మళ్ళీ వెలుగులోకి వచ్చిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు.. ఇప్పుడు ఎక్కువ పొడవు & మరిన్ని సదుపాయాలు
సాధారణంగా మనం నిజ జీవితంలో ఎన్నో రకాల కార్లను చూసి ఉంటాము. ఇందులో చిన్న కార్ల దగ్గర నుంచి చాలా పెద్ద కార్లు మరియు కస్టమైజ్ చేయబడిన కార్లు వంటివి కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడైనా మీరు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారును చూసారా.. దీని పొడవు మొత్తం 100 అడుగులు. ఈ పొడవైన కారుని గురించి మరింత సమాచారం మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా 'ది అమెరికన్ డ్రీమ్' అనే సూపర్ లిమో కారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. దీని పొడవు 30.54 మీటర్లు అంటే 100 అడుగులు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బయటపడ్డాయి. మీరు కూడా ఇక్కడ చూడవచ్చు.

ఈ 'అమెరికన్ డ్రీమ్స్' కారు 1986 సంవత్సరంలో తయారు చేయబడింది. ఈ కారును తయారు చేసిన వ్యక్తి కాలిఫోర్నియాకు చెందిన 'జే ఓర్‌బర్గ్'. అప్పట్లో తయారు చేసిన ఈ కారు ఇప్పుడు వెలుగులోకి ఎందుకు వచ్చింది అనే అనుమానం మీకు రావచ్చు, ఎందుకంటే అప్పుడు తయారు చేసిన ఈ కారు మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మించబడింది. ఇప్పుడు మరో సారి ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా అవతరించింది.

అప్పట్లో ఈ కారు 60 అడుగుల పొడవు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది 100 అడుగుల పొడవుకు చేరుకుంది, దీనిని ఆ విధంగా పునర్నిర్మించబడింది. ఒక్క పొడవు మాత్రమే కాదు, ఇందులో అనేక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. ఇందులో స్విమ్మింగ్ పూల్, జాకుజీ, బాత్‌టబ్, గోల్ఫ్ కోర్స్ మరియు హెలిప్యాడ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఇందులో టీవీ, ఫ్రీజ్, టెలిఫోన్ సహా అన్ని ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ కారులో మొత్తం 75 మంది ఇందులో కూర్చోవచ్చు. ఇందులో నిర్మించబడిన హెలిప్యాడ్ 5 వేల పౌండ్ల బరువు మోసే సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఇందులో నిర్మించబడిన హెలిప్యాడ్ స్టీల్ బ్రాకెట్‌తో ఉంది, కావున ఇంత బరువును మోయగలదు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుకి 26 టైర్లు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా దీనికి ఇరువైపులా రెండు ఇంజన్లు ఉన్నాయి.

మొత్తం మీద ఇంత విలాసవంతమైన కారు చాలా రోజులుగా మూలన పడింది. దీనికి ప్రధాన కారణం ఈ కారుకి అధిక నిర్వహణ చాలా అవసరం. అది మాత్రమే కాకూండా ఈ పొడవైన కారుని ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేసే అవకాశం ఉండదు. ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఇది వినియోగించకుండా అలాగే ఉండిపోయింది. ఈ కారణంగా ఇది తుప్పు పట్టింది.

అయితే ఈ కారుకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి, మానింగ్ కారును పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగానే యితడు 'ఈబై' (eBay) నుంచి కొనుగోలు చేశారు. కానీ ఈ కారుని పునర్నిర్మించడానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఏకంగా మూడు సంవత్సరాల కాలం పట్టినట్లు తెలిసింది. మొత్తం మీద కస్టపడి ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు మళ్ళీ అందుబాటులోకి వచ్చేసింది.

భారతీయ మోటార్ వాహన చట్టం ప్రకారం, ఏదైనా వాహనాలను మోడిఫైడ్ చేయడం చట్ట విరుద్ధం. భారతదేశంలో తయారైన ఏ వాహనమైన తప్పకుండా మోటార్ వాహన చట్టం పరిధిలోనే ఉండాలి. ఆలా లేకుంటే అటువంటి వాహనాలు పూర్తగా సీజ్ చేయబడతాయి, లేదా సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకుంటారు. కావున భారతదేశంలో తప్పనిసరిగా వాహన వినియోగదారులు దీనిని గుర్తించాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది ఎలాంటి ఆదరణ పొందుతుంది, ప్రజలు దీనిని ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతారా, అనే మరిన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి. అప్పటివరకు ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకులకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మా అధికారిక డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.మీకు నచ్చిన కారు మరియు బైక్ గురించి సమాచారం పొందండి.


Click it and Unblock the Notifications








