తక్కువ ధరలో వేగవంతమైన హై క్లాస్ జర్నీ.. వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలివే.!!
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతున్నాయి. వీటిని ప్రీమియం సెమీ హై స్పీడ్ రైళ్లుగా పిలుస్తున్నాం. సాధారణ రైళ్లతో పోలిస్తే.. వేగవంతమైన ప్రయాణంతో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ క్రమంలో త్వరలో వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రానున్నాయి. స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే కార్మికులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించారు.
కాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే.. వందే 'సాధారణ్'(Vande Sadharan) రైళ్లు కొంచెం భిన్నంగా ఉంటాయి. వందే సాధారణ్ రైళ్లు 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందించబడ్డాయి. ఈ రైళ్లలో ఇంటర్‌సిటీ ప్రయాణంతో పాటు డే అండ్ నైట్ ప్రయాణాలు సైతం చేయవచ్చు. అయితే ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రత్యేక సందర్భాల్లో తప్ప రాత్రి సమయాల్లో సర్వీస్‌ను అందించడం లేదు.

ఇక వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సౌకర్యాల విషయానికొస్తే ఇందులో 22 కోచ్‌లు, 2 ఇంజన్లు ఉంటాయి. 12 అన్‌రిజర్వ్‌డ్ స్లీపర్ కోచ్‌లతో పాటు 8 జనరల్ కోచ్‌లు ఉంటాయి. వీటితో పాటు 2 లగేజ్ కోచ్‌లు ఉంటాయి. అంతే కాకుండా ఈ రైల్లో 1,800 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించగలరు.
వందే సాధారణ్ రైలు గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఇంజిన్‌ను రూపొందించినా.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వేగాన్ని గంటకు 110 కిలోమీటర్లకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. వందే సాధారణ్ రైళ్లు నాన్-ఏసీ రైలు కాగా ఇందులో బయో-వాక్యూమ్ టాయిలెట్, LED లైట్, ఫ్యాన్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కాగా వందే సాధారణ్ రైళ్లలో వందే భారత్ మాదిరిగా ఆటోమేటిక్ డోర్లు, ప్యాంట్రీ సిస్టమ్ ఉండవని సమాచారం. ఇటీవల ఆగష్టు 29 న కొత్త వందే సాధారణ్ రైలు ముంబైలోని వాడి బందర్ యార్డ్‌కు చేరుకోగా.. నవంబర్ 8న అహ్మదాబాద్ మరియు ముంబయి మధ్య ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు.
కాగా వందే సాధారణ్ రైలు ముంబయి - అహ్మదాబాద్ మార్గంలో కాకుండా, ముంబయి - న్యూఢిల్లీ, పాట్నా - న్యూఢిల్లీ, హౌరా - న్యూఢిల్లీ, హైదరాబాద్ - న్యూఢిల్లీ, ఎర్నాకులం - గౌహతి మార్గాల్లో ఈ రైలు నడిచే అవకాశం ఉంది. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వందే భారత్ సాధారణ్ రైళ్లకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్నారు.

వందే సాధారణ్ రైళ్లలో ప్రయాణికులు తక్కువ టికెట్ ఛార్జీలతో వందేభారత్ యాత్రను ఆస్వాదించవచ్చు. కాగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ రైళ్ల కంటే 15 శాతం మాత్రమే ఎక్కువ ఛార్జీలు ఉంటాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 30 రూట్లలో వందే సాధారణ్ రైళ్ల సర్వీసులను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఇందుకోసం చెన్నై కోచ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీలో 400 వందే సాధారణ్ రైళ్లను తయారు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ మార్గాల్లో ఈ రైళ్లు తిరగనున్నాయో వేచి చూడాలి. వీటితో వాటు రైల్వే శాఖ 'వందే భారత్ స్లీపర్' రైళ్లను సైతం అభివృద్ధి చేస్తోంది. ఇవి ఫిబ్రవరి 2024 నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 857 బెర్త్‌లు ఉంటాయి.


Click it and Unblock the Notifications








