ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నా ఈవీలను కాదని జనాలు పెట్రోల్ కార్లనే ఎందుకు కొంటున్నారు.. అసలు కారణాలు ఇవే
వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కాలుష్యం స్థాయిలు పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ హితమైన బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. అయితే ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఈవీల అమ్మకాలు మాత్రం బాగా వెనుకబడిపోతున్నాయి.
ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ, అత్యధికంగా అమ్ముడవుతున్నవి మాత్రం పెట్రోల్-డీజిల్ వాహనాలే. త్రీ వీలర్, గూడ్స్ వెహికల్స్, ఈ-బస్సులు, ఈ-రిక్షా వంటి విభాగాల్లో ఈవీలకు డిమాండ్ పెరుగుతున్నా అది పెట్రోల్ వాహనాల అమ్మకాల పెరుగుదల ముందు చాలా తక్కువగా ఉంది. అసలు ఈవీల జోరు ఎందుకు తగ్గుతోందో, దానికి కారణమైన రెండు పెద్ద సమస్యలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

పెట్రోల్ వాహనాలే టాప్
ప్రభుత్వ వాహన డేటాను ఎన్విరోక్యాటలిస్ట్స్ అనే థింక్ ట్యాంక్ విశ్లేషించింది. ఈ డేటా ప్రకారం 2024 లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 2.7 లక్షల పెట్రోల్ టూ వీలర్లు, 26,613 ఎలక్ట్రిక్ టూ వీలర్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. 2025లో ఇదే సమయంలో 3.2 లక్షల పెట్రోల్ టూ వీలర్లు, 27,028 ఎలక్ట్రిక్ టూ వీలర్లు రిజిస్టర్ అయ్యాయి.
దీని బట్టి చూస్తే, ఈ ఏడాది పెట్రోల్, ఈవీ టూ వీలర్ల రిజిస్ట్రేషన్ పెరిగినా, పెట్రోల్ వాహనాల సంఖ్యే ఎక్కువగా ఉంది. అలాగే త్రీ వీలర్ విభాగంలో ఈ ఏడాది 11,331 ఈవీలు రిజిస్టర్ అయ్యాయి. కానీ, అంతకుముందు ఏడాది (2024) లో రిజిస్టర్ అయిన 1,198 ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల సంఖ్య, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు సున్నాగా ఉండటం ఆందోళన కలిగించే విషయం.

ఫోర్ వీలర్లలో పెట్రోల్ ఆధిపత్యం
ఫోర్ వీలర్ల విభాగంలో కూడా పెట్రోల్ వాహనాల ఆధిపత్యం ఇంకా అలాగే ఉంది. వ్యక్తిగత ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల సంఖ్య 3,848 నుంచి 9,905కి పెరిగినప్పటికీ, పెట్రోల్ ఆధారిత కార్ల సంఖ్యతో పోలిస్తే ఈవీల వాటా చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది కేవలం 466 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు (ప్యాసింజర్) మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. అయితే 2024 లో ఈ సంఖ్య 1,748 గా ఉంది. ప్యాసింజర్ ఈవీల రిజిస్ట్రేషన్ తగ్గడం గమనార్హం.
ఈవీ అమ్మకాలు తగ్గడానికి 2 ప్రధాన కారణాలు
1. స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్ కాస్ట్ : ఈవీలకు సంబంధించిన బ్యాటరీ , కంట్రోలర్ వంటి స్పేర్ పార్ట్స్ పెద్ద సమస్య. ఈ పార్ట్‌లు కేవలం కంపెనీ తయారీదారుల వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.లక్షకు పైగా ఉంటుంది. సామాన్యులు, ఆటో డ్రైవర్లకు ఈ ధర చాలా ఎక్కువ. దీనికి విరుద్ధంగా సీఎన్‌జీ వాహనాల మెయింటెనెన్స్ చాలా చౌకగా ఉంటుంది. అంటే ఈవీల స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ కావడం వల్లనే వాటి అమ్మకాలు తక్కువగా ఉన్నాయి.

2. విధానాలు, మౌలిక సదుపాయాల కొరత: ఎన్విరోక్యాటలిస్ట్స్ సంస్థ ప్రధాన విశ్లేషకులు సునీల్ దహియా మాట్లాడుతూ.. వాహనాల సంఖ్యలో మొత్తం వృద్ధి ఇంకా పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే తక్కువగానే ఉందని అన్నారు.
ఈవీల అమ్మకాలు పెరగాలంటే రెండు విషయాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఒకటి, ఈవీలకు సంబంధించిన పాలసీలు మెరుగుపరచాలి. రెండు మౌలిక సదుపాయాలు అంటే ఛార్జింగ్ స్టేషన్లు వంటి వాటిని బలోపేతం చేయాలి. అప్పుడే ఈవీ సెగ్మెంట్‌లో వేగం పెరుగుతుందని తెలిపారు.


Click it and Unblock the Notifications








