ఆ... ఊ... అన్నారే కానీ.. ఆఖరికి ఆటోమొబైల్ రంగానికి మొండిచూపు.. ఆశలన్నీ అడియాశలే
కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన వేళ, దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఆటోమొబైల్ రంగం ఈ సారి ప్రభుత్వం నుంచి భారీ తాయిలాలు అందుతాయని ఆశించింది. కానీ బడ్జెట్ ప్రసంగం ముగిశాక పరిశ్రమ వర్గాల నుంచి ఆశించినంతగా ఏమీ లేదు అన్న నిట్టూర్పులే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఆర్భాటంగా ప్రచారం జరిగినప్పటికీ, చివరికి ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఈ బడ్జెట్ ఒక ఖాళీ పేపర్ లాగే మిగిలిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి జరిగిన మేలేంటి ? అడిగిన కోరికలేంటి ? తీరనవేంటి ? అన్న పూర్తి వివరాలు చూద్దాం.

ఎలక్ట్రిక్ వాహనాలు (EV) - ఆశించిన ఊరట ఏది?
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఛార్జింగ్ స్టేషన్ల సమాచారం కోసం ప్రభుత్వం ఒక 'సూపర్ యాప్' విడుదల చేస్తుందని అందరూ భావించారు. ఎక్కడ ఛార్జర్ ఖాళీగా ఉంది? ఎక్కడ అతి తక్కువ ధరకు ఛార్జింగ్ దొరుకుతుంది? వంటి వివరాలు ఈ యాప్ ద్వారా అందుతాయని ఆశించారు.
కానీ బడ్జెట్ ప్రసంగంలో దీని ఊసే లేదు. అలాగే ఈవీల అమ్మకాలను పెంచడానికి PM-eDrive వంటి పథకాల విస్తరణ లేదా సబ్సిడీల పెంపు గురించి కూడా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇది సామాన్య ఈవీ కొనుగోలుదారులను కొంత నిరాశకు గురిచేసింది.

సెమీకండక్టర్ల కోసం భారీ కేటాయింపులు
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వాహనాల తయారీని కుదిపేస్తున్న సమస్య సెమీకండక్టర్ లేదా చిప్‌ల కొరత. దీనివల్ల బుక్ చేసుకున్న కార్లు డెలివరీ రావడానికి నెలల సమయం పడుతోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.40,000 కోట్లను కేటాయించింది. ఇది నిజంగా ఆటోమొబైల్ రంగానికి లభించిన అతిపెద్ద ఊరట. దేశీయంగానే చిప్‌ల తయారీని ప్రోత్సహించడం ద్వారా కార్ల తయారీ వేగవంతం అవుతుంది. ధరలు కూడా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.
దక్షిణ భారతానికి మ్యాగ్నెట్ పవర్
ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే మోటార్ల తయారీకి పర్మెనెంట్ మ్యాగ్నెట్లు చాలా కీలకం. వీటి తయారీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కారిడార్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో లభించే అరుదైన ఖనిజాలను వెలికితీసి, అక్కడే మ్యాగ్నెట్ల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇది దక్షిణ భారతదేశాన్ని ఈవీ విడిభాగాల తయారీ హబ్‌గా మార్చనుంది. చైనాపై ఆధారపడకుండా సొంతంగా ఈవీ మోటార్లను తయారు చేసుకోవడానికి ఇది ఒక గొప్ప ముందడుగు.

మిగిలిపోయిన కోరికలు..జీఎస్టీ తగ్గింపు
ఆటోమొబైల్ పరిశ్రమ ప్రధానంగా కోరుకున్నది వాహనాలపై ఉన్న 28% జీఎస్టీ తగ్గింపు. దీనివల్ల కార్ల ధరలు గణనీయంగా తగ్గి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని భావించారు. కానీ ప్రభుత్వం పన్నుల జోలికి వెళ్లలేదు. ఇప్పటికే గత సెప్టెంబర్‌లో కొన్ని పన్ను రాయితీలు అమలులోకి వచ్చినందున, ప్రస్తుతం ధరల తగ్గింపుపై మొగ్గు చూపలేదు. ఇది ఆటో తయారీదారులకు మరియు కస్టమర్లకు మింగుడుపడని విషయమే.
భవిష్యత్తుపై ఆశలు
మొత్తం మీద చూస్తే బడ్జెట్ 2026 ఆటోమొబైల్ రంగానికి తక్షణ లాభాలను కలిగించకపోయినా, దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెట్టింది. సెమీకండక్టర్ ప్లాంట్లు, మ్యాగ్నెట్ కారిడార్లు భవిష్యత్తులో వాహనాల ధరలను తగ్గించడానికి దోహదపడతాయి. ప్రస్తుతానికి ఖాలీ పేపర్లా అనిపించినా, వచ్చే ఏడాది బడ్జెట్ నాటికి ఈ రంగానికి మరిన్ని సూపర్ అప్‌డేట్స్ వస్తాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








