ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. 13 కి చేరిన మృతుల సంఖ్య, 50 మందికి పైగా గాయాలు, అసలు ఇది ఎలా జరిగింది.??
ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. గత జూన్‌లో ఒడిశాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఘటన మరువకముందే మరికొందరి ప్రాణాలు పట్టాల కింద నలిగిపోయాయి. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి- అలమండ ట్రాక్‌పై గత రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
దేశంలో తరచూ రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అదృష్టవశాత్తు పలు రాష్ట్రాల్లో రెండు రైలు ప్రమాదాలు తృటిలో మిస్సవగా.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆదివారం రాత్రి విజయనగరం జిల్లాలో కంటకాపల్లి- అలమండ రైల్వే ట్రాక్‌పై ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టడంతో రాయగడలోని మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. అనంతరం అక్కడే మరో ట్రాక్‌పై ఉన్న గూడ్స్ రైలు పైకి దూసుకెళ్లాయి.

దుర్ఘటనలో 13 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. కాగా ఈ దుర్ఘటనలో మొత్తంగా క్షతగాత్రుల సంఖ్య వంద మందికిపైగానే ఉంటుందని సంఘటనా స్థలంలో పరిస్థితులను బట్టి అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఈ రెండూ ప్యాసింజర్ రైళ్లలో 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో లోకో పైలట్లు కూడా ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయని, పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షిస్తున్నారని.. రైల్వే బృందాలు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ X(గతంలో ట్విట్టర్)లో పేర్కొన్నారు.

రైలు ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. విశాఖ నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం- పలాస(08532) రైలును.. కొద్ది నిమిషాల తేడాతో వెనుక నుంచి ప్రారంభమైన మరో రైలు విశాఖపట్నం- రాయగడ(08504) ఢీకొట్టింది. ఘటనలో రాయగడ ట్రైన్‌లోని బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మరికొన్ని బోగీలు పట్టాలు తప్పాయని పోలీసులు పేర్కొన్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, విశాఖపట్నం-పలాస రైలుకు సిగ్నల్ సమస్య ఎదురడంతో అది పట్టాలపై నెమ్మదిగా వెళుతుండగా.. వెనుక నుంచి వస్తున్న రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టడం.. ఇదంతా సిగ్నల్ సమస్య, మానవ తప్పిదమే కారణంగా తెలుస్తోంది. ఈ దుర్ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రైళ్లను దారి మళ్లించారు. మరికొన్నిటిని రద్దు చేశారు. ఇందుకు సంబంధించి అప్‌డేట్లను ఎప్పటికప్పుడు రైల్వే శాఖ సోషల్ మీడియాలో పంచుకుంటోంది.

బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ప్రధాని మంత్రి పేర్కొన్నట్లు రైల్వే మంత్రి X లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, వీలైనన్ని ఎక్కువ అంబులెన్స్‌లను పంపాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
కాగా రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సీఎం జగన్ పరిహారం ప్రకటించారు. ఘటనలో ఇతర రాష్ట్రాలకు చెందిన మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏపీ ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

కాగా రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ. 50,000 ఆర్థిక సహాయంగా అందజేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ఈ ఘోర రైలు ప్రమాదం కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోయినట్లు సమాచారం. గత జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టగా.. ఆ దుర్ఘటనలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు.


Click it and Unblock the Notifications








