స్టైల్ కోసం స్కూటర్‌ను ఇష్టమొచ్చినట్లు మారుస్తున్నారా.. రూ.10,000 చెల్లించుకోవాల్సిందే !
ఈ రోజుల్లో యువత తమ బైకులు లేదా స్కూటర్లను ఇతరుల కంటే భిన్నంగా, స్టైలిష్‌గా చూపించుకోవడం కోసం రకరకాల మోడిఫికేషన్లు చేయించుకోవడం ఒక ట్రెండ్‌గా మార్చుకున్నారు. అయితే ఇలాంటి హాబీలు ఉన్నవారు ఇకపై తమ అలవాట్లను తక్షణమే మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం.. టూ-వీలర్లలో కంపెనీ డిజైన్‌ను మార్చి ఎలాంటి అక్రమ మార్పులు చేసినా అది నేరుగా చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఇలాంటి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దూరం నుంచే గుర్తించి, భారీ ఎత్తున చలాన్లు విధిస్తూ జేబులు ఖాళీ చేస్తున్నారు.
మొదటి తప్పుకు ఒకలా.. రెండో సారి దొరికితే డబుల్ బాదుడు
కొత్త నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు మీ బండి అక్రమ మోడిఫికేషన్లతో మొదటిసారి దొరికితే రూ.5,000 వరకు జరిమానా విధిస్తారు. అయితే ఈ చలాన్ పడినా కూడా మారకుండా, అదే మోడిఫైడ్ వాహనంతో రోడ్లపై మళ్లీ రెండోసారి దొరికితే జరిమానా మొత్తం రెట్టింపు అవుతుంది.

అంటే నేరుగా రూ.10,000 చలాన్ కట్టాల్సి వస్తుంది. ఇక్కడితోనే ఆగకుండా, ట్రాఫిక్ పోలీసులకు ఒక ప్రత్యేక చట్టపరమైన అధికారాన్ని కూడా ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాన్ని స్పాట్‌లోనే సీజ్ (స్వాధీనం) చేయవచ్చు లేదా ఆ బండి రిజిస్ట్రేషన్ (RC)ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉంది.
పోలీసుల రాడార్లో ఉన్న ప్రధాన మార్పులు ఇవే
చాలా మంది యువకులు తమ బైకులకు, ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వంటి బండ్లకు పటాకులు పేల్చేలా లేదా చెవులు పగిలిపోయేలా భారీ శబ్దాన్ని ఇచ్చే లోకల్ సైలెన్సర్లను తగిలిస్తుంటారు. ఇలాంటి హుందాతనం లేని పనులు చేసేవారే పోలీసుల రాడార్లో మొదటి టార్గెట్‌గా ఉన్నారు.

వీటితో పాటు, కంపెనీ ఇచ్చిన హెడ్‌లైట్ వెలుతురును మార్చడం, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల కళ్లు బైర్లు కమ్మేలా రంగురంగుల ఫ్యాన్సీ లైట్లు అమర్చడం, బండికి నిర్దేశించిన సైజు కంటే చాలా ఎక్కువ వెడల్పు ఉన్న లావు టైర్లను వేయించడం, బండి సస్పెన్షన్‌ను మార్చడం వంటి పనులన్నీ ఇప్పుడు పూర్తిగా చట్టవిరుద్ధంగా మారాయి.
అసలు ఈ చట్టం వెనుక ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటి?
ప్రభుత్వం ఇంత కఠినమైన చర్యలు తీసుకోవడం వెనుక కేవలం జరిమానాలు వసూలు చేయడం మాత్రమే లక్ష్యం కాదు. భారతీయ రోడ్లను సురక్షితంగా మార్చడం, వాహనాల వల్ల పెరిగిపోతున్న ధ్వని, వాయు కాలుష్యాన్ని అదుపు చేయడం దీని ప్రధాన ఉద్దేశం.

ఆటోమొబైల్ కంపెనీలు ఏదైనా ఒక వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చే ముందు.. అది ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సంస్థ అనేక కఠినమైన భద్రత, ఉద్గారాల పరీక్షలను పాస్ అవ్వాల్సి ఉంటుంది. కానీ వాహనదారులు బయట లోకల్ మార్కెట్లో దొరికే నాణ్యత లేని విడిభాగాలను అమర్చడం వల్ల కారు లేదా బైక్ బ్రేకింగ్ సామర్థ్యం, బ్యాలెన్సింగ్ దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్నాయి.
గ్యారేజ్ యజమానులు, మెకానిక్‌లకు సైతం షాక్
ఈ కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ లోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. దీని ప్రభావం కేవలం బండి ఓనర్లపైనే కాకుండా, ఇలాంటి అక్రమ మార్పులు చేసే మెకానిక్‌లు, గ్యారేజ్ వ్యాపారులపై కూడా పడనుంది.
ప్రభుత్వ అనుమతి లేదా ARAI సర్టిఫికేషన్ లేని లోకల్ సైలెన్సర్లు, లైట్లను విక్రయించినా లేదా వాటిని కస్టమర్ల బైకులకు ఫిట్ చేసినా సదరు గ్యారేజ్ యజమానులకు ఏకంగా రూ.25,000 వరకు భారీ జరిమానా విధిస్తారు. కాబట్టి బైక్ రైడర్స్ ఎవరైనా సరే, లోకల్ మెకానిక్‌ల మాటలు నమ్మి బండ్ల ఒరిజినల్ లుక్‌ను మార్చి అనవసరమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడకండి.


Click it and Unblock the Notifications