Vande Bharat Train మూడు వెర్షన్లలో వందే భారత్ రైలు.. హై స్పీడ్ ట్రాక్ ప్రత్యేకత..
భారతీయ రైల్వేలో సరికొత్త హంగులతో ఇటీవల ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ప్రణాళికలో వందే భారత్ రైలు ఒకటి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో రైళ్ల విస్తరణకు రైల్వే శాఖ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
2024 ఫిబ్రవరి - మార్చి నాటికి దేశవ్యాప్తంగా మూడు వెర్షన్లలో వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వందే ఛైర్ కార్, వందే మెట్రో, వందే స్లీపర్ ఇలా మూడు వేరియంట్లలో సేవలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు అనుగుణంగా రైల్వే ట్రాకులను భారతీయ రైల్వే పునరుద్ధరించనుంది.

వందే భారత్ రైలు వంద శాతం భారతీయ సాంకేతికతో తయారుచేయబడిన సెమీ హై స్పీడ్ రైలు. ఇది శతాబ్ధి, రాజధాని వంటి రైళ్ల స్థానంలో తయారుచేయబడుతోంది. ఈ రైలు చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతుండటం విశేషం. ఈ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని ఇస్తాయని రైల్వే మంత్రి వెల్లడించారు.
వీటిలో అత్యాధునిక సాంకేతికతతో పాటు పలు ప్రత్యేకతలు ఉంటాయని భారతీయ రైల్వే తెలిపింది. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తున్న రైల్వే శాఖ మరో మూడు నాలుగేళ్లలో రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టనుంది. గంటకు 160 కి.మీ వేగాన్ని తట్టుకునేలా రైల్వే ట్రాకులు సిద్ధం అవుతాయని వెల్లడించింది.

ఈ ఏడాది జూన్ మధ్య నాటికి ప్రతి రాష్ట్రంలో వందే భారత్ రైలు ఉంటుదని మంత్రి తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి పెరుగుతోందని.. రైల్వే ట్రాక్‌ల నవీకరణ, వేగాన్ని పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయన తెలిపారు. పాత ట్రాక్‌ల వేగ పరిమితి, ప్రస్తుతం పునరుద్ధరిస్తున్న కొత్త ట్రాక్‌ల పురోగతిని వివరించారు.
పాత ట్రాక్‌లు గంటకు 70 నుండి 80 కిమీ వేగంతో రూపొందించబడ్డాయి. 110 కి.మీ, 130 కి.మీ, 160 కి.మీ వేగానికి అలవాటు పడేలా వచ్చే మూడు, నాలుగేళ్లలో దాదాపు 30 వేల నుంచి 35 వేల కి.మీ ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేస్తామని రైల్వే మంత్రి వైష్ణవ్ చెప్పారు.

ఢిల్లీ - డెహ్రాడూన్ వందే భారత్ ప్రాజెక్టుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మార్గంలో నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ఆరు గంటల 10 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు ఆధునిక సౌకర్యాలతో కొత్త రైలుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోంది.
సరిహద్దు ప్రాంతాలను అనుసంధానం చేసేలా రైల్వే ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వైష్ణవ్ తెలిపారు. రైలు కనెక్టివిటీ ప్రాజెక్టులతో పాటు ప్రయాణికులకు 4G, 5G సేవలను అందించడానికి రైల్వే నిబద్ధతతో ఉందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టవర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








