ఇన్‌స్టాంట్ నూడుల్స్ నుంచి ఎలక్ట్రిక్ కార్ల తయారీ వరకు..VinFast సీఈవో వూంగ్ సక్సెస్ స్టోరీ
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో వియత్నాం దేశానికి చెందిన 'విన్‌ఫాస్ట్' సంస్థ ఎలక్ట్రిక్ కార్లు, విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ కర్మాగారం నెలకొల్పనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం ఈ నెల 7,8 తేదీల్లో తమిళనాడులో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం మహానాడులో జరిగింది. అయితే విన్‌ఫాస్ట్ ఈ స్థాయికి ఎదగడం అంత సులువుగా జరగలేదు.
ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వ్యాపారవేత్తలు ఉన్నాయి. వేల సంఖ్యలో వ్యాపారవేత్తలు తమ సామ్రాజ్యాన్ని విదేశాలకు సైతం విస్తరిస్తూ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే ఆ విజయం వారికి అంత ఈజీగా రాలేదు. ఎన్నో ఒడుదొడుకులను అధిగమిస్తే కానీ సాధ్యం కాలేదు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ తమ కలలను సాధించే వరకూ తీవ్రంగా కృషి చేస్తున్నవారు ఉన్నారు. విన్‌ఫాస్ట్ సీఈవో కూడా ఆ కోవలోకే వస్తారు.

విన్‌ఫాస్ట్(VinFast) ఎలక్ట్రిక్ వాహనాల(EVS) తయారీ, బ్యాటరీ తయారీ కర్మాగారం కోసం ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో రూ. 16,000 కోట్ల మేర ఒప్పందం కుదుర్చుకుంది. కాగా వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్‌ను 2017 లో ఫామ్ నాట్ వూంగ్(Pham Nhat Vuong) స్థాపించారు. దీనికి సీఈవోగా ఆయనే పనిచేస్తున్నారు.
అయితే వియత్నాం దేశంలో మొదటి బిలియనీర్ వూంగ్ కావడం విశేషం. మొదటగా ఆయన ప్రాపర్టీ డెవలపర్‌గా తన వ్యాపారాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించిన వూంగ్.. విన్‌ఫాస్ట్‌ను స్టార్టప్‌తో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థగా VinFast అవతరించింది.
VinFast 2017 లో స్థాపించబడినట్లు సమాచారం. కానీ 2021 లోనే ఈవీల తయారీని ప్రారంభించింది. అయితే ఈ సంస్థ ఇప్పటికీ లాభాలను ఆర్జించలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎంతలా అంటే గతేడాది మూడో త్రైమాసికంలో సంస్థ దాదాపు 623 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.
అయినప్పటికీ 55 ఏళ్ల ఫామ్ నాట్ వూంగ్ వెనుకడగు వేయడం లేదు. కొత్త అగ్రిమెంట్లతో ఈ ఏడాది 2024 చివరి నాటికి విన్‌ఫాస్ట్ లాభాల బాట పట్టి బ్రేక్ ఈవెన్ అవుతుందని వూంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తమిళనాడుతో ఒప్పందంలో భాగంగా తొలి విడతగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతూ భవిష్యత్తుపై ఆశలతో ఉన్నారు.
తూత్తుకుడి(Tuttukudi) జిల్లాలో 400 ఎకరాల్లో రూ. 16,000 కోట్లతో 50 వేల ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే సామర్థ్యం కలిగిన కర్మాగారాన్ని విన్‌ఫాస్ట్ సంస్థ నెలకొల్పాలని నిర్ణయించింది. కాగా వూంగ్ వియత్నాంలోని హనోయిలో జన్మించారు. గ్యాడ్యుయేషన్ అనంతరం వూంగ్ దంపతులు.. ఉక్రెయిన్‌లో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించారు. చివరికి ఇన్‌స్టాంట్ నూడుల్స్‌ను ఉత్పత్తి చేసే వ్యాపారంలోకి ప్రవేశించారు.
కాగా 2009లో 150 మిలియన్ డాలర్లకు ఈ సంస్థను నెస్లేకు విక్రయించి తిరిగి వియత్నాం వెళ్లారు. లాభాలతో వియత్నాం చేరుకున్న వూంగ్.. ప్రాపర్టీ డెవలప్‌మెంట్ ద్వారా లాభాలను చవిచూశారు. దీంతో 2015 నాటికి దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఎలక్ట్రిక్ రంగంలోనూ తన హవా చాటేందుకు VinFast ను స్థాపించారు.
అయితే VinFastను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఫమ్ నాట్ వూంగ్ భారీ ప్రణాళికలు వేసుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. వియత్నాంలో మెయిన్ ప్లాంట్ ఉన్నప్పటికీ విదేశాల్లో తన ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో భారత్‌లోనూ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
కాగా విన్‌ఫాస్ట్ భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థి కంపెనీలకు సవాల్ విసిరేందుకు ఫామ్ నాట్ వూంగ్ సిద్ధంగా ఉన్నారు. ఈవీలపై పలు కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండటంతో భవిష్యత్తులో విన్‌ఫాస్ట్ ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications








