అయోధ్యలో ‘ఎలక్ట్రిక్ కార్ల' ట్యాక్సీ సర్సీస్.. తక్కువ ఛార్జీలతో పర్యాటక ప్రాంతాలను చుట్టేయొచ్చు.!!
మరికొద్ది రోజుల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 22న 'రామ్ లల్లా' విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. కాగా అయోధ్యలో పర్యావరణం కాలుష్యం కాకుండా యూపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అయోధ్యలో పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అయోధ్యలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చే యోచనలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మొదటి దశలో అయోధ్య- లక్నో మధ్య ఇంటర్‌సిటీ ప్రయాణానికి 15 ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులో ఉంచనుంది.

అయోధ్య - లక్నో మధ్య ఇంటర్‌సిటీ ప్రయాణానికి టాక్సీ సేవల కోసం 15 ఎలక్ట్రిక్ కార్లను యూపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయోధ్యలోని ప్రధాన ప్రదేశాల్లో త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను యాత్రికులకు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. సూరజ్ కుండ్, సరయు నది సహా వివిధ మతపరమైన కేంద్రాలకు సందర్శకులు ఈ కార్లను వినియోగించుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్లను బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నారు.
ఇందులో భాగంగా మొదటగా అయోధ్య రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల కోసం ఈ ఎలక్ట్రిక్ కార్ల ద్వారా ట్రయల్ సర్వీస్‌ను ప్రారంభించారు. 10 కిలోమీటర్లకు రూ. 250, 20 కిలోమీటర్లకు రూ. 400, 12 గంటలకు రూ. 3000 చొప్పున ప్రయాణికులు ట్యాక్సీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ ఎలక్ట్రిక్ కార్ సర్వీస్ పట్ల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

కాగా అయోధ్యలో ప్రస్తుతం యాత్రికుల కోసం వినియోగించే ట్యాక్సీ సర్వీస్‌లో టాటా టిగోర్ EV కార్లను ఉపయోగిస్తున్నారు. వీటితో పాటు గత దీపోత్సవం నుండి ఈ-కార్ట్ సేవ కూడా ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషం. ఇందులో ఆరుగురు యాత్రికులు ప్రయాణించవచ్చు. ఈ కార్ట్ ద్వారా వృద్ధ భక్తులు హనుమాన్ గర్హి, శ్రీరామ జన్మభూమి మొదలైన ప్రదేశాలను చూడవచ్చు.
దేశీయ మార్కెట్లో ప్రస్తుతం, Tata Tigor EV వాణిజ్య అవసరాల కోసం మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండగా.. దీని ధర రూ. 12.49 లక్షల నుండి రూ. 13.75 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. టాటా టిగోర్ ఈవీని XE, XZ ప్లస్‌తో సహా 4 వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.
డేటోనా గ్రే, సిగ్నేచర్ టీల్ బ్లూతో సహా 3 మోనోటోన్ ఆకర్షణీయమైన కలర్స్‌లో టాటా మోటార్స్ ప్రవేశపెట్టింది. టాటా టిగోర్ EV బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 26 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 75 PS పవర్ మరియు 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా... ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 315 కిలోమీటర్ల (ARAI) రేంజ్‌ను పొందవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 8.5 గంటలు సమయం తీసుకుంటుంది. కాగా 25 kW DC ఫాస్ట్ ఛార్జర్ కొనుగోలు చేస్తే కేవలం 60 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. టాటా టిగోర్ ఈవీలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీతో సహా అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది.
ఇక భద్రత విషయానికొస్తే ఇతర కార్ల మాదిరిగానే టాటా టిగోర్ ఈవీ.. ప్రయాణికుల సేఫ్టీ విషయంలో రాజీ పడలేదు. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), టైర్ పంక్చర్ రిపేర్ కిట్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.


Click it and Unblock the Notifications








