కార్ల ఇన్సూరెన్స్‌లో డెప్రిసియేషన్ అంటే ఏంటో తెలుసా? తెలుసుకోకపోతే లక్షలు నష్టపోవాల్సిందే
ప్రస్తుత కాలంలో కారు కొనేవారు కేవలం మోడల్, ఫీచర్స్ గురించే కాదు, సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడంపైనా దృష్టి పెడుతున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు చాలామంది జీరో డెప్రిసియేషన్ లేదా నార్మల్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మధ్య తేడా తెలియక సతమతమవుతుంటారు. కొన్నిసార్లు ఏజెంట్లు కూడా ఈ రెండింటి మధ్య తేడాను సరిగ్గా వివరించరు. అసలు ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి, ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
జీరో డెప్రిసియేషన్ కవర్ అంటే ఏమిటి?
జీరో డెప్రిసియేషన్ కవర్ అనేది ఒక యాడ్-ఆన్ పాలసీ. అంటే ఇది సాధారణ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీతో అదనంగా తీసుకోవాలి. ఈ పాలసీ కారు దెబ్బతిన్నప్పుడు, దాని ప్లాస్టిక్, రబ్బరు, మెటల్ లేదా ఫైబర్ పార్టుల విలువ తగ్గకుండా, వాటికి సంబంధించిన మొత్తం రిపేర్ ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది.

అందుకే ఈ కవర్ కొత్త కార్లకు, ఖరీదైన కార్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ప్రీమియం నార్మల్ ఇన్సూరెన్స్ కంటే ఎక్కువ ఉన్నప్పటికీ, ప్రమాదం జరిగినప్పుడు పెద్ద మొత్తంలో ఖర్చు కాకుండా ఆదా చేస్తుంది.
ఉదాహరణకు, నార్మల్ ఇన్సూరెన్స్ లో ఒక బంపర్ రిపేర్‌కు రూ.10,000 ఖర్చయితే, కారు పాతబడితే దాని విలువ తగ్గిందని కంపెనీ రూ.7,000 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన రూ.3,000 మీరు భరించాలి. అదే జీరో డెప్రిసియేషన్ కవర్ ఉంటే కారు పాతబడినా, కొత్త పార్టుల పూర్తి ఖర్చు రూ.10,000 కంపెనీయే చెల్లిస్తుంది. అందుకే దీనికి బంపర్-టు-బంపర్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. కొత్త కార్లకు, ఖరీదైన లగ్జరీ కార్లకు ఇది చాలా లాభదాయకం.

నార్మల్ ఇన్సూరెన్స్ vs జీరో డెప్రిసియేషన్.. తేడాలు
ప్రీమియం: జీరో డెప్రిసియేషన్ కవర్‌తో కూడిన పాలసీ ప్రీమియం సాధారణ పాలసీ కంటే 15-20% ఎక్కువగా ఉంటుంది.
క్లెయిమ్ సెటిల్‌మెంట్: నార్మల్ పాలసీలో క్లెయిమ్ చేసినప్పుడు కారు పార్టుల పాతబడిన విలువ లెక్కించి, మిగిలిన డబ్బు మాత్రమే ఇస్తారు. జీరో డెప్రిసియేషన్ పాలసీలో డెప్రిసియేషన్ తీసివేయకుండా పార్టుల పూర్తి విలువను చెల్లిస్తారు.
కారు వయస్సు: జీరో డెప్రిసియేషన్ కవర్ సాధారణంగా కొత్త కార్లకు (5 సంవత్సరాల వరకు) మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొన్ని కంపెనీలు గరిష్టంగా 7 సంవత్సరాల వరకు కూడా అందిస్తాయి. ఆ తర్వాత సాధారణ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుంది.
క్లెయిమ్‌ల లిమిట్ : జీరో డెప్రిసియేషన్ పాలసీలో ఏడాదికి గరిష్టంగా ఒకటి లేదా రెండు క్లెయిమ్‌లకు మాత్రమే లిమిట్ ఉండవచ్చు. కానీ నార్మల్ ఇన్సూరెన్స్‌లో అలాంటి పరిమితి ఉండదు.

వివిధ పార్టుల డెప్రిసియేషన్ ఇలా ఉంటుంది:
రబ్బర్, ప్లాస్టిక్ పార్టులు (టైర్లు, బ్యాటరీలు): సాధారణంగా 50% డెప్రిసియేషన్
ఫైబర్‌గ్లాస్ పార్టులు: 30% డెప్రిసియేషన్
మెటల్ పార్టులు: 5 నుండి 50% వరకు (కారు వయస్సును బట్టి)
ఎవరికి ఏది సరైనది?
జీరో డెప్రిసియేషన్ కవర్ ఎవరికి ఉపయోగపడుతుంది?
కొత్త కార్ల యజమానులు: కొత్త కారుకు ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా భారీగా ఖర్చు పెట్టాల్సి రాకుండా ఈ పాలసీ రక్షిస్తుంది.
లగ్జరీ కార్ల యజమానులు: లగ్జరీ కార్ల విడిభాగాలు చాలా ఖరీదైనవి కాబట్టి, జీరో డెప్రిసియేషన్ కవర్ తప్పనిసరి. ఇది జేబు నుంచి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఆదా చేస్తుంది.
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు: ఇంకా డ్రైవింగ్ అనుభవం లేనివారు తరచుగా చిన్న చిన్న ప్రమాదాలు చేస్తుంటారు. అలాంటివారికి ఇది చాలా ప్రయోజనకరం.
ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో డ్రైవ్ చేసేవారు: నగరాల్లో ఎక్కువగా తిరిగేవారికి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువ. అలాంటివారికి ఇది ఆర్థిక భద్రతను ఇస్తుంది.
సాధారణ ఇన్సూరెన్స్ ఎవరికి సరిపోతుంది?
పాత కార్ల యజమానులు: కారు వయస్సు ఐదేళ్లకు మించిన తర్వాత జీరో డెప్రిసియేషన్ కవర్ లభించదు. అలాంటి వారికి సాధారణ ఇన్సూరెన్స్ సరిపోతుంది.
తక్కువ బడ్జెట్ ఉన్నవారు: తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్
ఎక్సపీరియన్స్ ఉన్న డ్రైవర్లు: సాధారణంగా ప్రమాదాలకు గురికాని వారికి నార్మల్ ఇన్సూరెన్స్ సరిపోతుంది.
జీరో డెప్రిసియేషన్ పాలసీలో ప్రీమియం కాస్త ఎక్కువైనా, క్లెయిమ్ చేసే సమయంలో జేబు నుంచి పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అదే నార్మల్ ఇన్సురెన్స్ పాలసీలో ప్రీమియం తక్కువగా ఉన్నా, డ్యామేజ్ అయినప్పుడు వెహికల్ పార్టు డెప్రిసియేషన్ భారాన్ని మీరే భరించాల్సి వస్తుంది. కాబట్టి మీ కారు వయసు, బడ్జెట్, డ్రైవింగ్ ఎక్సపీరియన్స్ బట్టి సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications








