పెట్రోల్ అడిగినంత పోయరు.. కొత్త రూల్ ప్రకారం బైక్ ఉన్నవారికి రూ.200, కార్లకు రూ. 1000 మాత్రమే పోస్తారు!
సాధారణంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు దేశంలో అది సంచలన వార్త అవుతుంది. ఇక పెట్రోల్ కొరత ఏర్పడితే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెట్రోల్, డీజీల్ వంటి కీలకమైన ఇంధనాలతో ప్రతీ పని ముడిపడి ఉంటుంది. రోజువారి రవాణాలో పెట్రోల్, డీజీల్ జీవనదిలా ఉంటాయి. ఇంతటి కీలకమైన పెట్రోల్‌పై ఓ రాష్ట్రంలో దీని సరఫరాపై ఆంక్షలు విధించారు. దీంతో వాహనాలకు రోజుకు పరిమితంగా పెట్రోల్ విక్రయించే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.
త్రిపురలోని లుండింగ్- బర్దాపూర్ మధ్య రైల్వే ట్రాక్స్‌పై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ రాష్ట్రంలోకి ఇతర రైళ్లు ప్రవేశించే మార్గం లేదు. వాస్తవానికి త్రిపురకు మొత్తం అవసరమైన పెట్రోల్‌ని రైలు మార్గం ద్వారా సరఫరా చేయబడుతుంది. ఆ తర్వాత పెట్రోల్‌ని ట్యాంకర్స్ ద్వారా రిటైల్ డెలివరీకి పంపిస్తారు. ఈ పరిస్థితుల్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఏర్పడింది.

అయితే కొరతా ఉన్నాకానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పెట్రోల్ సరఫరా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే రైల్వే ట్రాక్ సమస్యను సవరించి ట్రాక్ పునరుద్ధరించే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. దీంతో త్రిపుర ప్రభుత్వం ఇప్పుడు తాత్కాలిక పెట్రోల్ పంపిణీ విధానాన్ని అమలు చేయనుంది. దీని ప్రకారం టూవీలర్స్, కార్లు, ఇతర కమర్షియల్ వెహికిల్స్‌కి పరిమిత సంఖ్యలో పెట్రోల్ లేదా డీజీల్‌ని విక్రయించనున్నారు.
ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రకారం టూవీలర్స్‌కి రోజుకు రూ.200, ఆటో డ్రైవర్లు రోజుకు రూ.400, కారు డ్రైవర్లు రోజుకు రూ.1,000 విలువైన పెట్రోల్‌ని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలు పెట్రోల్ కొరత తీరే వరకు అమల్లో ఉంటాయి. గతంలోనూ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి నెలకొనడం వల్ల ఇదే పద్ధతిన పెట్రోల్‌ని విక్రయించింది.

ఈ ఆంక్షల్లో ప్రభుత్వ వాహనాలు, అత్యవసర సేవలకు ఉపయోగించే వాహనాలకు ఎటువంటి ఆంక్షలు వర్తించవు. ప్రభుత్వ ఆదేశాలనుసారం వారు యథావిధిగా రీఫిల్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. కేవలం వ్యక్తిగత వాహనాలు, ప్రజా రవాణాలో ప్రాధాన్యం లేని ఇతర నిర్దిష్ట వాహనాలపై మాత్రమే ఈ ఆంక్షలు విధిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లిమిటెడ్‌గా పెట్రోల్ విక్రయించడం వల్ల ఆ రాష్ట్ర ప్రజలకు కాస్త ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది.
పైన చెప్పిన విధంగా రైలు పట్టాలు తప్పడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రైల్వే యంత్రాంగం మరమ్మతులు చేయడాన్ని ముమ్మరం చేసింది. ఈ ప్రాంతం మొత్తం కొండల మధ్య ఉండటం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. సాధ్యామైనంత వరకు నేటి నుంచి (13 నవంబర్) ట్రాక్‌ని సరిచేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే రైలు సర్వీసులు పునఃప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఎప్పటిలాగానే పెట్రోల్ లభించనుంది.

రైలు సేవలు పునఃప్రారంభం అయితేనే త్రిపురలో మళ్లీ పెట్రోల్ లభిస్తుంది. పైన చెప్పినట్లుగా ఇది కొండ ప్రాంతం కావడంతో రోడ్డు మార్గం ద్వారా ఇంధనం తరలించడం వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని ఆయిల్ కంపెనీలు రైలు మార్గం ద్వారా ఫ్యూయెల్‌ని పంపిస్తాయి. అంతే కాకుండా రైలు మార్గం ద్వారా సరాఫరా చేయడం ద్వారా తక్కువ ఖర్చులో లాభదాయకంగా ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం త్రిపురలోని పెట్రోల్ బంకుల వద్ద హడావిడి కొనసాగుతోంది. పెట్రోల్ కొనేందుకు జనాలు క్యూలైన్లలో కుస్తీలు పడుతున్నారు. పెట్రోల్ దొరుకుతుందో లేదో అనే భయం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. పెట్రోల్ కంపెనీలు ఇప్పటికే ఉన్న నిల్వలను విక్రయించేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే ప్రభుత్వం రోడ్డు మార్గం ద్వారా పెట్రోల్ రవాణా చేసి ఉంటే ఈ కొరత వచ్చేది కాదు.


Click it and Unblock the Notifications








