వందేభారత్ రైళ్లలో ఎక్కువగా ప్రయాణించేది వారేనట.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రైల్వే శాఖ
దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రజాదరణ పెరుగుతోంది. విడతల వారీగా ప్రధాన నగరాలను కలుపుతూ ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు సేవలందిస్తున్నాయి. కాగా వందేభారత్ రైళ్లలో యువత ఎక్కువగా ప్రయాణిస్తున్నట్లు వెల్లడైంది.
అత్యాధునిక సౌకర్యాలతో వందేభారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. కాగా దక్షిణ మధ్య రైల్వే (SCR) డివిజన్ పరిధిలో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 29 శాతం మంది యువకులు ప్రయాణిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వారంతా 25 నుండి 34 సంవత్సరాల వయస్సు గల వారిని పేర్కొన్నారు.

SCR చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిహెచ్.రాకేష్.. ఇప్పటివరకు మొత్తంగా 56 శాతం మంది యువత, కార్మికవర్గ ప్రజలు ఈ రైళ్లలో ప్రయాణించినట్లు పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందించేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రూపొందించడంతో.. రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని ఆయన వెల్లడించారు.
కాగా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్, కాచిగూడ - యశ్వంతపూర్, విజయవాడ - చెన్నై సెంట్రల్ ఈ రైళ్లు సెంట్రల్ మార్గంలో ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. త్వరలో మరికొన్ని రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుంత దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 100 శాతం ప్రయాణీకుల సామర్థ్యంతో నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఇప్పటివరకు 7.16 లక్షల మంది ప్రయాణించినట్లు సమాచారం. 35 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 27 శాతం మంది ప్రయాణించగా.. సీనియర్ సిటిజన్లలో 12 శాతం మంది ప్రయాణించినట్లు గణాంకాల్లో వెల్లడైంది.
ప్రీమియం సెమీ హై-స్పీడ్ రైళ్లుగా కేంద్రం ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చాలా అధునాతన సౌకర్యాలు ఉన్నాయనే చెప్పవచ్చు. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల కోచ్‌లలో సౌకర్యవంతమైన సీటింగ్‌తో పాటు వైఫై సౌకర్యం ఉంది. ఇంకా ఆటోమేటిక్ డోర్లు, ఫైర్ ప్రొటెక్షన్ డివైజ్‌లు, ఏసీ ఫెసిలిటీని ప్రవేశపెట్టింది.
కాగా ప్రస్తుతం వందే భారత్ రైళ్లు పగటి పూట మాత్రమే నడుస్తున్నాయి. అయితే రాత్రిపూట ప్రయాణించేందుకు వీలుగా ప్రస్తుతం రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను సైతం అభివృద్ధి చేస్తోంది. ఈ రైళ్లు ఫిబ్రవరి 2024 నాటికి పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లలో 857 బెర్త్‌లు ఉన్నాయి. ఇందులో 823 బెర్త్‌లు ప్రయాణికుల కోసం, మిగిలిన 34 బెర్త్‌లు సిబ్బంది కోసం రిజర్వు చేయనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది మార్చి నాటికి 75 కొత్త రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. జమ్మూ-కశ్మీర్‌తో సహా దేశవ్యాప్తంగా అనేక మార్గాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే సమీపంలోని నగరాలకు వెళ్లేందుకు వందే మెట్రోను రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








