సెప్టెంబర్‌లో 250సీసీ పల్సర్‌ను విడుదల చేయనున్న బజాజ్

బజాజ్ ఆటో ఓ ఆఫ్-రోడ్ స్పోర్ట్స్ బైక్ "బజాజ్ కెటిఎమ్ డ్యూక్"ను ప్రవేశపెట్టేందుకు యూరోపియన్ సంస్థ కెటిఎమ్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా... గతంలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఒకానొక సందర్భంలో సెప్టెంబర్ నెలలో అప్‌గ్రేడెడ్ పల్సర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కెటిమ్ నుంచి 200 సీసీ ఇంజన్‌ను దిగుమతి చేసుకొని ఓ కొత్త పల్సర్‌ను కానీ లేదా 250 సీసీ పల్సర్‌ను కానీ బజాజ్ ఆటో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అయితే, పల్సర్ బ్రాండ్‌లో బజాజ్ ఆటో గతంలో ఓ 200 సీసీ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. కానీ, అది మార్కెట్లో పెద్దగా నిలబడకపోవడంతో ఆ వేరియంట్ ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. దీంతో కొత్తగా రాబోయే పల్సర్ దాదాపుగా 250 సీసీ ఇంజన్ ఆప్షన్‌తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాగా.. బజాజ్ ఆటో ప్రస్తుతం జపాన్ కంపెనీ కవాసకి సంస్థతో చేతులు కలిపి "కవాసకి నిన్జా 250ఆర్" అనే స్పోర్ట్స్ బైక్‌ను అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే విభాగంలో ఇప్పటికే జపాన్ దిచక్ర వాహన దిగ్గజం హోండా అందిస్తున్న "హోండా సిబిఆర్ 250ఆర్"కు మరియు దేశీయ ఆటో ద్విచక్ర వాహన దిగ్గజం హీరో హోండా అందిస్తున్న కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌కు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం. అసలే పల్సర్ బ్రాండ్‌కు భారత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనికి తోడు ఇది 250 సీసీ ఇంజన్‌తో మరింత పవర్‌ఫుల్ సామర్థ్యంతో లభిస్తుంటే యువత వేరే బ్రాండ్ జోలికి వెళ్తారా..!?


Click it and Unblock the Notifications








