ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్ కార్ల గ్యారేజీ చూస్తే షాక్ అవుతారు! అరుదైన మోడళ్లు, ఖరీదైన కార్లు
ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ తాజాగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించడం గ్లోబల్ బిజినెస్ వర్గాలను కదిలించింది. ఎల్లిసన్ సంపద సెన్సేషన్ సృష్టించేలా 101 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.8.8 లక్షల కోట్లు) పెరగడంతో ఆయన ఆస్తుల విలువ 393 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ గణాంకం టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ఆస్తులను దాటేసింది. ప్రస్తుతం మస్క్ వద్ద 385 బిలియన్ల ఆస్తులు ఉండగా, లారీ ఎల్లిసన్ అతనిని 8 బిలియన్ల తేడాతో అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు. 81 ఏళ్ల వయసులోనూ ఒరాకిల్ చైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ ఎల్లిసన్ చూపిస్తున్న వ్యాపార దూరదృష్టి నిజంగా విశేషమే. ఆయన సంపదలో ఎక్కువ భాగం డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ ద్వారానే వస్తోంది.
అయితే, ఈ బిజినెస్ దిగ్గజాన్ని ప్రత్యేకం చేసే విషయం ఆయనకు ఉన్న కారు పట్ల మక్కువ. ఆసక్తితో కార్లను సేకరించే లారీ ఎల్లిసన్ గ్యారేజీని ఒకసారి చూస్తే అది ఒక మ్యూజియం అనిపిస్తుంది. క్లాసిక్ సూపర్ కార్లు, ఆధునిక పనితీరు వాహనాలు, ఇంకా ప్రత్యేకంగా కస్టమ్‌గా తయారు చేయించుకున్న వాహనాలు ఆయన కలెక్షన్‌లో ఉన్నాయి. ఒక్కో కారు వెనుక ఆయన ప్యాషన్, డ్రైవింగ్ అనుభవం, ప్రత్యేకతపై ఉన్న అభిరుచి ప్రతిబింబిస్తుంది.

ఎల్లిసన్ కార్లను తరచూ మార్చుకోవడంలో వెనుకాడడు. పాతదాన్ని వదిలేసి కొత్త మోడల్‌ని తెచ్చుకోవడమే ఆయన స్టైల్. ఫెరారీ, లంబోర్ఘిని, పోర్షే వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్‌ల నుంచి బెంట్లీ కార్ల వరకు ఆయన సేకరణలో ఉన్నాయి. అదీగాక, సాధారణంగా అందుబాటులో లేని లిమిటెడ్ ఎడిషన్ సూపర్ కార్లు కూడా గ్యారేజీలో ఉండటం ప్రత్యేకం. ఈ కలెక్షన్ ఒక ధనవంతుడు తన అభిరుచిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలడో చూపించే ఉదాహరణగా నిలుస్తుంది.
వ్యాపారంలో మాత్రమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా లగ్జరీ, ప్యాషన్ కలిసిపోయేలా ఎల్లిసన్ సాగిస్తున్న జీవనశైలి ఆయనను మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఆయన గ్యారేజీ కూడా, ఒక ఆటోమొబైల్ ప్రేమికుడు కలలో చూసే కార్లను ఆయన గ్యారేజీలో చూడవచ్చు. వీఐపీఫార్ట్యున్ వెబ్‌సైట్ ప్రకారం, ఆయన దగ్గర ఉన్న కొన్ని కార్లను ఈ కథనంలో ఒకసారి తెలుసుకుందాం.

ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ గ్యారేజీ ఒక ఆటోమొబైల్ మ్యూజియంలా ఉంటుంది. ఆయన దగ్గర ఉన్న కార్లు అరుదైనవి, ఖరీదైనవి, ప్రపంచం మొత్తం కోరుకునే సూపర్‌కార్లు ఇలా ఉన్నాయి. లెక్సస్ LFA లారీకి చాలా ఇష్టమైన కారు. 2010-2012 మధ్య కేవలం 500 యూనిట్లు మాత్రమే తయారయ్యాయి. ధర సుమారు $375,000. ఇది 4.8-లీటర్ V10 ఇంజిన్‌తో వస్తుంది.
మెక్‌లారెన్ F1 కారు 1995 మోడల్ అరుదైన మోడల్. మెగ్నీషియం సిల్వర్ కలర్‌లో ఉన్న ఈ సూపర్‌కార్ ధర $815,000. 6.0-లీటర్ V12 ఇంజిన్‌తో నడుస్తుంది. అలాగే ఆయన గ్యారేజీలో ఆడి R8 ఉంది. ఇది 4.2-లీటర్ V8 ఇంజిన్‌తో వచ్చే ఈ కారు ధర $118,000. 417 bhp పవర్ ఇస్తుంది. కేవలం 4.4 సెకన్లలో 0-60 km/h వేగం అందుకుంటుంది. ఇది పెర్ఫామెన్స్ పరంగా అద్బుతంగా అనిపిస్తుంది.

లారీ ఎల్లిసన్ గ్యారేజీలో ఆయనకు బాగా నచ్చిన జపనీస్ స్పోర్ట్స్ కారు అకురా NSX ఉంది. దీని ధర $71,100. ఇది 3.0-లీటర్ V6 ఇంజిన్‌తో వస్తుంది. అలాగే, లెక్సస్ LS 600h L - సిల్వర్ కలర్‌లో ఉన్న ఈ లగ్జరీ హైబ్రిడ్ సెడాన్ ఆయన ఆఫీస్ రైడ్స్‌కి వాడేవారు. ధర $104,900. ఇది 5.0-లీటర్ V8 హైబ్రిడ్ ఇంజిన్ ఉంది.
ఇంకా, ఫెరారీ ఎంజో ఇటాలియన్ సూపర్‌కార్. ధర $660,000. 6.0-లీటర్ V12 ఇంజిన్‌తో వచ్చింది. ఇది ఆయన కొనుగోలు చేసిన రెండో ఫెరారీ. ఇవే కాకుండా, లారీ ఎల్లిసన్ దగ్గర అల్యూమినియంతో తయారైన షెల్బీ కోబ్రా, షెవ్రొలెట్ C8 కార్వెట్ స్టింగ్రే కన్వర్టిబుల్ వంటి మోడళ్లతో పాటు, ప్రైవేట్ జెట్‌లు, యాచ్‌లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








