Tata Nano Car మార్కెట్లోకి మళ్లీ వచ్చేస్తున్న టాటా నానో కారు.. ఈ వీడియో చూస్తే మోసపోతారు..
ఇంటర్నెట్ ఇప్పుడు మన జీవితంలో అంతర్భాగమై పోయింది. ఏ సమాచారం కావాలన్నా అరచేతిలో స్మార్ట్‌ఫోన్ ద్వారా క్షణాల్లో తెలుసుకుంటున్నాం. అంతగా దానిపై ఆధారపడుతున్నాం. ఇక సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో కొత్త విషయాలను సైతం మన ముందుకు తీసుకువస్తున్నారు కొందరు వ్లాగర్లు. అయితే అవన్నీ నిజమని అనుకుంటే పొరబడినట్లే..
యూట్యూబ్‌లో ఆసక్తి గల వ్లాగర్లు పలు రంగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్లు మనముందుకు తీసుకువస్తున్నారు. అందులో మార్కెట్‌లోకి వచ్చిన కొత్త కార్లు, బైక్‌ల గురించి కూడా పూర్తి సమాచారాన్ని మనకు అందిస్తారు.వాళ్లు ఇచ్చిన సమాచారం చాలా వరకు నిజమే అయినా.. కొన్ని సార్లు అవగాహన లోపంతో కొందరు తప్పుడు వివరాలు ఇస్తున్నారు.

వీక్షకుల దృష్టిని త్వరగా ఆకర్షించేందుకు, సబ్‌స్క్రైబర్‌లను పెంచుకునేందుకు కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని నిజమని చెప్పి మోసం చేస్తున్నారు. ఇటీవల ట్విన్ టర్బో అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఇలాంటి ఫేక్ వీడియో ఒకటి షేర్ చేశారు. ఇది సరికొత్త తదుపరి తరం టాటా నానో కారు గురించి తెలియజేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ వీడియోలో, తదుపరి తరం టాటా నానో అని తప్పుడు సమాచారం ఇస్తూ ప్రెజెంటర్, 2012 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన టాటా పిక్సెల్ కాన్సెప్ట్ కారు మరియు కియా పికాంటో 3-డోర్ కారు దృశ్యాలను వినియోగించారు. హిందీ లాంగ్వేజ్‌లో, ప్రెజెంటర్ అదంతా నిజమని నమ్మేలా వీక్షకులను బురిడీ కొట్టించాడు.
ఇంకా ఆ కారు గురించి వివరాలు అందిస్తూ.. తదుపరి తరం టాటా నానో ఒమేగా ARC ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని తెలియజేశాడు. 1.0-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుందని వెల్లడించారు. ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ వ్యక్తి చెప్పిన సమాచారమంతా తప్పు. అదంతా ఫేక్ వీడియో.
టాటా ప్రస్తుతం ఉన్న ఇంధనంతో నడిచే నానో ప్లాట్‌ఫారమ్ ఆధారంగా సరికొత్త బడ్జెట్ ధరతో కూడిన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు గతంలో చాలాసార్లు వార్తల్లో వచ్చింది. అయితే కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ముఖ్యంగా ఈ కారు దాదాపు రూ. 5 లక్షల ధరకే లభ్యం కానుందని కొందరు చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో చూశాం.
టాటా మోటార్స్ దేశంలోని మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని 2008లో IEC పవర్డ్ నానో కారును ప్రవేశపెట్టింది. ఇది చాలా సరసమైన కారుగా మార్కెట్‌లోకి వచ్చినా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అమ్మకాలు క్షీణించడంతో, కారును 2018లో నిలిపివేశారు. అయితే ఈ కార్లు ఇప్పుడు కూడా రోడ్లపై అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి.
ఇక్కడ, ట్విన్ టర్బో యూట్యూబ్ ఛానెల్‌లో చూపించిన ఈ వీడియోలో, ఇంధనంతో నడిచే టాటా నానో తిరిగి వస్తున్నట్లు ప్రకటించడానికి పాత ఫుటేజీని ఉపయోగించి ప్రెజెంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. మీరు కూడా యూట్యూబ్‌లో అలాంటి వీడియోలను చూసినప్పుడు, అది నిజమో అబద్ధమో చెక్ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే మోసపోయే అవకాశం ఉంది.
అయితే టాటా ఇటీవలే నానోను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురావడానికి అవకాశం ఉందని సూచించింది.ప్రస్తుతానికి, టాటా మార్కెట్ సామర్థ్యాన్ని మాత్రమే పరిశీలిస్తోంది. కానీ లాంచ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. టాటా నానోను మార్కెట్లోకి విడుదల చేసినప్పటికీ, అది పెట్రోల్ కారు కాకుండా ఎలక్ట్రిక్ వాహనంగా అందించే అవకాశం ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా ఎలక్ట్రిక్ వాహనాలు వాస్తవానికి మొదటగా ఎలక్ట్రిక్ కార్లుగా రూపొందించబడలేదు. Nexon, Tiago, Tigor EV కార్లన్నీ వాటి అంతర్గత దహన ఇంజిన్ వెర్షన్‌ల నుంచి తీసుకున్నారు. టాటా కొత్త EVలను అభివృద్ధి చేయడంలో చురుకుగా పని చేస్తోంది. నానో EV వాటిలో ఒకటి కావచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా అగ్రగామిగా ఉంది.


Click it and Unblock the Notifications








