శక్తివంతమైన 375సీసీ ఇంజన్‌తో రానున్న సరికొత్త పల్సర్
సరికొత్త స్టయిలిష్ పల్సర్ 200 ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్‌తో బైక్ ప్రియులను ఆకట్టుకున్న బజాజ్ ఆటో ఇప్పుడు ప్రీమియం మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. పల్సర్ 200 ఎన్ఎస్ కన్నా మరింత శక్తివంతమైన బైక్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఓ 375సీసీ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. బజాజ్ ఆటో విడుదల చేసిన పల్సర్ 200 ఎన్ఎస్ మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించడం, అలాగే భారత మార్కెట్లో హై-ఎండ్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీ ఈ సెగ్మెంట్లోని అవకాశాలను దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తుంది.
బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ప్రకారం, కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఓ 375సీసీ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది. 2013లో ఈ కొత్త ఇంజన్‌ను ఉపయోగంలోకి రానుంది. కొత్తగా మార్కెట్లోకి రానున్న బజాజ్ 375సీసీ పల్సర్ డిజైన్ పరంగా, కంపెనీ ఇటీవల విడుదల చేసిన పల్సర్ 20 ఎన్ఎస్‌కు సమీపంలో ఉండనుంది. ఈ కొత్త పల్సర్‌కు 'పల్సర్ 390' లేదా 'పల్సర్ 400' అనే పేరు పెట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. పవర్‌ఫుల్ పల్సర్‌ను సొంతం చేసుకోవాలంటే వచ్చే ఏడాది వరకూ వేచి ఉండక తప్పదు మరి.
సెప్టెంబర్‌లో సేల్స్ ఢమాల్..
ఇదిలా ఉండగా, క్రితం సంవత్సరం సెప్టెంబర్ నెలతో పోల్చుకుంటే, గడచిన సెప్టెంబర్ నెలలో బజాజ్ ఆటో అమ్మకాలు 15.06 శాతం క్షీణించి 3,71,208 యూనిట్ల నుంచి 3,15,314 యూనిట్లకు పడిపోయాయి. కంపెనీ ఎగుమతులు కూడా 6.12 శాతం తగ్గి 1,33,222 యూనిట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. గడచిన సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ మొత్తం 1,41,913 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇకపోతే త్రిచక్ర వాహనాల విభాగంలో కూడా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో వీటి అమ్మకాలు 3.53 శాతం తగ్గుదలను కనబరచి 46,478 యూనిట్ల నుంచి 44,838 యూనిట్లకు పడిపోయాయి.


Click it and Unblock the Notifications









