ఐఫోన్ 14కి చెల్లించే డబ్బులతో మీరు ఈ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయవచ్చు!
టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ విక్రయించే ఐఫోన్స్ అంటే చాలా మందికి అదొక రకమైన క్రేజ్, ఇంకా చెప్పాలంటే, పిచ్చి అని కూడా అనొచ్చు. ఐఫోన్స్ కొనడానికి ఇలాంటి వారు ఎలాంటి విన్యాసాలు చేయడానికైనా సిద్ధంగానే ఉంటారు.
Recommended Video
ఫోన్లను కొనడానికి రాత్రంతా షోరూమ్ ముందే నిద్రపోయి, పొద్దున షోరూమ్ ఓపెన్ చేయగానే లైన్లో ముందుగా ఉండి ఫోన్ కొనడానికి కూడా వెనుకాడరు. చైనాలో ఒక వ్యక్తి అయితే, ఐఫోన్ కొనడానికి ఏకంగా తన కిడ్నీనే అమ్ముకున్నాడు. అలాంటిది మరి ఐఫోన్ అంటే ఉన్న క్రేజ్ (పిచ్చి).

యాపిల్ సంస్థ ఇటీవలే తమ 14వ తరం ఐఫోన్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. ఈసారి మునుపటి కన్నా మెరుగైన టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫీచర్లతో కంపెనీ ఈ కొత్త మోడల్‌ను తయారు చేసింది. అందుకే, ఈసారి ధరలు కూడా భారీగా పెరిగాయి. కొత్త ఐఫోన్ 14లో కంపెనీ నాలుగు మోడళ్లను (ఐఫోన్ 14, ప్లస్, ప్రో, ప్రో మ్యాక్స్) విడుదల చేసింది. ప్రతి మోడల్ కూడా వివిధ రకాల స్టోరేజ్ కెపాసిటీతో లభిస్తుంది. ఇందులో అత్యంత చవకైనది ఐఫోన్ 14 (128జీబీ), దీని ధర రూ.79,900 గా ఉంది. అత్యంత ఖరీదైనది ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (1టీబీ) మరియు దీని ధర రూ.1,89,900 గా ఉంది.

అంటే, టాప్-ఎండ్ ఐఫోన్ 14 ను కొనుగోలు చేయాలంటే కస్టమర్లు దాదాపు రెండు లక్షల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటోంది. కానీ, ఇదే ధరకు మీరు భారతదేశంలో ఓ గొప్ప సెకండ్ హ్యాండ్ కారును కొనుక్కోవచ్చు. విలాసాలకు పోయి చేతులు కాల్చుకునే బదులు, సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకోవడం మంచిదనేది చాలా మంది అభిప్రాయం. మరి ఈ ధర వద్ద భారత మార్కెట్లో అందుబాటులో ఉండే ఆ టాప్ 5 సెకండ్ హ్యాండ్ కార్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

మారుతి సుజుకి ఆల్టో
మొదటిసారిగా కారు కొనే వారికి మారుతి సుజుకి ఆల్టో ఎల్లప్పుడూ ఒక గొప్ప కారుగా ఉంటుంది. మారుతి ఆల్టో తక్కువ మెయింటినెన్స్ ఖర్చు, ఎక్కువ ఇంధన సామర్థ్యం, సరసమైన ధరను కలిగి ఉండి, ఓ మంచి ఫ్యామిలీ కారుగా ఉంటుంది. భారతదేశంలో మారుతి ఆల్టో కారును సెకండ్ హ్యాండ్ మార్కెట్లో సుమారు రూ. 1.5 లక్షల నుండి రూ. 1.8 లక్షల బడ్జెట్‌తో కొనుగోలు చేయవచ్చు.

మారుతి 800 కారుకి రీప్లేస్‌మెంట్ గా వచ్చిన ఈ బడ్జెట్ కారు మారుతి సుజుకి ఆల్టో 800లో కంపెనీ 796 సీసీ, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించింది. ఈ ఇంజన్ 47 బిహెచ్‌పి పవర్ ను మరియు 69 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసి, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెనో క్విడ్
రెనో క్విడ్ ఈ విభాగంలోనే అత్యంత స్టైలిష్ గా కనిపించే యూరోపియన్ హ్యాచ్‌బ్యాక్. ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, భారతదేశంలో స్థిరపడేలా చేసిన మోడల్ ఇది. చిన్న-సైజు ఎస్‌యూవీ మాదిరిగా, మజిక్యులర్ లుక్‌తో కనిపించే ఈ చిన్న కారును నేరుగా షోరూమ్ నుండి కొనుగోలు చేయాలంటే సుమారు ఐదు లక్షలకలకు పైగా ఖర్చు అవుతుంది. అయితే, దీనిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో సుమారు రూ. 1.8 లక్షల నుండి రూ. 2 లక్షల మధ్యలో కొనుగోలు చేయవచ్చు.

రెనో క్విడ్ కస్టమర్ల ఎంపికకు అనుగుణంగా రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 800సీసీ, రెండవది 1000సీసీ. ఎంట్రీ లెవల్ మోడళ్లలోని 0.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ 53.26 బిహెచ్‌పి పవర్ ను మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ప్రీమియం వేరియంట్లలోని 1.0-లీటర్ ఇంజన్ 67.06 బిహెచ్‌పి పవర్ ను మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ10 (పాత మోడల్)
హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ నియోస్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత పాత తరం ఐ10 మోడళ్లు మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్నాయి. అంతేకాదు, ఈ ధర వద్ద మీరు కొనుగోలు చేయగల అత్యంత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో హ్యుందాయ్ ఐ10 ఒకటి. అందమైన లుక్ మరియు అధ్భుతమైన ఫీచర్లతో ఈ కారు లభిస్తుంది. సెకండ్ హ్యండ్ మార్కెట్లో హ్యుందాయ్ ఐ10 కారుని రూ. 1.3 లక్షలు లేదా ఆపై చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

పాత తరం హ్యుందాయ్ ఐ10 మోడల్‌ను కంపెనీ రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో విక్రయించేది. ఇందులో 1.1-లీటర్ మరియు 1.2-లీటర్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇందులో 1.2 లీటర్ కప్పా సిరీస్ ఇంజన్ చాలా శక్తివంతమైనది మరియు ఇది పాత ఐ20 కారులో కూడా ఉపయోగించబడింది. ఒకవేళ మీ బడ్జెట్ మిమ్మల్ని అనుమతించినట్లయితే 1.2-లీటర్ వేరియంట్‌ని కొనుగోలు చేయమని మేము సిఫార్సు చేస్తాము.

హ్యుందాయ్ శాంత్రో
మారుతి 800 మరియు మారుతి ఆల్టో కార్లకు పోటీగా హ్యుందాయ్ తీసుకువచ్చిన ఎంట్రీ లెవల్ కారు శాంత్రో. ఇది భారతదేశంలో హ్యుందాయ్ విజయానికి పునాదులు వేసిన అత్యంత ముఖ్యమైన మోడళ్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం, మార్కెట్లో కొత్త తరం శాంత్రో పాటుగా రెండవ తరం హ్యుందాయ్ శాంత్రో (శాంత్రో జింగ్) ను కూడా సులభంగా కనుగొనవచ్చు. ఈ కార్లను సుమారు రూ. 1 లక్ష ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. శాంత్రో జింగ్ మోడల్ 62 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 1.1-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10
మారుతి సుజుకి ఇటీవలే తమ కొత్త తరం ఆల్టో కె10ను మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఇప్పటికీ పాత తరం ఆల్టో కె10 మోడల్ అంటే ఇష్టపడే వారు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది చూడటానికి పెద్ద కారు మాదిరిగా కనిపిస్తుంది. పేరుకి తగినట్లుగానే ఆల్టో కె10 శక్తివంతమైన ఇంజన్‌తో లభిస్తుంది. అయితే, ఇలాంటి కార్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయించబడటం చాలా అరుదు. ఒకవేళ మీకు దొరికితే మాత్రం మిస్ చేసుకోకండి.

సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఆల్టో కె10 కారుని సుమారు రూ. 1.75 లక్షల వరకూ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి ఆల్టో 800 మాదిరిగా కాకుండా, పాత మోడల్ ఆల్టో కె10 పెద్ద 1.0-లీటర్, కె10 సిరీస్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 67 బిహెచ్‌పి పవర్ ను మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ కేవలం 13.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.


Click it and Unblock the Notifications








