పోలీసులకు దిమ్మతిరిగే కౌంటర్.. ఆడి కారులో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్.. అసలేం జరిగిందంటే!!
దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం అయ్యాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే క్షణాల్లో గుర్తించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సీసీటీవీ ఇన్‌స్టాలేషన్‌తో అధిక మొత్తంలో దేశవ్యాప్తంగా చలాన్లు జారీ అవుతున్నాయి. వాహన రిజిస్ట్రర్ అయిన నంబర్‌కి క్షణాల్లో చలాన్ సందేశం వెళ్తుంది.
అయితే ఈ విధానం కొన్ని సమయాల్లో గతి తప్పుతోంది. సీసీటీవీల ఆధారంగా ఆటోమేటిక్‌గా జారీ అవుతున్న చలాన్లలో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. అలాంటి సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఓ వ్యక్తికి జారీ అయిన చలానాను చూసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు. తన కారుకి చలానా విధిస్తూ అటాచ్ చేసిన ఫోటోను చూసి అతను ఆశ్చర్యపోయాడు. అసలేం జరిగిందంటే..

సాధారణంగా కార్లలో ప్రయాణంచేటప్పడు సీటు బెల్టు ధరించకుంటే ఫైన్ వేస్తారు. అలాగే రాంగ్ రూట్ ఇంకా ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ట్రాఫిక్ చలానా విధిస్తారు. అయితే ఓ వ్యక్తికి చలానా తప్పుగా జారీ అయిన వార్త వైరల్ అయ్యింది. తన కారుకి చలానా విధిస్తూ అటాచ్ చేసిన ఫోటో బైక్ ఉండడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. హెల్మెట్ ధరించక పోవడం వల్లే ఫైన్ విధించినట్లు చలానాలో పోలీసులు పేర్కొన్నారు.
ఈ చర్యకు ప్రతిగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన బహదూర్ సింగ్ తన ఆడి కారులో బయటకు వళ్లిన ప్రతీసారి హెల్మెట్ ధరిస్తూ వస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. తప్పుడు చలానా జారీ కావడంపై ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సింగ్‌కి పోలీసులు వింత సమాధానం ఇవ్వడంతో అతను అసహనం వ్యక్తం చేశాడు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తన ఫిర్యాదుపై దర్యాప్తు చేయలేమని పోలీసు అధికారులు బహదూర్ సింగ్‌కి తెలియజేశారు. ఆ సమాధానికి కంగుతిన్న సింగ్.. తాను కారులో ప్రయాణిస్తున్న ప్రతీసారి హెల్మెట్ ధరిస్తూ వెళ్తున్నాడు. లగ్జరీ కారు ఆడిలో హెల్మెట్ ధరించి వెళ్తుండటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు విషయం తెలియడంతో ముక్కున వేలేసుకుంటున్నారు. బహదూర్ సింగ్ చేస్తున్న చర్యను మరికొందరు సమర్థిస్తున్నారు.
భారత్‌లో ఇటువంటి తప్పుడు చలానాలు జారీ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ద్విచక్రవాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలతో చాలా మందికి జరిమానా విధించారు. ఇక కేరళలో ఏఐ కెమెరా జారీ చేసే చలానాల్లో తప్పులు దొర్లుతున్నాయి. ఈ సంఖ్య రోజు రోజుకు అధికం అవుతున్నాయి. దీంతో జనాలు గందరగోళానికి లోనవుతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగానే భారత్‌లోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయమే అయినప్పటికీ ఇలాంటి చిన్న చిన్న తప్పులపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కొన్ని తప్పిదాలను అధిగమించేందుకు మానవ సేవలను వినియోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి.
అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొందరు నకిలీ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. దీనిని అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తే పలు రాష్ట్రాల్లో జెలు శిక్ష విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు ఆకతాయిలు మీ నంబర్ ప్లేట్‌ని వినియోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు చలానా జారీ చేసే వెబ్‌సైట్‌లో చెక్ చేస్తూ ఉండాలి.


Click it and Unblock the Notifications








