ఆన్‌లోనే ఉంచితే కారు రిపేర్‌కు గురయ్యే అవకాశం ఉంది.

స్పార్క్ ప్లగ్‌ని డిస్‌కనెక్ట్ చేయండి: వరదల కారణంగా మీ కారు(AP Floods Michaung Cyclone) ఇంజిన్‌లోకి నీరు చేరినట్లు మీకు డౌట్ అనిపిస్తే ముందుగా బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయండి. ఆ తర్వాత స్పార్క్ ప్లగ్‌ను తప్పనిసరిగా తొలగించాలి. లేదంటే వరద నీరు ఎఫెక్ట్‌తో స్పార్క్ ప్లగ్ భాగం తుప్పు పట్టే ఛాన్స్ ఉంది. తుప్పు పట్టినట్లయితే దాన్ని తొలగించడం కష్టమైన పని..
నీటిని ఖాళీ చేయండి: మీరు కారు పార్క్ చేసిన ప్రాంతంలో పాక్షికంగా వరద నీరు ఉన్నప్పుడు కారు లోపలికి నీరు వెళ్లిందో లేదో ఖచ్చితంగా చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో మీరు దీన్ని రెండు రకాలుగా గుర్తించవచ్చు. దీని ద్వారా మీరు తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.

మొదటగా.. మీ కారు ఎగ్జాస్ట్ ప్రాంతం ద్వారా నీరు వస్తే కారు లోపలికి నీరు వెళ్లినట్లే.. మరొకటి స్పార్క్ ప్లగ్ ద్వారా నీరు బయటకు వచ్చినా ఇంజిన్ లోపలికి నీరు చేరినట్లు అర్థం.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ కారును మెకానిక్ వద్దకు తీసుకెళ్లాలి.
మెకానిక్ సహాయం కోరండి: మీ కారు వరద నీటిలో మునిగిపోయినట్లయితే అందులోని వివిధ భాగాలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని సమస్యలను మీరు పరిష్కరించగలిగినా మరికొన్నిటికి మెకానిక్ సాయం తప్పనిసరి.. మెకానిక్ హెల్ప్‌తో నష్టాన్ని అంచనా వేసి సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లోకి కారు జారిపోకుండా ఉండటానికి కారు టైర్ల వద్ద రాళ్లు ఉంచడం ఉత్తమం. ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లోనే కారు పార్క్ చేయాలని గుర్తుంచుకోండి. అంతే కాకుండా కారు విండోలు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో కూడా తనిఖీ చేసుకోవాలి.
ప్రస్తుతం తుపాను కారణంగా ఏపీ, తమిళనాడులో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ఎఫెక్ట్ తెలంగాణలోనూ అక్కడక్కడ చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కారు పార్కింగ్ చేస్తున్న ప్రాంతాలు వరదలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
సమస్య తగ్గేవరకు మీ వాహనాలను సురక్షిత ప్రాంతం, లేదంటే ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాల్లో పార్క్ చేయడం ఉత్తమం. ఆ ప్రాంతాల్లోకి వరద నీరు రాదని నిర్ధారించుకున్న తర్వాతే మీరు అక్కడ పార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంజిన్‌లోకి నీరు చేరినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడటం ఖర్చుతో కూడుకున్నది.
ఒకవేళ కారు లోపలికి నీరు పోయినప్పటికీ మీరు ఆందోళన చెందకుండా.. పైన చెప్పిన సలహాలు పాటిస్తూ సరైన మెకానిక్‌ను సంప్రదించాలి. లేదంటే వరద తగ్గిన అనంతరం మీ అంతట మీరు కారును స్టార్ట్ చేస్తే ఇంజిన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో నిపుణుల సలహా అవసరం.


Click it and Unblock the Notifications








