ఫిబ్రవరి అమ్మకాలలో హీరో హోండా ఫస్ట్ బజాజ్ నెక్స్ట్

దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహనా తయారీ సంస్థ హీరో హోండా వరుసగా పదవసారి నాలుగు లక్షల విక్రయాల మార్కును అధిగమించింది. ఫిబ్రవరి, 2011 విక్రయాల్లో 23.54 శాతం వృద్ధిని సాధించి 4,72,055 వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 3,82,096 యూనిట్లుగా ఉన్నాయి. స్కూటర్ విభాగంలో హీరో హోండా అందిస్తున్న ప్లెజర్‌కు కూడా స్పందన భారీగానే పెరుగుతుంది. ఇవి సగటున ప్రతి నెలా 30,000 యూనిట్లు అమ్ముడవుతున్నట్లు కంపెనీ తెలిపింది.
బజాజ్ ఆటో లిమిటెడ్ @ +22.18% :
దేశీయ రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ ఫిబ్రవరి విక్రయాలలో 22.18 శాతం వృద్ధిని సాధించి 2,86,657 యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 2,34,623 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరిలో బజాజ్ ఎగుమతులు 31.93 శాతం వృద్ధిని సాధించి 77,642 యూనిట్ల నుంచి 1,02,433 యూనిట్లకు పెరిగాయి.
టీవీఎస్ మోటార్స్ @ +41% :
ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ టీవీఎస్ మోటార్స్ ఈ ఏడాది ఫిబ్రవరి విక్రయాలలో 41 శాతం వృద్ధిని సాధించినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి, 2011లో టీవీఎస్ మోటార్ 1,68,359 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 1,42,676 యూనిట్లుగా ఉన్నాయి. ఇక స్కూటర్ విభాగానికి వస్తే.. విక్రయాలు 49 శాతం పెరిగి గతేడాదితో పోలిస్తే రెట్టింపు విక్రయాలు నమోదయ్యాయి. ఫిబ్రవరి, 2011లో టీవీఎస్ స్కూటర్ విక్రయాలు 27,017 యూనిట్ల నుంచి 40,335 యూనిట్లకు పెరిగాయి.
హోండా మోటార్స్ @ +19.27% :
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) ఫిబ్రవరి, 2011 విక్రయాలలో 19.27 శాతం వృద్ధిని సాధించి 1,45,819 వాహనాలను విక్రయించినట్లు పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 1,22,261 యూనిట్లుగా ఉన్నాయి. భారత మార్కెట్‌లో 65,890 మోటర్‌సైకిళ్లను, 79,929 స్కూటర్లను విక్రయించినట్లు హెచ్‌ఎమ్ఎస్‌ఐ తెలిపింది.
సుజుకీ మోటార్‌సైకిల్ @ +24.86% :
ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటర్‌సైకిల్ ఫిబ్రవరి, 2011 విక్రయాలలో 24.86 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపింది. ఈ నెలలో కంపెనీ విక్రయాలు 28,738 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 23,016 యూనిట్లుగా ఉన్నాయి.
ఇండియా యమహా మోటార్ @ 28.26% :
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో యమహా విక్రయాలు 28.26 శాతం వృద్ధి చెంది 33,046 ద్విచక్ర వాహనాలను అమ్మినట్లు పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ 25,764 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. కాగా.. దేశీయ మార్కెట్‌లో 23,384 యూనిట్లను యమహా విక్రయించగా.. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో 17,131 యూనిట్లను విక్రయించింది.


Click it and Unblock the Notifications








