వందే భారత్ టాయిలెట్‌లో పొగలు.. రైలు నిలిపి కంపార్ట్‌మెంట్ వైపు పరుగులు తీసిన సిబ్బంది.. చివరికి...!
భారతీయ రైళ్లలో పొగ తాగడం, మద్యం తాగడం చట్టరీత్యా నేరం. వీటితోపాటు తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టినట్లుగా ప్రవర్తించడం కూడా శిక్షార్హం. అయితే రైలులో పొగతాగడం కారణంగా రైలు ఆలస్యంగా ప్రయాణం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రైల్వే సిబ్బంది, ప్రయాణికులను కాసేపు ఆందోళనకు గురిచేసిన ఘటన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది.
రైళ్ల టాయిలెట్‌లోకి వెళ్లి పొగ తాగిన ఘటనలు అనేకం వెలుగులోకి వస్తుంటాయి. అయితే సాధారణ రైళ్లలో పొగను పసిగట్టి అప్రమత్తం చేసే వ్యవస్థ అందుబాటులో ఉండదు. అదే వందే భారత్‌లో ఉన్న ( Vande bharat Train ) ప్రత్యేక అగ్నిమాపక వ్యవస్థ లోకోపైలెట్ సహా సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేస్తుంది. తాజాగా ఇటువంటి ఘటన కేరళలో జరిగింది.

కేరళ రాష్ట్రంలో వందే భారత్ రైలులో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లోకి వెళ్లాడు. కోజికోడ్ ప్రాంతం సమీపంలో సిగరెట్ వెలిగించి పొగ తాగడం ప్రారంభించాడు. అయితే వందే భారత్‌లో ఉన్న అగ్నిప్రమాద హెచ్చరికల వ్యవస్థ వెంటనే టాయిలెట్‌లోని పొగను గుర్తించింది. వెంటనే అలారంను మోగించింది. దీంతో అప్రమత్తమైన లోకోపైలెట్ రైలును నిలిపేశాడు.
వందే భారత్ రైలు ఆగిన వెంటనే అందులో ఉన్న సిబ్బంది.. అలారం మోగిన కంపార్ట్‌మెంట్ వైపు పరుగులు తీశారు. రైలులోని టాయిలెట్‌లో పొగ తాగుతున్న ప్రయాణికుడిని గుర్తించారు. వెంటనే అతన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. రైలు లోపల నుంచి పొగను పూర్తిగా తొలగించిన తర్వాత రైలు బయలుదేరింది.

ఈ ఘటన కారణంగా వందే భారత్ రైలు సుమారు 15 నిమిషాల పాటు ఆలస్యమైంది. అయితే రైలు టాయిలెట్‌లో పొగ తాగడమే కాకుండా మద్యం కూడా సేవించినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. దీంతో సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి జరిమానా విధించారు. వందే భారత్‌లో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. కేరళలోని కాసర్‌గోడ్ తిరువనంతపురం వందే భారత్‌లో జరిగింది.
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వందే భారత్ రైళ్లలో అనేక అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. రైలులో ఆటోమేటిక్ డోర్ల నియంత్రణ పూర్తిగా డ్రైవర్ వద్దనే ఉంటుంది. ప్లాట్‌ఫారమ్ ఉన్న చోట మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. మరియు తలుపులు మూసిన అనంతరమే రైలు ప్రారంభం అవుతుంది. దాంతోపాటు సీసీ కెమెరాలు, అధునాతన భద్రతా వ్యవస్థ ఉంటుంది.
తొలిసారిగా ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్- వారణాసి మార్గంలో 2019 ఫిబ్రవరి 15న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. ఈ రైళ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు. చెన్నైలోని పెరంబలూరు ఐసీఎఫ్ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ రైళ్ల కోసం ప్రత్యేక విభాగం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








