టూరింగ్ బైక్‌లకు పేరొందిన హార్లే డేవిడ్‌సన్ కంపెనీ స్ట్రీట్‌బైక్‌లు 'సూపర్ లో', 'ఐరన్' మోడళ్లను విడుదల చేసింది. హార్లే డేవిడ్‌సన్ ఇండియా ఆధ్వర్యంలో హర్యానాలో నిర్మించిన అసెంబ్లింగ్ యూనిట్‌లో ఈ ప్రారంభ మోడళ్లను తయారు చేస్తున్నారు. 883 సీసీ ఇంజిన్, 5 గేర్‌లతో రూపొందించిన ఈ బైక్‌లు నగర వీధుల్లో తీవ్ర రద్దీలోనూ సౌకర్యవంతంగా నడిపేందుకు అనువుగా ఉంటాయని బంజారా హార్లే డేవిడ్‌సన్ షోరూం అధిపతి కె.జైరామ్ ఆదివారమిక్కడ తెలిపారు. పూర్తిగా అమెరికాలో తయారై, దిగుమతి చేసుకునే వాహనాలతో పోలిస్తే, విడిభాగాలను దిగుమతి చేసుకుని భారత దేశంలో అసెంబ్లింగ్ చేసే వాహనాల ధరలు తక్కువగా ఉంటాయని, దిగుమతి సుంకాలు 60% వరకు తగ్గడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు.
హార్లే డేవిడ్‌సన్ బైక్‌లు రూ.8 - 35 లక్షల శ్రేణిలో లభిస్తుండగా, భారత్‌లో తయారు చేసిన సూపర్ లో రకం బైక్ ధర రూ.5.6 లక్షలు, ఐరన్ రూ.6.6 లక్షలు (ఎక్స్- షోరూం, హైదరాబాద్)గా ఉన్నాయి. కంపెనీ నుంచి రెండేళ్ల అపరిమిత వారెంటీ ఉన్నట్లు జైరామ్ తెలిపారు. ప్రీమియం బైక్‌లు కనుక వీటి కొనుగోలుకు 11-13% తక్కువ వడ్డీపై ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు రుణం అందిస్తున్నాయని ఆయన చెప్పారు.