రాంగ్ రూట్లో వచ్చి క్యాబ్‌ను ఢీకొట్టిన మహిళ.. ప్రశ్నించినందుకు మరో ఇద్దరు మహిళలపై దాడి.. వీడియో వైరల్
ఇటీవల రోడ్లపై వాహనదారులు, ప్రయాణికుల మధ్య గొడవలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎంతలా అంటే మాటా మాటా పెరిగి అవి కొట్లాటకు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలా గొడవ జరిగితే అలా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా రోడ్డుపై ముగ్గురు మహిళల మధ్య గొడవ వైరల్‌గా మారింది.
రోడ్లపై పురుషుల మధ్య గొడవ జరిగితే ఎవరికైనా అంత ఆసక్తిగా అనిపించదు. కానీ మహిళల మధ్య గొడవ జరిగితే మాత్రం అది విపరీతంగా వైరల్ అవుతోంది. ఇలాంటి మెట్రో పాలిటన్ నగరాల్లో పరిపాటిగా మారాయి. తాజాగా చండీగఢ్‌లో రోడ్డుపై జరిగిన గొడవకు సంబంధించి పూర్తి వివరాలను ఈ కథనంలో అందిస్తున్నాం.

ఇటీవల చండీగఢ్‌లో ఒక మహిళ ఓ కారులో మరో ఇద్దరు మహిళలు క్యాబ్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే ఆ కార్లు ఢీకొనడంతో మార్గమధ్యలోనే ఆ మహిళ క్యాబ్‌లోని ఇతర ఇద్దరు మహిళలతో గొడవకు దిగింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది.. తప్పెవరిది అనే కదా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం.
చండీగఢ్ సెక్టార్ 34లో ఓ మహిళ వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ నడుపుతోంది. అయితే ఆమె రోడ్డుకు రాంగ్ సైడ్‌లో ప్రయాణిస్తుంది. అయితే రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేయవద్దని ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే వాహనదారులకు సూచించారు. అయినప్పటికీ ఆమె రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఎదురుగా సరైన మార్గంలో వస్తున్న క్యాబ్‌ను ఢీకొట్టింది. అందులో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్నారు.

దీంతో ఆగ్రహానికి గురైన క్యాబ్‌లోని మహిళలు వోక్స్‌వ్యాగన్ పోలోలో ఉన్న మహిళతో వాగ్వాదానికి దిగారు. అయితే క్రమంగా మాటల యుద్ధం కాస్తా.. కొట్లాటకు దారితీసింది. పోలో నడుపుతున్న మహిళ క్యాబ్‌లోని ఇద్దరు మహిళా ప్రయాణికులపై దాడి చేసింది. అంతే కాకుండా తీవ్ర పదజాలాన్ని సైతం ఉపయోగించింది. ఈ ఘటన ఈ నెల 20 న జరిగింది.
అయితే మహిళ రాంగ్ రూట్లో రావడం కారణంగా తమ కారును ఢీకొట్టిందని.. ఘటనలో ఆమెదే తప్పని క్యాబ్ డ్రైవర్ వీడియోలో చెబుతున్నారు. అయితే పోలో నడుపుతున్న మహిళ మాత్రం విచక్షణ కోల్పోయి ఇద్దరు మహిళలపై శారీరకంగా దాడి చేసింది. ఇంకా కొట్టడమే కాకుండా వారిని తన్నడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే ఘటన జరిగిన అనతంరం ఆ మహిళ గొడవను రికార్డు చేస్తున్న డ్రైవర్ ఫోన్‌ను కింద పగలగొట్టింది. కాగా గొడవ జరుగుతుండగా అప్పటికే క్యాబ్ డ్రైవర్ పోలీసులను సంప్రదించాడు. గొడవకు సంబంధించి తాను మొత్తం ఫోన్‌లో రికార్డు చేశాడు. గొడవ తర్వాత మహిళ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే, పోలీసులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వీడియో చివర్లో, ముగ్గురు మహిళలు చండీగఢ్‌లోని సెక్టార్ 34లోని పోలీస్ స్టేషన్ వెలుపల నిలబడి ఉన్నారు. పోలో నడుపుతున్న మహిళ తన ప్రవర్తనకు క్షమాపణలు కోరుతున్నట్లు చూడవచ్చు. నివేదికల ప్రకారం, ఇరువర్గాలు ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత సమస్య పరిష్కారం అయింది. అయితే, రోడ్డు రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేసినందుకు పోలో నడిపిన మహిళపై పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది అస్పష్టంగా ఉంది.
మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నట్లయితే, పరిస్థితి దిగజారకుండా చూడండి. సహనంతో ఉంటూ వాగ్వాదానికి దూరంగా ఉండండి. పరిస్థితి చేయి దాటితే వెంటనే పోలీసులను సంప్రదించండి. కొట్లాటకు దూరంగా ఉండాలి. ఇంకా రోడ్డుపై ఇతర వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి ట్రాఫిక్ నిబంధనలు మరియు వేగ పరిమితులకు కట్టుబడి ఉండటం చాలా అవసరం.


Click it and Unblock the Notifications








