ఆ కారులో రోడ్డుపైకి వచ్చినందుకు రూ. 30,500 జరిమానా.. ఖంగుతిన్న యూట్యూబర్.!!
దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. పొల్యూషన్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం సైతం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను నడపవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా కూడా తప్పదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఢిల్లీ NCR ప్రాంతంలో BS4 డీజిల్ కార్లు, BS3 పెట్రోల్ కార్లపై ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేసింది. అయితే ఈ నిషేధం గురించి చాలా మంది తెలియకపోవడంతో ఈ వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు తమ డ్యూటీలో భాగంగా బీఎస్3, బీఎస్4 వాహనాలను ఆపి జరిమానాలు విధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో బీఎస్4 డీజిల్(BS4 Diesel Toyota Fortuner) టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని నడుపుతున్న యూట్యూబర్‌కు పోలీసులు భారీగా జరిమానా విధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్ష్ అహ్లావత్ అనే వ్యక్తి ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ షేర్ చేశారు. అందులో సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని వివరించాడు.
ఈ నెల ప్రారంభంలో తన సోదరుడు అమెరికా నుంచి వస్తుండటంతో అతడిని పికప్ చేసుకునేందుకు తన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నట్లు వ్లాగర్ పేర్కొన్నాడు. అయితే ఆ క్రమంలో పోలీసులు రెండు సార్లు తన కారును ఆపినా ఎలాంటి పత్రాలు అడగలేదని చెప్పారు. కానీ ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత తన టయోటా ఫార్చ్యూనర్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపినట్లు వివరించారు.

కాగా ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో బీఎస్4 డీజిల్ వాహనాలకు నిషేధం విధించినట్లు తనకు తెలియదని వ్లాగర్ పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో వారు అడిగినట్లుగా కారుకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లు ఇచ్చినట్లు చెప్పారు. సర్టిఫికెట్లు తనిఖీ చేసిన పోలీసులు.. టయోటా ఫార్చ్యూనర్ కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్(PUC) ముగిసిందని చెప్పారు.
బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లకు ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో నిషేధం విధించినట్లు చెప్పడంతో.. ఖంగు తినడం వ్లాగర్ వంతైంది. అయితే ఈ విషయం తనకు తెలియదని.. కొద్ది రోజుల క్రితమే PUC గడువు ముగిసిందని పోలీసులకు చెప్పాడు.

ఢిల్లీ NCR ప్రాంతంలో గడువు ముగిసిన పొల్యూషన్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలను వినియోగించడం నిషేధించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ. 10,000 జరిమానా విధిస్తారు. వ్లాగర్ నడుపుతున్న BS4 టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని.. ప్రస్తుతం ఢిల్లీ NCR ప్రాంతంలో నిషేధించడంతో జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలో తన పరిస్థితిపై పోలీసులకు వ్లాగర్ వివరించాడు. పోలీసులు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారని, ఈసారి విడిచిపెడుతున్నట్లు చెప్పి.. రశీదుపై సంతకం చేయాల్సి ఉందని చెప్పినట్లు యూట్యూబర్ పేర్కొన్నారు. అయితే అప్పుడు రాత్రి సమయం కాకపోవడంతో ఆ రసీదులో ఏమి ఉందో చూడలేకపోయానని వ్లాగర్ తెలిపారు.
దీంతో హడావుడిగా సంతకం చేసి రసీదు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు మరెక్కడైనా ఆపితే ఈ రసీదు చూపించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు తనతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారని సంతోషించి కొద్ది దూరం డ్రైవింగ్ చేశాక రసీదులో ఏముందో చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
BS4 ఫార్చ్యూనర్ డీజిల్ 4×2 SUVని రోడ్డుపై నడిపినందుకు అతడికి పోలీసులు రూ.30,500 జరిమానా విధించారు. పీయూసీ గడువు ముగియడంతో రూ.10,000, బీఎస్4 డీజిల్ వాహనం నిషేధాన్ని ఉల్లంఘించినందుకు రూ.20,000 ఫైన్ వేశారు. ఇంకా సంబంధిత పత్రాలను సమర్పించనందుకు పోలీసులు రూ.500 జరిమానా విధించారు. దీంతో షాక్‌కు గురైనట్లు వ్లాగర్ వాపోయారు.


Click it and Unblock the Notifications








