Video Viral వందేభారత్ రైలు ఎక్కబోయి కిందపడిన టీసీ.. ఆ టెక్నాలజీ లేకుంటే..!!
వందేభారత్.. ఈ రైలు అందుబాటులోకి వచ్చాక చాలాసార్లు ఈ రైలుకు సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. రైలు ప్రారంభించిన మొదట్లో రైలు వేగం, ఫీచర్లు, ఇతర సౌకర్యాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనంతరం దానితోపాటు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.
తొలిసారిగా ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్- వారణాసి మార్గంలో 2019 ఫిబ్రవరి 15న వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల మధ్య ఈ రైళ్లు పరుగురు పెడుతున్నాయి. ఈ రైళ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు.

వందేభారత్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు నెటిజన్లను నవ్వించాయి. మరికొన్ని మాత్రం ఆందోళన కలిగించాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వందే భారత్ రైలు సంబంధించిన వీడియో కొంచెం ఆందోళన కలిగిస్తోంది. స్టేషన్ నుంచి కదులుతున్న వందేభారత్‌లో ఎక్కేందుకు ప్రయత్నించి టీసీ ట్రాక్‌పై పడిపోయారు. దీంతో సమీపంలో ఉన్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై అతన్ని రక్షించారు.

సాధారణ రైళ్లు కదులుతున్న సమయాల్లో చాలా మంది బోగీల్లోకి ఎక్కడం లేదా దిగడం చేస్తుంటారు. అయితే వందే భారత్‌లో అలాంటివి కుదరవు. రైలు కదలడానికి ముందే అన్ని బోగీల డోర్లు మూసుకుపోతాయి. ప్రయాణికులు వీటిని తెరవలేదు. కేవలం లోకోపైలెట్ వద్ద మాత్రమే డోర్లు తెరిచేందుకు అవసరమైన వ్యవస్థ ఉంటుంది.

అయితే వందేభారత్ రైలులో ఇటువంటి టెక్నాలజీ ఉందని తెలియని వాళ్లు... రైలు కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నించారంటే తెలియక చేశారని అనుకోవచ్చు. కానీ రోజు రైలులో ప్రయాణం చేసే టీసీ కూడా.. రైలు ఎక్కేందుకు ప్రయత్నం చేసి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌లో వందేభారత్ రైలు ఆగి ఉంది. రైలు కదలడానికి ముందు టీసీ.. రైలు నుంచి బయటకువచ్చారు. కొద్ది సేపటికే రైలు ప్రయాణానికి సిద్ధం కావడం చూసి, బోగీల్లోకి ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. లోకో పైలెట్ గది వద్ద కిటికీని కొట్టడం కూడా మనం గమనించవచ్చు. చివరి ప్రయత్నంగా కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి, కింద పడిపోయారు. ఈ ఘటన జూన్ 26న జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చింది.
రైలు ఎక్కేందుకు ప్రయత్నం చేసిన టీసీ కిందపడడాన్ని స్టేషన్‌లో ఉన్నవారు గమనించారు. వెంటనే టీసీని రక్షించారు. కాసేపటికే రైలు కూడా ఆగింది. సాధారణ రైలు అయితే కచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. కానీ వందేభారత్ రైలులో అటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే వందేభారత్ కోచ్, ప్లాట్‌ఫారమ్ మధ్య కనీస దూరం మూడు అంగుళాలు మాత్రమే.. ఫలితంగా ట్రాక్, ప్లాట్‌ఫాం మధ్య ఎవరూ పడకుండా ఇది నివారిస్తుంది.
ఈ వీడియోపై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. టీసీ పరిస్థితే ఇలా ఉండే సామాన్య ప్రయాణికుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రైలు కదిలేందుకు ముందు టీసీ, లోకోపైలెట్ మధ్య కమ్యూనికేషన్ ఎందుకు జరగలేదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. వందే భారత్ రైలు గురించి తెలిసి కూడా టీసీ ఎందుకు బోగీల్లోకి ఎక్కేందుకు ప్రయత్నం చేశారు.. అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications








