Driverless Cars డ్రైవర్‌లెస్ కార్లను భారత్‌లోకి అనుమతించబోం: కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో డ్రైవర్‌లెస్(Driverless Cars) కార్లకు అనుమతిపై స్పందించారు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. భారత్‌లో ఆ కార్లను ప్రవేశపెట్టడం కానీ ప్రారంభించడం కానీ జరగదన్నారు. ఐఐఎం నాగపూర్‌లో నిర్వహిస్తున్న జీరో మైల్ సంవాద్‌లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. రహదారి భద్రతపై ఈ మేరకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్‌లో విస్తృతమైన నెట్‌వర్క్ కారణంగా వాణిజ్య రంగంలో డ్రైవర్లకు ఉపాధి కల్పనలో భారత్ ముందుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్ల ఉద్యోగాలు, వారి జీవనోపాధికి భద్రత కల్పించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. అందుకే డ్రైవర్ లేని కార్లను దేశంలో ప్రవేశపెట్టే అవకాశం లేదన్నారు. డ్రైవర్ లేని కార్ల ఆవిర్భావం.. ఆ వృత్తిపై ఆధారపడిన వారికి నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఐఐఎం నాగ్‌పూర్‌లో జరిగిన రోడ్డు భద్రత, రహదారి ఆందోళనలను ఉద్దేశించి నిర్వహించిన జీరో మైల్ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గడ్కరీ(Nitin Gadkari).. డ్రైవర్ రహిత కార్ల వల్ల కలిగే ఉద్యోగ నష్టాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆటో రంగంలో విభిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, జాతీయ రహదారుల విస్తరణపై మాట్లాడారు. "మేక్-ఇన్-ఇండియా" చొరవను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా కేంద్ర మంత్రి గడ్కరీ నాయకత్వంలో ఆటోమోటివ్, రవాణా రంగాల్లో.. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కొన్ని ప్రయాణీకుల కార్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లను తప్పనిసరి చేసింది. అంతే కాకుండా హైవేలపై టోల్‌గేట్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించేందుకు.. టోల్ వసూలు కోసం ఫాస్టాగ్‌ని అమలుచేసింది.

ఈ నేపథ్యంలో హైవేలపై ప్రమాదాల నిర్మూలన, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అధిక జరిమానాలు విధించడం, హైడ్రోజన్‌తో నడిచే కార్ల కోసం అధునాతన సాంకేతికతను అవలంబించడం, ఇంకా కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రవేశపెట్టడం వంటి పలు సంస్కరణలపై కార్యక్రమంలో మంత్రి వివరించారు. కాగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హ్యుందాయ్, కియా, టాటా మోటార్స్ వంటి అనేక కంపెనీలు క్రమంగా తమ ప్యాసింజర్ కార్ల శ్రేణిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నాయి.
ఇక చివరిగా కార్యక్రమంలో మంత్రి భారతదేశంలో టెస్లా కార్ల లాంచ్‌పై కూడా గడ్కరీ మాట్లాడారు. భారత్‌లో పని చేస్తున్నందుకు టెస్లాకు భారత ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కానీ చైనాలో తయారు చేయబడిన కార్ల విక్రయాలను భారత్‌లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇంకా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తామన్నారు.

అయితే, ICE వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి కేంద్ర మంత్రి ఎటువంటి గడువును పేర్కొనలేదు. దీనికి కారణం పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మారడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఇందుకోసం భారత్‌లో బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్‌లు కావాల్సి ఉంటుంది. వీటిని అభివృద్ధి చేయడానికి సమయం తీసుకుంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








