నెంబర్ ప్లేట్ రంగును చూసి వెహికల్ జాతకం చెప్పొచ్చు..ఈ సీక్రెట్స్ 90శాతం మందికి తెలియవు
రోడ్డుపై వెళ్తున్నప్పుడు మనం రకరకాల రంగుల నంబర్ ప్లేట్లను చూస్తుంటాం. చాలామందికి వైట్, ఎల్లో కలర్ ప్లేట్ల గురించి మాత్రమే తెలుసు. కానీ భారతదేశంలో వాహనాల నంబర్ ప్లేట్లు కేవలం నంబర్లను ప్రదర్శించడానికి మాత్రమే కాదు, ఆ వాహనం దేనికి సంబంధించింది? దాని యజమాని ఎవరు? ఆ వెహికల్ చట్టపరమైన హోదా ఏంటి? అనే విషయాలను ఇట్టే చెప్పేస్తాయి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఈ రంగులను కేటాయించారు. ఒకవేళ మీరు తప్పుడు నంబర్ ప్లేట్‌తో దొరికిపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే నంబర్ ప్లేట్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
వైట్ నంబర్ ప్లేట్
భారతదేశంలో మనం అత్యధికంగా చూసే నంబర్ ప్లేట్ ఇది. తెల్లని బ్యాక్‌గ్రౌండ్ మీద నల్లని అక్షరాలతో ఉంటుంది. ఇది పూర్తిగా వ్యక్తిగత వాహానాలకు కేటాయించబడింది. మీ సొంత కారు, బైక్ లేదా స్కూటర్ మీద ఈ ప్లేట్ ఉంటుంది. ఈ వాహనాలను మీరు సొంత అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. వీటిని అద్దెకు తిప్పడం లేదా వ్యాపార అవసరాలకు (సరుకులు మోయడానికి) వాడటం చట్టరీత్యా నేరం. అలా చేస్తే మీ వాహనం సీజ్ కావడమే కాకుండా భారీ జరిమానా పడుతుంది.

ఎల్లో నంబర్ ప్లేట్
పసుపు రంగు ప్లేట్ మీద నల్లని అక్షరాలు ఉంటే అది కమర్షియల్ వెహికల్ అని అర్థం. అంటే ఈ వాహనం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. టాక్సీలు, క్యాబ్‌లు, ఆటోలు, బస్సులు, లారీలకు ఈ రంగు ప్లేట్ ఉంటుంది. ఈ వాహనాలను నడపాలంటే డ్రైవర్ వద్ద కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వీటికి పర్మిట్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వంటి నిబంధనలు వర్తిస్తాయి. అలాగే, ప్రైవేట్ వాహనాల కంటే వీటికి పన్నులు కూడా ఎక్కువే ఉంటాయి.
గ్రీన్ నంబర్ ప్లేట్
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. వీటికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగు నంబర్ ప్లేట్లను కేటాయించింది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి.
ఆకుపచ్చ ప్లేట్ + తెల్లని అక్షరాలు: ప్రైవేట్ ఎలక్ట్రిక్ కారు లేదా బైక్.
ఆకుపచ్చ ప్లేట్ + పసుపు అక్షరాలు: కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనం (ఉదాహరణకు ఎలక్ట్రిక్ టాక్సీ లేదా బస్సు).
లాభం: ఈ వాహనాలకు రోడ్ టాక్స్ లో మినహాయింపు, ఉచిత పార్కింగ్ వంటి రాయితీలు చాలా రాష్ట్రాల్లో లభిస్తున్నాయి.

బ్లాక్ నంబర్ ప్లేట్
నలుపు రంగు ప్లేట్ మీద పసుపు రంగు అక్షరాలు ఉంటే అవి సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కార్లు. జూమ్ కార్ లేదా రెవ్ వంటి సంస్థలు ఇచ్చే కార్లు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇవి కమర్షియల్ వాహనాలే అయినప్పటికీ, వీటిని నడపడానికి కమర్షియల్ లైసెన్స్ అవసరం లేదు. సాధారణ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఎవరైనా ఈ కార్లను అద్దెకు తీసుకుని సొంతంగా నడుపుకోవచ్చు. లగ్జరీ హోటళ్లలో అతిథుల కోసం వాడే వాహనాలకు కూడా ఈ ప్లేట్ ఉంటుంది.
రెడ్ నంబర్ ప్లేట్
ఎరుపు రంగు నంబర్ ప్లేట్ రెండు సందర్భాల్లో కనిపిస్తుంది.
టెంపరరీ రిజిస్ట్రేషన్: మీరు కొత్త కారు కొన్నప్పుడు పర్మనెంట్ నంబర్ వచ్చే వరకు షోరూమ్ వారు ఎరుపు రంగు ప్లేట్ ఇస్తారు. దీని కాలపరిమితి కేవలం ఒక నెల మాత్రమే.

రాష్ట్రపతి, గవర్నర్లు: భారతదేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి), రాష్ట్రాల గవర్నర్ల వాహనాలకు ఎరుపు రంగు ప్లేట్ ఉంటుంది. వీటి మీద నంబర్ ఉండదు, దానికి బదులుగా అశోక చక్రం(నేషనల్ ఎంబ్లమ్) ఉంటుంది.
బ్లూ నంబర్ ప్లేట్
నీలం రంగు ప్లేట్ మీద తెల్లని అక్షరాలు ఉంటే అది విదేశీ రాయబార కార్యాలయాలకు చెందిన వాహనం అని అర్థం. ఈ ప్లేట్ మీద రాష్ట్ర కోడ్ (AP, TS వంటివి) ఉండవు. దానికి బదులుగా United Nations లేదా Diplomatic Corps వంటి అక్షరాలు ఉంటాయి. ఈ వాహనాలకు కొన్ని ప్రత్యేక రాయితీలు, రక్షణ ఉంటాయి.

పైకి చూపిస్తున్న బాణం గుర్తు ఉన్న నంబర్ ప్లేట్
సైనిక వాహనాలకు ఈ రకమైన నంబర్ ప్లేట్లు ఉంటాయి. వీటి నంబర్లు రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా కేటాయించబడతాయి. వీటిలో మొదటి లేదా రెండో అంకె పైకి చూపిస్తున్న బాణం గుర్తులా ఉంటుంది. దీనిని బ్రాడ్ యారో అని పిలుస్తారు. యుద్ధం లేదా అత్యవసర సమయంలో ఈ వాహనాల కదలికలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది.
హెచ్ఎస్ఆర్పీ అంటే ఏంటి?
ఇప్పుడు అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి. ఇవి అల్యూమినియంతో తయారవుతాయి. వీటి మీద లేజర్ తో చెక్కబడిన ఒక ఐడెంటిఫికేషన్ నంబర్, చక్రం గుర్తు గల క్రోమియం హోలోగ్రామ్ ఉంటాయి. ఈ ప్లేట్లు ఒకసారి వాహనానికి అమర్చితే మళ్ళీ తీయడం కుదరదు. దీనివల్ల వాహనాల దొంగతనాలు తగ్గుతాయి. పోలీసులు సులభంగా వాహనాలను ట్రాక్ చేయవచ్చు.
తప్పుడు ప్లేట్ ఉంటే ప్రమాదమే!
మీ వాహనానికి చట్టం సూచించిన రంగు నంబర్ ప్లేట్ మాత్రమే ఉండాలి. చాలామంది నంబర్ ప్లేట్ల మీద తమ కులం పేర్లు, పదవులు లేదా డిజైన్లు వేయిస్తుంటారు. ఇది ముమ్మాటికీ నేరం. ఎంవీ యాక్ట్ ప్రకారం నంబర్ ప్లేట్ స్పష్టంగా ఉండాలి. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. కాబట్టి మీ వాహనం పనిని బట్టి సరైన రంగు ప్లేట్‌నే వాడండి.


Click it and Unblock the Notifications








