Car Theft స్మార్ట్ దొంగతనం.. మున్సిపల్ సిబ్బంది అని చెప్పి బురిడీ.. ఏకంగా కారునే ఎత్తుకెళ్లిన వైనం..
దొంగతనాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఓ వైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటే.. మరోవైపు మరి కొందరు దుండగులు కొత్త వేషాలు వేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కారు చోరీ ఘటన ప్రజలను ఆందోళనలో పడేసింది. ఈ స్టోరీ చదివితే కారును ఇలా కూడా దొంగతనం చేస్తారా అని ఆశ్చర్యమేస్తుంది.
భారతీయుల ఇళ్లలో ఇప్పుడు కారు సాధారణం అయిపోయింది. కుటుంబ సమేతంగా బయటికి వెళ్లాలన్నా.. వేరే ఇతర అవసరాలకైనా ప్రతి ఒక్కరి జీవితంలో కారు భాగమైంది. అలాంటి కారును యజమానులు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ దొంగల బెడదతో యజమానులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త కొత్త దారులు వెతుకుతూ సునాయాసంగా కార్లను దొంగిలించేస్తున్నారు. చెన్నైలో ఓ కుటుంబానికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

తమిళనాడులో కన్యాకుమారికి చెందిన సుమత్రా తంగజ్యోతి ఇటీవల కుటుంబంతో కలిసి తమ టయోటా కారులో చెన్నై మెరీనా బీచ్‌కు వెళ్లారు. అనంతరం పార్కింగ్ స్థలంలో కారును పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి వేషంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి పార్కింగ్ రశీదు ఇచ్చారు. దాంతో సుమత్రా తంగజ్యోతి.. ఆ వ్యక్తి నిజంగా కార్పొరేషన్ ఉద్యోగి అని భావించారు.
అక్కడికి ఉద్యోగి వేషంలో వచ్చిన ఆ వ్యక్తి కాసేపయ్యాక కారు ఇక్కడ పార్క్ చేయవద్దని, వేరే చోట పార్క్ చేయాలని చెప్పాడు. కారు తాళాలు కూడా అడిగారు. అతడిని నమ్మిన సుమత్రా తంగజ్యోతి కుటుంబీకులు ఆ వ్యక్తికి తాళం చెవి ఇచ్చారు. ఆ సమయం కోసమే ఎదురుచూసిన వ్యక్తి సుమత్ర కుటుంబీకుల ఎదుటే దర్జాగా కారు చోరీ చేసి పరారయ్యాడు.

కాసేపటి తర్వాత సదరు వ్యక్తి కారు పార్క్ చేసి తాళాలు తీసుకొని వస్తాడని సమత్రా కుటుంబం ఎదురుచూసింది. ఎంతసేపటికీ అతను తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన సుమత్రా తంగజ్యోతి చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా తమ కారు కనపడకపోవడంతో భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు దొంగిలించిన వ్యక్తి చెన్నై కార్పొరేషన్ ఉద్యోగి కాదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మున్సిపల్ శాఖ ఉద్యోగి వేషంతో కారు దొంగతనం చేశారని సుమత్రా కుటుంబీకులు గుర్తించారు. ఈ ఘటన చెన్నై మెరీనా బీచ్‌కు వచ్చిన పర్యాటకులను ఆందోళనకు గురి చేసింది. చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేస్తే ఇలాంటి మోసాలు మరెన్నో వెలుగులోకి వస్తాయనడంలో సందేహం లేదు. వీటిని అరికట్టేందుకు కార్ల తయారీ కంపెనీలు పలు కొత్త టెక్నాలజీలను ప్రవేశపెడుతున్నాయి. అయితే దొంగలు కొత్త వ్యూహాలను ఉపయోగిస్తుండటంతో, యజమానులకు తిప్పలు తప్పడం లేదు.
టయోటా కారు భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన MPVలలో ఒకటి. ఇది ఎక్కువ స్థలం, మరింత కాంపాక్ట్ సీటును కలిగి ఉంది. ఇది లాంగ్ డ్రైవ్‌లకు చాలా అనువైనది. లాంగ్ డ్రైవ్ సమయంలో సమయం తీసుకునే కొన్ని ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి. వీటిలో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, అధిక వేగంతో క్యాబిన్ ను చల్లబరిచే పవర్ విండో వంటి ఫీచర్లు, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








