భారత్‌లో మూడో టూవీలర్ ప్లాంటు ఏర్పాటుపై హోండా కన్ను!!

హీరో హోండా జాయింట్ వెంచర్ నుంచి హోండా మోటార్ కంపెనీ మరికొద్ది రోజుల్లో పూర్తిగా విడిపోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ద్విచక్రవాహన విభాగంలో పోటీని ఎదుర్కోవాలంటే.. డిమాండుకు తగిన సరఫరాతో పాటు మరికొన్ని కొత్త మోడళ్లను హోండా అందిచాల్సి ఉంటుంది. ఇందులో భాగంగాగనే 100సీసీ విభాగంలో ఓ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టేందుకు కూడా హోండా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ప్రపంచంలో తమదని నంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ అని, భారత్‌లో కూడా నంబర్ వన్‌గా ఎదగాలని భావిస్తున్నట్లు హెచ్ఎమ్ఎస్ఐ అధ్యక్షుడు, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షింజీ అవోయమ వెల్లడించారు.
ప్రస్తుతం భారత్‌లో హోండా మోటార్‌సైకిళ్లకు మంచి డిమాండ్ ఉందని, కానీ సప్లయ్ కొరత కారణంగా సదరు డిమాండును తమ డీలర్లు క్యాష్ చేసుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు. ఇందుకోసం తమ రెండవ ప్లాంటులో ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభిస్తామని, అలాగే మూడో ప్లాంటు ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. అయితే మూడో ప్లాంటును దేశంలో ఎక్కడ స్థాపించాలనే అంశాన్ని కంపెనీ ఇంకా ఖరారు చేయలేదు. కాగా.. గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోండా మూడో ప్లాంటును స్థాపించవచ్చని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజస్థాన్‌లోని తపుకరా ప్రాంతంలో హోండా తమ రెండవ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కానీ లేదా నవంబర్ నెలలో కానీ ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








