తప్పిన ఘోర ప్రమాదం.. రైలు పట్టాలపై రాళ్లు పేర్చిన దుండగులు.. గుర్తించిన లోకో పైలట్
సోమవారం(అక్టోబర్ 2) వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express Accident)కు ఘోర ప్రమాదం తప్పింది. ఉదయ్‌పూర్- జైపూర్ మార్గంలో రైల్వే ట్రాక్‌పై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్లు ఉంచారు. లోకో మోటివ్ పైలట్ అప్రమత్తతతో ఘోర రైలు ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెమీ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించినప్పటి నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొందరు వందే భారత్ రైళ్లపై రాళ్లతో దాడి చేయడం, అద్దాలు పగలగొట్టడం లాంటి ఇటీవల పలు చోట్ల జరిగాయి. ఇందుకు సంబంధించి రైల్వే పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.

అయితే ఇప్పుడు ఏకంగా కొందరు దుండగులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు సిద్ధమయ్యారు. నాలుగు నెలల క్రితం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మందికి తీవ్రగాయాల పాలయ్యారు.
రైలు ప్రమాదాల్లో సాంకేతిక లోపాలు కొన్ని కారణాలు అయితే వాటిలో మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తించడంలో లోకోమోటివ్ పైలట్ పాత్ర చాలా కీలకం. రైలు పట్టాలపై వెళ్తున్నప్పుడు లోకో పైలట్(Loco Pilot) చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఘోర ప్రమాదాలు తప్పవు. తాజాగా డ్రైవర్ అప్రమత్తతతో వందల మంది సురక్షితంగా బయటపడ్డారు.

సోమవారం ఉదయ్‌పూర్- జైపూర్(Udaipur- Jaipur Vande Bharat Express) మార్గంలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురి కాకుండా కాపాడటంలో లోకో పైలట్ పాత్ర నిజంగా వెలకట్టలేనిది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన సోమవారం ఉదయం 09.55 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం.
ఆ సమయంలో వందే భారత్ రైలు వెళ్తుండగా గాంగ్రార్- సోనియానా సెక్షన్ వద్ద ట్రాక్‌లో పట్టాలపై రాళ్లు, చిన్న రాడ్లు ఉండటాన్ని లోకో పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో రైలు వెంటనే ఆగిపోయింది. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రధాని మోదీ రాజస్థాన్ పర్యటనలో ఉన్న రోజే ఈ ఘటన జరిగింది.

జైపూర్- ఉదయ్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సెప్టెంబర్ 14 న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రెండు మార్గాల మధ్య 435 కి.మీ దూరాన్ని కేవలం 6 గంటల 15 నిమిషాల్లో ఈ రైలు పూర్తి చేస్తుంది. ఇతర రైళ్లకు 7 గంటల సమయం పడుతుంది.
వందే భారత్ రైళ్లపై తరచూ ఇలాంటి ఘటనలు జరగడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో వెస్ట్ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వడంతో రెండు విండోలు విరిగిపోయాయి. ఏప్రిల్ విశాఖపట్నంలోను ఇలాంటి రాళ్ల దాడి ఘటనే చోటుచేసుకుంది. అంతే కాకుండా గత మేలో కేరళలోని తిరునవయ- తిరూర్ మధ్య వందే భారత్ రైలుపై రాళ్లు రువ్వారు.

తాజాగా పశ్చిమ బెంగాల్‌లోనూ ఓ బాలుడి సమయస్ఫూర్తి వల్ల ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ డ్యామేజ్ అవ్వడాన్ని చూసిన ఓ బాలుడు.. అదే సమయంలో రైలు వస్తుండటంతో వెంటనే అప్రమత్తమై తాను వేసుకున్న రెడ్ షర్ట్‌ను విప్పి లోకో పైలట్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ చిన్నారి సత్కరించి అభినందించారు.
కాగా దేశ చరిత్రలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొనడంతో 296 మంది మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








