రూపాయి ఎఫెక్ట్: మరింత ప్రియం కానున్న ఎలక్ట్రిక్ బైక్స్

మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సరైన మౌళిక సదుపాయాలు లేకపోవడంతో వీటిని కొన్ని ప్రత్యేకించిన ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సంఘం ప్రకారం (ఎస్ఎమ్ఈవీ), కరెన్సీ ఒడిదుడుకుల నెపంతో గడచిన అక్టోబర్ నెల నుంచి దాదాపు 5-6 కంపెనీలు 3-4 శాతం మేర ధరలను పెంచాయి.
ప్రస్తుతం మన దేశీయ మార్కెట్లో వివిధ మోడళ్లను బట్టి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు రూ.26,000 నుండి రూ.40,000 మధ్యన ఉన్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా గడచిన అక్టోబర్ నుండి వీటి అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయని ప్రస్తుతం ఈ మార్కెట్ 40 శాతం వృద్ధితో ఎదుగుతోందని ఎస్ఎమ్ఈవీ డైరెక్టర్ సోహిందర్ గిల్ తెలిపారు.
అక్టోబర్ నెల వరకూ అమ్మకాల వృద్ధి 50-60 శాతంగా ఉన్నదని, పెరుగుతున్న శిలాజ ఇంధనాల ధరల కారణంగా కొనుగోలుదారులు, ప్రకృతి సాన్నిహిత్య వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వృద్ధి 50-55 శాతం మేర ఉండొచ్చని, ఈ మార్కెట్ ఊపందుకోవచ్చని అంచనా వేస్తన్నామని గిల్ చెప్పారు.
గడచిన ఆర్థిక సంవత్సరం (2010-11)లో విక్రయించిన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల సంఖ్యను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2011-12)లో ఇప్పటికే అధిగమించామని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలు, మోటార్లు వంటి వాటిని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న కారణంగా, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వీటిపై అధిక దిగుమతి సుంఖాన్ని చెల్లించాల్సి వస్తుందని, ఫలితంగా వీటి తయారీ వ్యయం పెరిగి ఉత్పత్తులు ధరలు కూడా మరింత ప్రియం అయ్యే అవకాశం ఉందని గిల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








