చంద్రయాన్ 3 లో మరో కీలక ఘట్టం.. కాసేపట్లో చంద్రుడి కక్ష్యలోకి ఎంట్రీ..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో మరికొన్ని గంటల్లో కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించబోతోంది. ఈ మేరకు ఇస్రో కీలక ప్రకటన విడుదల చేసింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం ఇస్రో పంపిన చంద్రయాన్ -3 (Chandrayan-3) మరో కీలక ఘట్టానికి చేరుకోనుంది. భూమి చుట్టూ పలుమార్లు తిరిగి ప్రస్తుతం ట్రాన్స్‌లూనార్ మార్గంలో పయనిస్తున్న చంద్రయాన్-3.. నేడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాత్రి 7 గంటల సమయంలో ఇస్రో చేపట్టనుంది.

ఇస్రో జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3.. చంద్రుడి దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే భూమి చుట్టూ కక్ష్యలను విజయవంతంగా పూర్తిచేసుకోగా.. చంద్రుని దిశగా వెళ్తున్న ఈ వ్యోమనౌక మూడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తిచేసుకుందని, ఇస్రో నిన్న(శుక్రవారం) వెల్లడించింది. శనివారం(ఆగస్టు 5) చంద్రుని కక్ష్యలోకి అడుగుపెట్టనుందని తెలిపింది. ఈ నెల 23న సాయంత్రం జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.
చంద్రయాన్-3 జాబిల్లికి అత్యంత దగ్గరగా (పెరిల్యూన్) చేరినప్పుడు ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం దీని పనితీరు బాగానే ఉందని, చంద్రుని కక్ష్యలను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ నెల 23న దీన్ని చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పింది.
చంద్రుడిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్‌కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్‌కు ఇదే ప్రధానమైన తేడా అని పేర్కొంది. గతంలో చంద్రయాన్-2 మిషన్ ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొనగా.. విక్రమ్ ల్యాండర్‌లోని వ్యవస్థలు పని చేయకుండా పోయాయి.
ఇప్పుడు ల్యాండర్‌ను మరింత అభివృద్ధి చేసి జాబిల్లి మీదకు పంపారు. ఈ రోజు సాయంత్రం లూనార్ ఆర్బిట్ ఎంట్రీ తర్వాత చంద్రయాన్ 3.. జాబిల్లి చుట్టూ హెలికాఫ్టర్‌లా పరిభ్రమిస్తూ తన కక్ష్యను తగ్గించుకుంటూ వచ్చి చివరికి చంద్రుడిపై ల్యాండ్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ నౌక మొత్తం ల్యాండ్ కాకుండా విడిపోయి కేవలం విక్రమ్ ల్యాండర్‌ను మాత్రమే చంద్రుడిపై దిగేలా చేస్తుంది.
చాలా దేశాలు చంద్రునిపై అడుగుపెట్టినప్పటికీ, చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై మొదటిసారిగా ల్యాండ్ అవుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటి మంచు ఉనికిని చంద్రయాన్ 1 పరిశోధించింది. దాని ఆధారంగానే చంద్రయాన్ 3 ఆ ప్రాంతంలో దిగి సర్వేలు చేయనుంది. ఇందుకోసం అధిక ఇంధన వ్యయం లేకుండా ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్త వ్యూహాన్ని అనుసరించారు.
గతంలో ఎదురైన పొరబాట్లను సరిదిద్దుకుని ఈ సారి ప్రయోగం మరింత ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్ 3 చేపట్టినట్లు ఇస్రో చెబుతోంది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ఎదురయ్యే ప్రతికూలతల్ని తట్టుకుని విజయవంతంగా ప్రయాణం సాగిస్తే 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంటుంది. ఈ ప్రయోగంతో.. అమెరికా, చైనా, రష్యా దేశాల తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన నాల్గవ దేశంగా భారత్ నిలవనుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








