హెల్మెట్ పెట్టుకో ప్రాణాన్ని నిలబెట్టుకో.. మనోళ్లకు కాస్త బద్ధకం ఎక్కువ అందుకే రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి
ఐక్యరాజ్యసమితి సహకారంతో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు పలు క్యాంపెయిన్‌లను నిర్వహించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో హెల్మెట్లపై అవగాహన కల్పిస్తుంది. ప్రధానంగా భారత్‌లో ఈ క్యాంపెయిన్‌లను ఉధృతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు. ప్రమాదాలను నివారించేందుకు ఐక్యరాజ్యసమితి నిర్వహించబోయే క్యాంపెయిన్ వివరాలపై ఓ లుక్కేద్దాం..
ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్యను తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా పలు చర్యలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్న వారిలో ద్విచక్రవాహనదారులు మాత్రమే ఉన్నారు. అంతే కాకుండా పలు యాక్సిడెంట్లకు వీరు కారకులు అవుతున్నారు. వీటిని తగ్గించేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దేశంలో ఈ ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించే క్యాంపెయిన్‌ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ జీన్ డోల్, అసోసియేషన్ ఆఫ్ టూ వీలర్ హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అధ్యక్షుడు, స్టీల్ బర్డ్ హెల్మెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కపూర్ కలిసి ప్రారంభించారు. ఈ ప్రచారానికి 'హెల్మెట్ ఫర్ హోప్' అని పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఇది కూడా మంచి ఫలితాలను ఇచ్చింది.
ద్విచక్రవాహనాలు, సైకిళ్లు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఈ క్యాంపెయిన్ సూచిస్తుంది. రోడ్డు భద్రతను, ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు గాయాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్‌ని రన్ చేస్తున్నారు. 2023లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని 80 దేశాల్లోని 1,000 నగరాల్లో నిర్వహించాలని యోచిస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని వేగవంతం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేయాలని మీడియా యోచిస్తోంది.

వీరి టీమ్ ప్రతి దేశంలోని ప్రముఖులతో కూడా ప్రచారం చేస్తారు. ఫేమస్ అయిన వ్యక్తులతో ప్రచారం చేయడం వల్ల వారు అనుకున్న మెసేజ్ సులువుగా ప్రజల్లోకి వెళ్లగలదని వారిని ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. అంతేకాకుండా హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రతి దేశంలోని లాభాపేక్షలేని సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ముఖ్యంగా NGOలు ఈ క్యాంపెయిన్‌లో ఎక్కువ భాగం అవుతున్నాయి.
వివిధ కార్పొరేట్ సంస్థలతో కలిసి ఈ బృందం 40కి పైగా దేశాల్లో లక్షకు పైగా హెల్మెట్లను ప్రజలకు పంపిణీ చేసింది. కాంగో, ఈజిప్టు, ఘనా, కెన్యా, మడగాస్కర్, నైజీరియా, దక్షిణాఫ్రికా, ఉగాండా, వియత్నాం వంటి దేశాల్లో ఈ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో భారత్‌లో ఈ ప్రచారం చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
భారత్ వంటి దేశాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చట్టాలు ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో ఎంతగానో ఉపయోగపడతాయి. దీన్ని ఆసరాగా చేసుకుని అమెజాన్, ఓలా, ఉబెర్ వంటి సంస్థలు ద్విచక్ర వాహనాల ద్వారా డెలివరీ వ్యాపారం చేస్తున్నాయి. దీంతో వారి సంస్థలో పనిచేసే వారికి హెల్మెట్ ధరించాలనే కచ్చితమైన నిబంధనలను అమలు చేయనున్నారు.
నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల ద్విచక్రవాహనదారులు రోడ్డు ప్రమాదంలో మరణించే ప్రమాదం ఆరు రెట్లు, మెదడు దెబ్బతినే ప్రమాదం 74 శాతం తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. భారతదేశం అంతటా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహన ప్రమాదాలలో మరణాలకు ప్రధాన కారణాలలో తలకు గాయం అనేది ముఖ్యమైన కారణంగా ఉంది. అందుకోసం నాణ్యమైన హెల్మెట్స్‌తో తలకు సరైన భద్రత కల్పించాలి.
ప్రపంచంలోని 174 దేశాల్లో కేవలం 54 దేశాల్లో మాత్రమే హెల్మెట్ వినియోగం తప్పనిసరిగా ఉంది. ఈ చట్టం అమల్లో ఉన్న దేశాల్లో కూడా 47 శాతం మంది హెల్మెట్లను సరిగా ఉపయోగించడం లేదని ఒక అధ్యయనం తెలిపింది. ఈ లెక్కలన్నింటి ఆధారంగా హెల్మెట్లపై అవగాహన పెంచేందుకు ఐక్యరాజ్యసమితి ఈ చొరవ తీసుకుంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలతో జనాలకు హెల్మెట్ ప్రాధాన్యత తెలిసి వస్తుందని పలువురు భావిస్తున్నారు.
డ్రైవ్స్‌పార్క్ ఒపీనియన్: భారత్ వంటి దేశాల్లో ద్విచక్ర వాహనాల వినియోగం ఎక్కువగా ఉంది. ఇక్కడ హెల్మెట్లపై మరింత అవగాహన కచ్చితంగా కల్పించాలి. హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఎక్కువ మంది వాహనదారులు హెల్మెట్ ధరించడం చూడవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో దీనిపై పెద్దగా అవగాహన లేదు. ప్రజల్లో ఈ అవగాహన అవసరం. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి కార్యక్రమాలను కచ్చితంగా స్వాగతించవచ్చు.


Click it and Unblock the Notifications








