మోటార్‌సైకిళ్ల ధరలను పెంచం: హ్యార్లీ-డేవిడ్‌సన్

హ్యార్లీ-డేవిడ్‌సన్ కంపెనీ కూడా తమ మోటార్‌సైకిళ్ల విడిభాగాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తుంది. కానీ ఇటీవల వెల్లడించిన కేంద్ర బడ్జెట్ 2011లో సికెడి విడిభాగాలపై కేంద్ర ప్రభుత్వ సవరణల కారణంగా ఇంజన్, ట్రాన్సిమిషన్, ఛాస్సిస్, గేర్ బాక్స్ వంటి పలు ఉపకరణాలను సికెడి విభాగం నుంచి తప్పించింది. దీంతో ఈ విడిభాగాల దిగుమతులపై అదనపు సుంకం పడుతుంది. ఫలితంగా కంపెనీ ఉత్పాదక వ్యయం పెరిగి ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇటువంటి పరిస్థితుల్లో కూడా పాత ధరలను యథాతథంగా కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ధరల విషయంలో వినియోగదారులకు ఇచ్చిన మాటకు కంపెనీ కట్టుబడి ఉంటుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మూడు నెలల క్రితం హర్యానాలోని అసెంబ్లింగ్ ప్లాంటులో హ్యార్లీ-డేవిడ్‌సన్ 'సూపర్ లో', 'ఐరన్ 883' అనే రెండు సికెడి యూనిట్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఆ సమయంలో కంపెనీ వీటి ధరలను రూ. 5.5 లక్షలు (సూపర్ లో), రూ. 6.50 లక్షలు (ఐరన్ 883)గా నిర్ణయించింది.
ప్రస్తుతం హ్యార్లీ-డేవిడ్‌సన్ ఐదు డీలర్ల ద్వారా దేశవ్యాపంగా 12 మోడళ్లను (సూపర్ లో, ఐరన్ 883లు కాకుండా) అందిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ. 7.50 లక్షల నుంచి రూ. 34.95 లక్షల మధ్య ఉన్నాయి. భారత్ మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపారంపై తాము దృష్టి సారించామని, ఓ తుది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications








