పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం, ఇంధన ధరల దృష్ట్యా వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు ఈ విభాగంపై కన్నేశాయి. దేశంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేస్తున్న "హీరో ఎలక్ట్రిక్" కంపెనీ తమ ఈ-మోటార్‌సైకిళ్లను యూరప్‌కు ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది. యూరప్ మార్కెట్లలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు మంచి డిమాండ్ ఉండటంతో తమ ఉత్పత్తులను ఆ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నామని, ఈ నెలాఖరులోగా స్విట్జర్లాండ్‌లో కూడా తమ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు దర్శనమివ్వనున్నాయని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ తెలిపారు.
హీరో ఎలక్ట్రిక్ యూరప్ కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను రూపొందిస్తుంది. ఇందుకుగానూ కంపెనీ స్థానిక మరియు, తైవానీయుల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుంటున్నట్లు ఆయన వివరించారు. యూరప్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ వాహనాలు భారత మార్కెట్లో విక్రయించబడవని ఆయన స్పష్టం చేశారు. యూరప్‌లో స్థానిక మార్కెట్ల డిమాండ్‌కు అనుగుణంగా.. ప్రతి షిఫ్టుకు 200-250 యూనిట్లును కంపెనీ ఉత్పత్తి చేయనుంది.