ఈ వారంలోనే కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ విడుదల
బజాజ్ పల్సర్ ప్రియులకు శుభవార్త. కొత్త పల్సర్ రాక కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తున్న బైక్ ప్రియుల ఎదురు చూపులు త్వలరోనే ఫలించనున్నాయి. ఇటీవలే ప్రపంచపు తృతీయ అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీగా అవతరించిన బజాజ్ ఆటో, ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన సరికొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను ఈ వారంలోనే కంపెనీ వాణిజ్య పరంగా విడుదల చేయనుంది.
కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్ ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లోని డీలర్‌షిప్‌కు చేరిపోయింది. సాధారణంగా పల్సర్ బ్రాండ్‌కు మార్కెట్లో ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను బజాజ్ ఆటో మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు ఈ మోడల్‌కు అనూహ్య స్పందన లభించింది. డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తిని అందించాలనే ఉద్దేశ్యంతో బజాజ్ ఆటో ముందుగా కొంత స్టాక్‌ను సిద్ధం చేసుకున్న తర్వాత పల్సర్ 200ఎన్ఎస్‌ను మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించుకుంది.
అందుకే, కొత్త పల్సర్ 200ఎన్ఎస్ విడుదలను కంపెనీ వాయిదా వేస్తూ వచ్చింది. స్టయిలిష్ డిజైన్, స్పోర్టీ పెర్ఫామెన్స్‌ల కలయికతో రూపొందిన కొత్త పల్సర్ 200ఎన్ఎస్ మార్కెట్లో రాకెట్ వేగంతో దూసుకుపోవటం ఖాయం. పల్సర్ 200ఎన్ఎస్ బైక్‌లో, ప్రపంచంలోనే ఎక్కడాని లేని విధంగా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన 199.5సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.4 బిహెచ్‌పిల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 1.86 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
Bajaj Pulsar 200NS Photo Gallery:
కొత్త పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కేవలం 3.8 సెకండ్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని, అలాగే 9.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. (అంటే ఇది మంచి పికప్‌ను కలిగి ఉంటుందని అర్థం). పల్సర్ 200ఎన్ఎస్ గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఇంతటి శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీని కూడా ఇస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది.


Click it and Unblock the Notifications








