85 శాతం హెల్మెట్లు ఐఎస్ఐ ప్రమాణాలు లేనివే..!

హెల్మెట్ తయారీదారులు తెలిపిన దాని ప్రకారం, భారత్‌లో అమ్ముడవుతున్న హెల్మెట్లలో సుమారు 85 శాతం హెల్మెట్లు ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణాలను పాటించనవి తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో రోడ్ సేఫ్టీ గురించి ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించటం జరిగింది. ఇందులో పాల్గొన్న స్టీల్ బర్డ్ హెల్మెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కపూర్ మాట్లాడుతూ, ఇండియాలో సుమారు 100 కంటే ఎక్కువ మంది ఐఎస్ఐ సర్టిఫై చేసిన హెల్మెట్లు తయారు చేసే కంపెనీలు లేవని తెలిపారు.
కానీ, వేలాదిమంది హెల్మెట్ తయారీదారులు ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ హెల్మెట్లను తయారు చేసి, వాహన చోదకుల ప్రాణాల్ని చిక్కుల్లో పడవేస్తున్నారని ఆయన అన్నారు. వీటిల్లో ఎక్కువ భాగం హెల్మెట్లను ప్లాట్‌ఫామ్‌ల మీద, రోడ్ల పక్కన, చవక బజార్లలో విక్రయిస్తుంటారని ఆయన తెలిపారు. ఇలాంటి నాణ్యతలేని హెల్మెట్లను కొనుగోలుచేసి వినియోగదారులు మోసపోతున్నారని రాజీవ్ చెప్పారు.
కాబట్టి, పది రూపాయాల ఆదాయం చూసుకొని పది కాలాల పాటు కాపాడుకోవాల్సిన మీ విలువైన జీవితాన్ని చిక్కుల్లో పడవేసుకోకండి. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు ఎల్లప్పుడు కూడా హెల్మెట్‌ను ధరించండి. అది కూడా నాణ్యమైన, ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన హెల్మెట్లను మాత్రమే వాడండి. ఐఎస్ఐ నాణ్యత ప్రమాణాలు కలిగిన హెల్మెట్లు రూ.500ల నుండి లభిస్తాయి.


Click it and Unblock the Notifications








