నడిరోడ్డు మీద కారుపై ఏనుగు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు, వైరల్ అవుతున్న వీడియో
రోడ్డుపై హ్యుందాయ్ ఎక్సెంట్ కారును ఏనుగు తోసుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. తమిళనాడు ఊటీలోని కోటగిరి రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రయాణికులు ఎదుర్కొనే ప్రధాన సమస్య జంతువులు, పశువులు. వీటి ద్వారా ప్రయాణికులకు మార్గ మధ్యలో అంతరాయం కలుగుతుంది. ఇంకా జంతువులు, పశువులు అడ్డు రావడం ద్వారా ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఘాట్ రోడ్లు, అడవులు, జాతీయ రహదారి పక్కన గ్రామాలు ఉన్న ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.

రాత్రి వేళల్లో తరచూ పులులు, చిరుత వంటి ప్రమాదకరమైన జంతువులు కూడా రోడ్డుపైకి వస్తుంటాయి. అంతేకాకుండా అతి పెద్ద అడవి జంతువు ఏనుగు తరచుగా రహదారిపైకి వచ్చి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. ఆహారం కోసం పంట పొలాల్లోకి వచ్చి వాటిని ధ్వంసం చేయడం, ప్రజలపై దాడి చేయడం లాంటి సందర్భాలూ ఉన్నాయి.
తాజాగా నీలగిరి జిల్లా ఊటీ కోటగిరి రోడ్డులో ఏనుగు ఓ కారును ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చికి చెందిన ఓ కుటుంబం విహార యాత్ర కోసం అద్దెకు హ్యుందాయ్ ఎక్సెంట్ కారు తీసుకుని ఊటీకి వెళ్లారు. కోటగిరి రోడ్డులో కారులో వెళ్తుండగా ఏనుగు అడ్డుగా రావడంతో గమనించిన డ్రైవర్ అకస్మాత్తుగా కారు ఆపాడు.

డ్రైవర్ ఆగిపోవడంతో కారు వైపు ఏనుగు పరుగెత్తింది. దీంతో కారులోని ప్రయాణికులు షాక్‌కు గురై కారులో నుంచి దిగి సురక్షిత ప్రాంతానికి పారిపోయారు. అయితే కారు మాత్రం వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏనుగు కారు సమీపంలోకి వచ్చి కారును ఢీకొట్టింది. కారు డోర్లు, అద్దాలు తెరిచి ఉండటంతో ఏనుగు అందులోని వస్తువులను తీసుకుని రోడ్డుపై చెల్లాచెదురుగా పడేసింది.
కారు డ్రైవర్ సైడ్ డోర్ సరిగా మూయకపోవడంతో డోర్‌పై దాడి చేసి ధ్వంసం చేసింది. దీంతో ఏనుగు దాడిలో కారు భారీగా దెబ్బతింది. ఒకానొక సమయంలో, ఏనుగు ఈ కారును తోసుకెళ్తూ రోడ్డు పక్కకి తీసుకెళ్లింది. ఏనుగు కారుపై దాడి చేస్తుండగా.. అక్కడున్న ఇతర వాహనదారులు ఏనుగు దృష్టి మరల్చాలని కేకలు వేశారు. అయితే ఏనుగు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ కారును నెట్టేసింది.

సాధారణంగా ఈ రహదారిపై ఏనుగులు తరచూ వచ్చి వెళ్తుంటాయి. అయితే ఇప్పటివరకు ఏనుగులు ఏ వాహనంపైనా దాడి చేయకపోవడం ఇదే తొలిసారి కావడం ఆశ్చర్యం. ఈ దృశ్యాన్ని అక్కడున్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదృష్టవశాత్తూ కారులోని ప్రయాణికులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే కారుకు మాత్రమే ఎక్కువ నష్టం జరిగింది. ఘాట్ రోడ్లు, అటవీ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అటవీ ప్రాంతాల్లో కాకుండా జనావాసం ఉన్న ప్రాంతాల్లోనే మీ వాహనాలను పార్క్ చేయాలి.

ముఖ్యంగా రాత్రి సమయాల్లో అటవీ మరియు కొండ ప్రాంతాల్లో వాహనాల్లో ప్రయాణించకపోవడం ఉత్తమం. ఏనుగు ఇలా కారుకు అడ్డుగా వచ్చిన సందర్భాల్లో వెంటనే దిగి పోకుండా కారులోనే ఉండాలి. టెన్షన్ పడకుండా సమయస్ఫూర్తితో ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ఏనుగు మీ వైపు వచ్చే అవకాశం ఉంటే.. మొదట మీ కారు విండోలను పైకి లేపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏనుగు తన తొండంతో మిమ్మల్ని తాకకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.
తర్వాత కారును రివర్స్ గేర్‌లో ఉంచి మీరు కారును నెమ్మదిగా వెనుకకు నడపాలి. కారు రివర్స్ అవుతుంటే.. ఏనుగు కారును వెంబడించడం ఆపి తన మార్గాన్ని మళ్లిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో కంగారు పడకుండా, ప్రశాంతంగా పరిస్థితిని ఎదుర్కొంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








