షాకింగ్ వీడియో: మనం ఇక మారమా..? అంబులెన్స్‌కి దారివ్వమా..?
అంబులెన్స్.. ఈ పేరు వింటే ఎవ్వరికైనా గుండె ఝల్లు మంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి వాహనమైనా ఎక్కాలనుకుంటారు కానీ అంబులెన్స్ మాత్రం ఎక్కాలనుకోరు. అంబులెన్స్ అంటేనే ప్రమాదం, కొన ఊపిరితో ఉన్న ప్రాణం అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఆ అంబులెన్స్ వాహనాలే కొన్ని సందర్భాల్లో ప్రాణాలను రక్షించే సంజీవినిలని అర్థం చేసుకోరు.
మనదేశంలో అంబులెన్స్ వాహనాలకు పెద్ద ప్రాముఖ్యత ఉండదు, ఇందుకు కారణం మనమే. రోడ్డుపై అంబులెన్స్ వాహనం సైరన్‌తో వెళ్తుంటే కనీసం దానికి దారి ఇవ్వాలన్న ఇంగితజ్ఞానం మన రోడ్డు వినియోగదారులకు ఉండదు. ఇంకా అంబులెన్స్ వాహనాన్ని ఆసరగా చేసుకొని దాని ముందో లేక వెనుకో వేగంగా పరుగులు తీసేందుకు ప్రయత్నిస్తుంటారు.
అంబులెన్స్‌లో ఉన్న వారి పరిస్థితి బయటి వారికి కనిపించదు. అందులో ఎవ్వరున్నారనేది వారికి అనవసరం, వారికి కావల్సిందల్లా అంబులెన్స్ కన్నా ముందు తామే గమ్యం చేరుకోవటం. వాస్తవానికి అంబులెన్స్ వాహనాలు సకాలంలో ఆస్పత్రులకు చేరగలిగితే, అందులో అత్యవసర వైద్యం కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉండే వారిని ఎంతో మందిని రక్షించవచ్చు.
నగరంలో వాహనాల వినియోగం అధికం కావటంతో రోడ్లపై వాహన రద్దీ క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో అంబులెన్స్ వాహనాలు ఈ ట్రాఫిక్ ఇక్కట్లను దాటుకొని ఆస్పత్రి చేరే సరికి చాలా ఆలస్యం అవుతోంది. ఆ తప్పు అంబులెన్స్‌ను నడిపే డ్రైవర్‌ది కాదు, మనది. అవును మనమే గనుక రోడ్డుపై అంబులెన్స్‌కు దారి వదిలినట్లయితే, అందులోని వారి ప్రాణాలను కాపాడిన వారమవుతాం.
అంబులెన్స్‌లో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడానికి మనం డాక్టర్లో, దేవుళ్లో కానవసరం లేదు. కనీస మానవత్వంతో వ్యవహరించి రోడ్డుపై అంబులెన్స్‌కు దారి వదిలితే చాలు. ఇదే మనం చేయాల్సిన కనీస సాయం. ఇదిగో ఈ వీడియోలో చూడండి.. మనదేశంలో రోడ్లపై అంబులెన్స్ వాహనాల పరిస్థితి, విదేశాల్లో అంబులెన్స్ వాహనాల పరిస్థితిని ఎంత స్పష్టంగా ఓ సోషల్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా వివరించారో. ఈ వీడియో చూసిన తర్వాతనైనా ఆ కొందరు మారి అంబులెన్స్ వాహనాలకు దారి ఇస్తారని ఆశిద్దాం.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/hZ1hCZtZyes?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








