ఫారిన్ కార్లతో పోటీపడే ఆరు టాప్ మేడ్ ఇన్ ఇండియా కార్లు..!
మనదేశంలో విదేశీ ఉత్పత్తులపై, అందులోనూ ప్రత్యేకించి కార్లు మరియు బైక్‌లపై ఎప్పటి నుండో ప్రత్యేక ఆకర్షణ ఉంది. మునుపటి రోజుల్లో మనదేశంలో చాలా అధునాతనమైన మేడ్ ఇన్ ఇండియా వాహనాలు ఉండేవి కాదు. కాబట్టి, అప్పటి నుండే విదేశీ ఉత్పత్తులపై ఆకర్షణ పెరిగింది. గ్లోబల్ కంపెనీలు కూడా దీనిని క్యాష్ చేసుకునేందుకు మనదేశంలో ఖరీదైన వాహనాలను విక్రయిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం విదేశీ కంపెనీలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా భారతీయ కార్ల తయారీదారులు కూడా తమ ప్రమాణాలను నిరంతరం మెరుగుపరుచుకుంటున్నారు మరియు వారి ఉత్పత్తులు చాలా మెరుగుపడ్డాయి.

అంతేకాదు, ప్రస్తుతం, అనేక భారతీయ కార్లు విదేశీ బ్రాండ్లకు గట్టి పోటీని కూడా ఇస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం వాడులో ఉన్నవి మాత్రమే కాదు, గతంలో భారత మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన మోడళ్లు కూడా ఉన్నాయి. మరి మనదేశంలో విదేశీ బ్రాండ్‌లకు పోటీగా నిలిచిన ఆ ఆరు భారతీయ కార్ల ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

1. టాటా ఇండికా (Tata Indica)
టాటా ఇండికా, భారత మార్కెట్లో పరిచయం అవసరం లేని కారు ఇది. ప్రసిద్ధ టాటా మోటార్స్ కంపెనీకి భారత మార్కెట్లో స్థిరమైన స్థానాన్ని దక్కించుకోవడంలో సహకరించిన మోడల్ ఇది. క్యాబ్ మార్కెట్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కారుగా, ప్యాసింజర్ వాహన విభాగంలో కస్టమర్ల మొదటి కారుగా, సెడాన్ గా మరియు ఎస్టేస్ వాహనంగా వివిధ రూపాల్లో అందుబాటులోకి వచ్చిన మోడల్ ఇది. మంచి రైడ్ క్వాలిటీ మరియు విశాలమైన క్యాబిన్ స్థలం ఈ కారు సక్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణాలు.

చిన్న కారే అయినప్పటికీ, కంపెనీ ఇందులో అవసరమైన అన్ని ఫీచర్లను అందించింది. ఈ కారులో ఆల్ పవర్ విండోస్, ఇంటర్నల్లీ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్ మొదలైన ఫీచర్లు అందుబాటులో ఉండేవి. ఇంజన్ విషయానికి వస్తే, ఈ కారులో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఉండేది. ఇది గరిష్టంగా 54 బిహెచ్‌పి శక్తిని మరియు 83 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ అధిక ఇంధన సామర్థ్యాన్ని (ఎక్కువ మైలేజ్)ని కలిగి ఉంది, వాణిజ్య వినియోగానికి చాలా మెరుగ్గా ఉండేది. వ్యక్తిగత కొనుగోలుదారులలో కూడా టాటా ఇండికా బాగానే ప్రాచుర్యం పొందింది.

2. టాటా నెక్సాన్ (Tata Nexon)
ఈ జాబితాలో రెండవ మోడల్ కూడా టాటా మోటార్స్ కి చెందినదే. టాటా అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ సెడాన్ టాటా నెక్సాన్ (Tata Nexon) ఈ విభాగంలోనే అత్యంత ఆశాజనకమైన కార్లలో ఒకటిగా ఉంటుంది. ఆధునికంగా కనిపించే ఇంటీరియర్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ మరియు సాటిలేని సేఫ్టీ ఫీచర్లు మరియు అద్భుతమైన సేఫ్టీ రేటింగ్ తో ఇది ఈ విభాగంలోనే బెస్ట్ కారుగా ఉంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఎన్ఏతో రూపుదిద్దుకున్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మొదటి భారతీయ కారు. టాటా నెక్సాన్ సాధించిన ఈ సేఫ్టీ రేటింగ్ కొనుగోలుదారులలో భద్రత గురించి అవగాహన కల్పించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. దీంతో ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన కార్లలో ఒకటిగా నిలిచింది.

3. టాటా సఫారి (Tata Safari)
పాత తరం టాటా సఫారీ నిజానికి భారతదేశంలో ఒక విప్లవాత్మక ఉత్పత్తిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రకటనతో ఏకీభవించని టాటా సఫారీ యజమాని దాదాపు ఎవ్వరూ ఉండరేమో. టాటా సఫారీ స్టార్మ్ అనేక రాష్ట్రాల పోలీసు బలగాలలో మరియు భారత సైన్యంలో కూడా మంచి ప్రజాదరణ పొందింది. ఇందులో GS800 అనేది సైన్యం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సఫారీ మోడల్. ఇది ఇ్పపటికీ వాడుకలో ఉంది మరియు ఇదొక అద్భుతమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలు కలిగిన ఎస్‌యూవీ. టాటా సఫారి స్టార్మ్ ఇంజన్ గరిష్టంగా 270 బిహెచ్‌పి పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

4. మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700)
ఈ జాబితాలో తదుపరిది మోడల్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ700. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత అధునాతనమైన ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీలలో ఎక్స్‌యూవీ700 కూడా ఒకటి. ఈ కారులో అత్యుత్తమమైన కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో లెవల్-3 అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ (ఏడిఏఎస్) టెక్నాలజీ కూడా ఈ కారులో అందించబడింది. ఈ అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ లో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి మరెన్నో అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

5. మహీంద్రా థార్ (Mahindra Thar)
జీప్ వ్రాంగ్లర్ కి చాలా దగ్గర పోలికను కలిగి ఉండే దేశీయ ఎస్‌యూవీ మహీంద్రా థార్. భారతదేశంలో పరిచయం అవసరం లేని పేరు మరియు హార్డ్ కోర్ ఆఫ్-రోడ్ మేడ్ ఇన్ ఇండియా ఎస్‌యూవీ. గడచిన 2020 సంవత్సరంలో మహీంద్రా తమ కొత్త తరం థార్ ఎస్‌యూవీని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త తరం మోడల్ ను కేవలం ఆఫ్ రోడ్ ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా ఇటు ఆన్-రోడ్ ప్రయోజనం కోసం కూడా విడుదల చేశారు. అంతేకాకుండా, ఇది స్టాండర్డ్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో కూడా లభిస్తోంది. ఇందులో మునుపటి కంటే మరింత మెరుగైన పెట్రోల్, డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు.

6. టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)
టాటా మోటార్స్ నుండి లభిస్తున్న మరో అద్భుతమైన కారు టాటా నెక్సాన్. టాటా టిగోర్ ఈవీ రాక ముందు వరకూ ఇదే భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ఉండేది. ఇప్పటికీ, ఇది ప్రస్తుతం భారతదేశంలో లభిస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ఉంటుంది. పూర్తి చార్జ్ పై దాదాపు 300 కిలోమీటర్లకు పైగా రేంజ్ ను ఆఫర్ చేసే ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ అధునాతన బ్యాటరీ సాంకేతికత మరియు కనెక్టింగ్ టెక్నాలజీలను ఉపయోగించింది.

మనదేశంలో విదేశీ కార్లతో పోటీపడే దేశీయ కార్లలో టాటా నెక్సా ఈవీ కూడా ఒకటి. సేఫ్టీ విషయంలో కూడా టాటా నెక్సాన్ ఈవీ బెస్ట్ అనిపించుకుంటుంది. గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టులో మొదటిసారిగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకున్న ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే కావటం విశేషం. టాటా నెక్సాన్ ఈవీ ఇటీవలి కాలంలో భారతదేశంలో మంచి పాపులారిటీని దక్కించుకుంటోంది. ఎలక్ట్రిక్ కార్లపై వివిధ ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీల కారణంగా, ఈ మోడల్ అమ్మకాలు కూడా జోరందుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications