Dense Fog: భయంకరంగా కమ్ముకొస్తున్న ‘పొగమంచు'.. ‘డ్రైవింగ్'లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న పోలీసులు
దేశవ్యాప్తంగా ఇటీవల చాలా రాష్ట్రాల్లో పొగమంచు సమస్య తీవ్రంగా మారింది. నార్త్ ఇండియాతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పొగమంచు కారణంగా సురక్షితమైన డ్రైవింగ్‌పై పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు.
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా దట్టమైన పొగమంచు(Accidents Due To Fog) కొనసాగుతోంది. దీంతో రోడ్డుపై విజిబిలిటీ తగ్గడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో పొగమంచు మరింతగా కమ్ముకునే అవకాశం ఉండటంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ఈ సలహాలు కేవలం రాజధాని ప్రాంత ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా పొగమంచు(Precautions On Fog Roads) సమస్య ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా పాటించడం చాలా అవసరం. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉండటంతో పొగమంచు సమస్య తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం(IMD) హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో వాహన యజమానులు, డ్రైవర్లకు భారత వాతావరణ అధికారులు పలు సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా సర్వీసు షెడ్యూల్ టైమ్‌ను మార్చాలని విమానయాన సంస్థలు, రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలను కోరుతోంది. విజిబిలిటీ తగ్గడంతో గురువారం ఢిల్లీకి వెళ్లే 22 రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

ఈ క్రమంలో పొగమంచు(Dense Fog) ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణించేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ముందుగా మీ వాహనం మంచి కండిషన్‌లో ఉందా లేదా సరిచూసుకోవాలి. లైట్లు, బ్రేక్‌లు, టైర్లు, విండ్‌స్క్రీన్ వైపర్‌లు, రేడియేటర్, బ్యాటరీ మరియు కార్ హీటింగ్ సిస్టమ్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా తనిఖీ చేసుకోవాలి.
మీ కారు విండోస్, గ్లాసెస్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీ విజిబిలిటీని పెంచుకోవడానికి డీఫ్రాస్టర్ మరియు వైపర్‌లను ఉపయోగించాలి. వాహనదారులు వీలైతే, కారులో హై విజిబిలిటీ జాకెట్ మరియు టార్చ్ ఉండేలా చూసుకోవాలి. తద్వారా మీరు కారు దిగినప్పుడు మీకు వాటి అవసరం ఉంటుంది.

కారు డ్రైవ్ చేసేటప్పుడు మీరు లో బీమ్ హెడ్‌లైట్(Low Beam Headlights)లను ఉపయోగించాలి. దీని ద్వారా మీ వాహనం ముందు మరియు వెనుక వస్తున్న వాహనదారులకు మీ వాహనం కనిపిస్తుంది. కానీ హై బీమ్ లైట్ల ద్వారా అధిక కిరణాలు పొగమంచులో ప్రతిబింబించడమే కాకుండా విజిబిలిటీని దెబ్బతీస్తాయి.
ఒకవేళ విజిబిలిటీ తగ్గిపోయినట్లయితే, వెంటనే ఫాగ్ లైట్లను ఆన్ చేయండి. వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్లండి. స్పీడోమీటర్‌ను పరిశీలిస్తుండాలి. ఇంకా హెడ్‌లైట్‌లకు మించి డ్రైవ్ చేయకుండా చూసుకోవాలి. ఇతర వాహనాల నుంచి సురక్షితమైన దూరాన్ని పాటించండి. ఇంకా సడెన్ స్టాప్‌ల లాంటివి వచ్చినప్పుడు టెయిల్‌గేట్‌లను ఉపయోగించకండి.
రోడ్డుపై వెళ్లేటప్పుడు ముఖ్యంగా మీరు పేవ్‌మెంట్ మార్కింగ్‌లో వెళ్లడం ఉత్తమం. పొగమంచు లేదా వర్షం కురుస్తున్న సందర్భాల్లో రోడ్లు జారే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఉనికిని ఇతర డ్రైవర్‌లకు తెలియజేయడానికి హారన్ కొడుతూ ఉండండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించకండి.
విజిబిలిటీ తక్కువగా ఉన్న సమయంలో రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు ఏకాగ్రతతో డ్రైవ్ చేయండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ పరధ్యానంగా ఉండకూడదు. మ్యూజిక్ వినడం, డ్రైవింగ్‌లో తినడం, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లను ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు చేయకూడదు. వీటి ద్వారా దృష్టి మరలే ప్రమాదం ఉంటుంది.
దట్టమైన పొగమంచు సమయంలో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటే.. లైట్లను ఆన్ చేసి ఆ తర్వాత సురక్షితమైన ప్రదేశంలో కారును ఆపడం ఉత్తమం. పార్క్ చేసిన అనంతరం ఫ్లాషింగ్ లైట్లు ఆన్ చేసి మిగతా లైట్లను ఆపివేయాలి. అత్యవసర బ్రేక్‌ను సెట్ చేసుకోవాలి. బ్రేక్ పెడల్‌పై మీ కాల్‌ను తీసివేయాలి. దీంతో టెయిల్‌లైట్లు కూడా ఆఫ్ అయిపోతాయి.
పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉండే రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు పై సూచనలు పాటించడం ద్వారా మీరు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇతర డ్రైవర్లను మీరు హెచ్చరించడంతో పాటు రోడ్డు భద్రతలో మీ వంతు కృషి చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి డ్రైవ్ చేయకూడదు.
కాగా గురువారం, ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ అధికారులు తెలిపారు. ఇది సీజన్ యొక్క సగటు కంటే కూడా చాలా ఎక్కువ. అయితే గరిష్ట ఉష్ణోగ్రత 21.4 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఈ సమయంలో వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








