మే 2011 ద్విచక్ర వాహన విక్రయాలు: కంపెనీల వారిగా డిటేల్స్

ప్రపంచపు నెంబర్ వన్ టూ-వీలర్ కంపెనీ అయిన హీరో హోండా మే 2011 నెల విక్రయాలలో 14.75 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఈ నెలలో కంపెనీ మొత్తం 5,00,234 యూనిట్లను విక్రయించి మరోసారి ఐదుల లక్షల నెలవారీ విక్రయాలను అధిగమించి ఎప్పటిలాగే ద్విచక్ర వాహన మార్కెట్లో నెంబర్ వన్‌గా నిలిచింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 4,35,933 యూనిట్లుగా ఉన్నాయి.
బజాజ్ ఆటో లిమిటెడ్:
ఇకపోతే దేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ (బిఏఎల్) మే 2011 విక్రయాలలో 18 శాతం వృద్ధి నమోదు చేసుకొని మొత్తం 3,17,989 యూనిట్ల విక్రయాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 2,69,488 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే కంపెనీ ఎగుమతులు 32.15 శాతం వృద్ధితో 95,964 యూనిట్ల నుంచి 1,26,818 యూనిట్లకు పెరిగాయి.
టీవీఎస్ మోటార్ కంపెనీ:
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో మూడో స్థానంలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ మే 2011 నెల మొత్తం విక్రయాలు 18.44% వృద్ధితో 1,85,930 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు ఇదే సమయానికి టీవీఎస్ విక్రయాలు 1,56,980 యూనిట్లుగా ఉన్నాయి. గత నెలలో దేశీయ మార్కెట్లో 1,58,829 యూనిట్లను విక్రయించగా, 26,168 యూనిట్లను ఎగుమతి చేసింది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా:
ఇకపోతే భారత నాలుగో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) మే 2011 విక్రయాలలో కేవలం 5.72 శాతం మాత్రమే వృద్ధిని సాధించి 1,45,723 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలానికి కంపెనీ విక్రయాలు 1,37,842 యూనిట్లుగా ఉన్నాయి.
ఇండియా యమహా మోటార్స్
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా ఇండియా మోటార్స్ మే 2011 విక్రయాలలో 55.04 శాతం వృద్ధిని సాధించి 38,812 యూనిట్లను విక్రయించింది. మే 2010లో యమహా విక్రయాలు 25,033 యూనిట్లుగా ఉన్నాయి. గత నెలలో యమహా దేశీయ మార్కెట్లో 27,959 యూనిట్లను విక్రయించగా, 10,853 యూనిట్లను ఎగుమతి చేసింది.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా:
జపాన్‌కు చెందిన మరో ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా గత నెల విక్రయాలలో 39.11 శాతం వృద్ధిని సాధించి 30,222 యూనిట్లను విక్రయించగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 21,725 యూనిట్లుగా ఉన్నాయి.
మహీంద్రా టూ వీలర్స్:
దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ద్విచక్ర వాహన విభాగమైన 'మహీంద్రా టూ వీలర్స్' గడచిన నెల విక్రయాలలో 36.34 శాతం వృద్ధిని సాధించి 10,790 యూనిట్లను విక్రయించింది. మే 2010లో కంపెనీ మొత్తం అమ్మకాలు 8,046 యూనిట్లుగా ఉన్నాయి.
విశ్లేషణ:
మొత్తమ్మీద మే 2011లో ద్విచక్ర వాహన పరిశ్రమ మంచి వృద్ధినే కనబరిచిందని చెప్పాలి. పెరిగిన ఇంధన ధరలు, వడ్డీరేట్లు, వాహన ధరలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మార్కెట్ పనితీరు మెరుగ్గానే ఉంది. గడచిన నెలలో మొత్తం 12.3 లక్షలకు పైగా యూనిట్లు అమేముడై 16.43 శాతం వృద్ధిని కనబరిచింది. మే 2010లో ఇవి 10.5 లక్షలు యూనిట్లు మాత్రమే. అలాగే నెంబర్ వన్ కంపెనీ హీరో హోండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2011-మార్చి 2012) ఇప్పటి వరకూ 10 లక్షలకుపైగా వాహనాలను, నెంబర్ టూ కంపెనీ బజాజ్ ఆటో ఇప్పటి వరకూ 6 లక్షలకు పైగా వాహనాలను విక్రయించిది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3 లక్షల యూనిట్లకు పైగా విక్రయించగా, హోండా 2.8 లక్షల యూనిట్లను విక్రయించింది. కానీ.. రానున్న రోజుల్లో మాత్రం ధరల పెరుగుదల కారణంగా ద్విచక్ర వాహన విక్రయాలు మందగించే ఆస్కారం ఉందని మార్కెట్ నిపుణలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








