టీవీస్ మోటార్ కంపెనీ తమ ఆటో వినియోగదారులకు రీటైల్ ఫైనాన్సింగ్ సదుపాయాన్ని కలిగించేందుకు సిండికేట్ బ్యాంకుతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం టీవీఎస్ కింగ్ ఆటో కొనుగోలు చేయాలనుకునే వారికి తక్కువ మార్జిన్లతో సిండికేట్ బ్యాంకు రుణాలను అందిస్తుందని చెన్నయ్‌కు చెందిన టీవీఎస్ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగా సిండికేట్ బ్యాంకుకు ఉన్న మొత్తం 2,493 బ్రాంచీల ద్వారా టీవీఎస్ కింగ్ కొనుగోలు కోసం వినియోగదారులకు ఫైనాన్స్ సౌకర్యాన్ని బ్యాంకు కల్పిస్తుంది.
ఈ అలయన్స్ ద్వారా దేశవ్యాప్తంగా తమకు రాబోయే కొత్త వినియోగదారులను అందిచడమే కాకుండా, సిండికేట్ బ్యాంకుకు అలాగే టీవీఎస్ మోటార్ కంపెనీలు రెండిటికీ కొత్త మార్కెట్ల ఏర్పాటుకు మరియు వినియోగదారుల చేరికకు ఇది దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రెండు సంస్థలకు విస్తృతమైన నెట్‌వర్క్ ఉంది, ఇది ఇరు సంస్థలకు మంచి లబ్ధిని చేకూర్చగలదని టీవీఎస్ విశ్వసిస్తోంది.