ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ రోడ్.!! బెంగళూరులో ట్రాఫిక్‌కు చెక్!!
సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఇప్పుడు నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యగా మారింది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న బెంగళూరు మహా నగరం, ఐటీ హబ్‌గా మారడంతో అక్కడ జనాభా కిక్కిరిసిపోయింది. ఫలితంగా రద్దీగా ఉండే ట్రాఫిక్ జామ్‌లతో ఎల్లప్పుడూ మహానగరం బిజీగా ఉంటోంది.
బెంగళూరులో కి.మీ దూరం ప్రయాణించడానికి సైతం అరగంట సేపు ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడుతూ ప్రయాణించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు సైతం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం నగరానికి మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త చరిత్ర(Bengaluru Tunnel Road) సృష్టించేందుకు సిద్ధమైంది.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఓ బృహత్కార్యానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. నగరంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ(Tunnel) రహదారిని నిర్మించాలని యోచిస్తోంది. 99 కి.మీ పొడవైన సొరంగ(Tunnel) రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికా వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. బెంగళూరులో నిర్మించబోయే ఈ టన్నెల్ రహదారి మూడు ప్రధాన కారిడార్లను కలిగి ఉంటుంది.
మొదటిది ఉత్తర-దక్షిణ కారిడార్(North- South Corridor) సిల్క్ బోర్డు ద్వారా యలహంక, హెబ్బాల, మేఖ్రీ సర్కిల్, కంటోన్మెంట్, కస్తూర్బా రోడ్డు, హోసూర్ రోడ్లను కలుపుతుంది. రెండవది తూర్పు-పశ్చిమ కారిడార్ (East-West Corridor), రెండు లేన్ల రహదారిని కలిగి ఉంటుంది. ఒకటి వర్తుర్ కోడి నుంచి జ్ఞానభారతి వరకు, మరొకటి కేఆర్ పురం నుంచి పాత మద్రాసు రోడ్డు మీదుగా గోర్గుంటెపాళ్యం వరకు అనుసంధానం చేస్తారు.

అదనంగా, ఈ సొరంగ(Bengaluru Tunnel Road) రహదారి మూడు అనుసంధాన కారిడార్లను కలిగి ఉంటుంది. మొదటిది సెయింట్ జాన్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఆగ్రా రోడ్డు వరకు, రెండవది ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో రెండు వరుసల రహదారి, మూడవది వీలర్స్ రోడ్ జంక్షన్ నుంచి కళ్యాణ్‌నగర్ వరకు ఉంటుంది. ఫేజ్-1 కింద దాదాపు రూ.22,000 కోట్లతో తొలుత 50 కి.మీ పొడవున రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం యోచించినట్లు సమాచారం.
హెబ్బాళ్ నుంచి కేఆర్ పురం, కంటోన్మెంట్ నుంచి సిల్క్ బోర్డుతో అనుసంధానం చేసేందుకు టన్నెల్ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ యొక్క సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిపుణులు మరియు అధికారులు త్వరలో చేపట్టే అవకాశం ఉంది. అయితే, దీనికి సంబంధించి స్పష్టమైన, ఖచ్చితమైన వివరాలు అందుబాటులో లేవు.
బెంగుళూరు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఈ సొరంగం ప్రాజెక్టు దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కిలోమీటరు టన్నెల్ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.450 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రహదారికి టోల్ రుసుము వసూలు చేసే అవకాశం ఉంది.
అలాగే ఇటీవల ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్‌లో సీఎం సిద్ధరామయ్య బెంగళూరుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి, మెట్రో మరియు సబర్బన్ రైలు ప్రాజెక్టు పనులను నిర్వహించడానికి రూ. 30,000 కోట్లు కేటాయించారు. దీంతో పాటు వచ్చే 3 ఏళ్లలో మెట్రో నెట్‌వర్క్‌ను 176 కిలోమీటర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications








